రూ.37,702.15 కోట్లతో అమరావతి రాజధాని పనులు
- పనులకు ఆమోదం తెలిపిన సీఆర్డీఏ
- 17 న జరిగే క్యాబినెట్ లో ఆమోదం పొందిన వెంటనే పనులు ప్రారంభం
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి, మార్చి 11: దాదాపు రూ.37,702.15 కోట్ల విలువైన అమరావతి అభివృద్ది పనులకు సంబందించిన 59 టెండర్లకు సీఆర్డీఏ ఆమోదం తెల్పిందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ నెల 17 న జరిగే క్యాబినెట్ సమావేశంలో వీటన్నింటికీ ఆమోదం పొంది వెంటనే పనులను ప్రారంభించండ జరుగుతుందన్నారు. వచ్చే మాసంలో దాదాపు 20 వేల మంది అమరావతి అభివృద్ది పనుల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు అధ్యక్షతన 45 వ సీఆర్డిఏ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరిగిందని, ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ది పనులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. గతంలో దాదాపు రూ.48,012 కోట్ల విలువైన మొత్తం 73 పనులకు సీఆర్డీఏ మరియు క్యాబినెట్ ఆమోదంతో టెండర్లు పిలవడం జరిగిందన్నారు. వీటిలో దాదాపు రూ.37,702.15 కోట్ల విలువైన పనులకు సంబందించిన 59 టెండర్లను సోమవారం ఓపెన్ చేసి నేడు సీఆర్డీఏలో పెట్టి ఆమోదం పొందడం జరిగిందన్నారు. ఆ పనుల నిర్వహణకై లెటర్ ఆఫ్ ఇండెంట్ వెంటనే ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ మొత్తం 59 పనుల్లో సీఆర్డీఏకు చెందిన 22 పనుల విలువ దాదాపు రూ.22,607.11 కోట్ల అని, ఏడిసి కి చెందిన 37 పనుల విలువ దాదాపు రూ.15,095.04 కోట్లని ఆయన తెలిపారు. సీఆర్డీఏకు చెందినవి 24 పనులుకాగా ప్రస్తుతానికి 22 పనులకు సంబందించిన టెండర్లను మాత్రమే ఓపెన్ చేయడం జరిగిందని, మిగిలిన 2 పనులకు సంబందించిన టెండర్లను ఈ నెల 17 వ తేదీన ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు. ఇవి కాక ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జి, జాతీయ రహదారికి అనుసందానం చేసే రహదారులు, కరకట్ట రహదారి నిర్మాణం తదితర పనులకు సంబందించి దాదాపు రూ.16,871.52 కోట్ల విలువైన మరో 19 పనులకు ఈ నెలాఖరు లోపు టెండర్లు పిలిచి పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. అమరావతి అభివృద్ది పనులకు సంబందించి 2014-19 మద్యకాలంలో దాదాపు రూ.43 వేల కోట్ల విలువైన టెండర్లను పిలిచి, రూ.9 వేల కోట్ల వరకూ వెచ్చించడం జరిగిందన్నారు.

- 2014-19 మద్య కాలంలో పలు సంస్థలకు భూములు కేటాయించడం జరిగిందని, ఈ అంశంపై నిన్న జరిగిన మంత్రుల బృందం సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 31 సంస్థలకు కేటాయించిన భూములకు నేడు జరిగిన సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెల్పడం జరిగిందన్నారు. రెండు సంస్థలకు స్థలం మార్పుకు, మరో 11 సంస్థలకు స్థలం మార్పుతో పాటు కాల పరిధిని కూడా పొడిగించడం జరిగిందన్నారు.
అమరావతి క్యాపిటల్ సిటీ అభివృద్దికి దాదాపు రూ.64 వేల కోట్లు ఖర్చువుతుందని, అందుకు రాష్ట్ర ప్రజల నుండి వసూలు చేసే పన్నుల నుండి ఏమాత్రము ఖర్చు పెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన విధంగా జరుగుతుందన్నారు. రైతుల నుండి సేకరించిన భూముల్లో దాదాపు 6,203 ఎకరాలు సీఆర్డీఏకు మిగిలిందని, అందులో దాదాపు 1900 ఎకరాలను పలు సంస్థలకు కేటాయించడం జరుగుచున్నదన్నారు. ఇవి అన్నీ పోగా ఇంకా సీఆర్డీఏ వద్ద అభివృద్ది చేయబడిన స్థలం దాదాపు 4,000 ఎకరాలు ఉంటుందన్నారు. ఆ భూమి తనకా పెట్టడం ద్వారా మరియు వేలం పాట వేసి అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో క్యాపిటల్ సిటీని నిర్మించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుండి రూ.15 వేల కోట్లు మేర ఋణాన్ని తీసుకోవడం జరిగిందని, ప్రస్తుతం హడ్కో ద్వారా రూ.11 వేల కోట్లు, వివిధ బ్యాంకుల ద్వారా రూ.5 వేల కోట్ల మేర రుణాన్ని తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విధంగా దాదాపు రూ.31 వేల కోట్ల ను సమీకరించడం జరిగిందని, ఆ నిధులతో పనులను ప్రారంభిస్తున్నామన్నారు. ఈ అభివృద్ది పనుల వల్ల భూమి రేట్లు కూడా పెరుగుతాయని, అప్పుడు ఆ భూములను వేలం ద్వారా అమ్మి వచ్చిన సొమ్ముతో అసలు, వడ్డీలను కూడా తీర్చేయడం జరుగుతుందన్నారు. వివిధ బ్యాంకుల నుండి సమీకరిస్తు రుణాల నుండే వెచ్చించేందుకు బడ్జెట్ లో రూ.6 వేల కోట్లను అమరావతి అభివృద్ది పనులకు చూపడం జరిగిందన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో అన్ని రకాల భూములు కలుపుకుని దాదాపు 53,500 ఎకరాలు ఉందని, అందులో 30 శాతం వరకూ గ్రీన్ అండ్ బ్లూని అభివృద్ది పర్చడం జరుగుతుందని మంత్రి తెలిపారు.