ap news

సీఎం టూర్ ఫ్లాప్ : ధ్వజమెత్తిన కాల్వ శ్రీనివాసులు

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటన ఫ్లాప్ షోగా నిలిచిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. బుధవారం ఆయన రాయదుర్గం తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. ఎస్కె,జేఎన్టీ యూనివర్సిటీల విద్యార్థులను ముఖ్యమంత్రి జగన్ సభకు తరలించడం చరిత్రలో ఇదే మొదటి సారి అన్నారు. ఎస్ కె యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ వైసీపీ మీద అత్యుత్సాహంతో విద్యార్థులను తరలించారన్నారు. జేఎన్టియు యూనివర్సిటీలో ఇంటర్నల్, సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసి మరీ విద్యార్థులను సీఎం. సభకు తరలించడం ఎంటని కాలవ ప్రశ్నించారు. నార్పల, చుట్టుపక్కల మండలాల్లో ఇటీవల వడగండ్ల వానకు దాదాపు రూ.230 కోట్ల పంట నష్టం వాటిల్లిందన్నారు. నార్పల సభలో పంట నష్టం గురించి జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం బాధాకరమన్నారు. భారీగా నష్టపోయిన అరటి తోట రైతులకు ఎందుకు భరోసా కల్పించలేదని జగన్ ను నిలదీశారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు జీవనాడి అయిన హంద్రీనీవా కాలువ విస్తరణ గురించి ఎందుకు ప్రస్తావించలేదని కాలవ ప్రశ్నించారు. జీడిపల్లి, బైరవాని తిప్ప ,పేరూర్ ప్రాజెక్టుల ఊసే ఎత్తకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. ఉరవకొండలో 50 వేల ఎకరాల బిందు సేద్యం, హంద్రీనీవా రెండో దశలో చేయాల్సిన పనుల గురించి మాట మాత్రంగానైనా మాట్లాడలేదన్నారు. అనంతపురం జిల్లాలో ప్రధాన అంశాల గురించి ప్రస్తావన చేయకపోతే, జగన్ పర్యటన వల్ల ఓరిగిందేమి లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జిల్లా పరిస్థితుల గురించి వివరించడంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలమయ్యారన్నారు. నాలుగేళ్లుగా జిల్లా సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన మోసకారిగా జగన్ మిగిలిపోతాడన్నారు. నాలుగేళ్లలో జగన్ రెడ్డి జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేసాడో చెప్పమని అడిగితే, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పొంతనలేని సమాధానాలు చెవుతున్నాడన్నారు. అనంతపురం జిల్లా భవిష్యత్తు గురించి ఆలోచన చేయలేని అసమర్థులు వైసిపి ఎమ్మెల్యేలన్నారు. నయవంచక పాలకుల భరతం పట్టాలని కాలవ శ్రీనివాసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp