అపరిశుభ్ర వాతావరణంలో ఒంగోలు కూరగాయల మార్కెట్

ప్రజల అవసరాలు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి
మార్కెట్ ను పూర్తిస్థాయిలో ఆధునీకరించాలి
జిల్లా కలెక్టర్ కు ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లా మధు వినతి
ఒంగోలు నగరంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ ప్రాంతాన్ని ఆధునీకరించి, పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లా మధు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. కూరగాయల మార్కెట్ కు ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు, వ్యాపారులు, రైతులు, వినియోగదారులు వస్తుంటారు. నగర ప్రజల నిత్యావసరాలకు అత్యంత ముఖ్యమైన ఈ మార్కెట్ ప్రాంతాన్ని ఇటీవల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో రహదారులు వెడల్పు చేసినప్పటికీ పారిశుధ్య సమస్యలు, రోడ్లపై వాహనాల నిలుపుదల, ట్రాఫిక్ అంతరాయం, చెత్త పేరుకుపోవడం, సరైన డ్రైనేజీ లేకపోవటం, వ్యాపారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కొరత వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మా
ర్కెట్ పరిసరాల్లో కొంత మేర మాత్రమే పరిశుభ్రత కనిపిస్తుండగా, మిగిలిన ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. దీనివల్ల వ్యాపారులు, వినియోగదారులు, పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూరగాయల మార్కెట్ కావడంతో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ ఆంధ్ర

కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం, పరిశుభ్రత, పట్టణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఒంగోలు కూరగాయల మార్కెట్‌ను కూడా సమగ్రంగా ఆధునీకరించేందుకు చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ దీనిపై ప్రత్యేక శ్రద్ద కనబర్చి నగర ప్రజల అవసరాలు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆదునీకరించాలని కోరారు.
