ఒంగోలు బయోమైనింగ్ కేంద్రం ఆకస్మిక తనిఖీ

పనుల వేగం పెంచాలి
అధికారులకు పట్టాభిరామ్ ఆదేశాలు
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కొప్పోలు బయోమైనింగ్ కేంద్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. లెగసీ వేస్ట్ పనులు జరుగుతున్న తీరుని నిశితంగా పరిశీలించారు. స్థానిక అధికారులు, కాంట్రాక్టర్ల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పనుల వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఎఫ్ డిస్పోజల్ పై దృష్టిసారించాలని, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు.
ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ..ఒంగోలు నగరంలో ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. రోజుకు 160 టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేసే ఐఎస్ డబ్ల్యూఎం( ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) కేంద్రం ఏర్పాటుకు తగిన స్థలం త్వరితగతిన సేకరించమని అధికారులను ఆదేశించారు. ఐఎస్ అడబ్ల్యూఎం ద్వారా ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్సింగ్ జరుగుతుంది.
కొప్పోలు బయోమైనింగ్ కేంద్రంలో 61,929 మెట్రిక్ టన్నుల వేస్ట్ కోసం టెండర్లు పిలిచామని, అందులో 41 శాతం డిస్పోజల్ జరిగిందని చెప్పారు. అదనంగా 75,000 మెట్రిక్ టన్నుల వేస్ట్ తొలగింపు కోసం టెండర్ ప్రక్రియ జరుగుతోందని పట్టాభిరామ్ తెలిపారు.
