ఒక పుస్తకం..100 మంది హీరోలు
ఒకరు కాదు..ఇద్దరు కాదు..వందమంది హీరోలు..వెండితెరపై కనిపించి అభిమానులతో ఔరా అనిపించుకునే గ్రాఫిక్ హీరోలు కాదు..అసలు సిసలు హీరోలు.. ప్రాణాలు పణంగా పెట్టి నేలతల్లి రుణం తీర్చుకునేందుకు జీవితాలను అంకితం చేసిన హీరోలు..తనువిచ్చిన తల్లి కోసం కాదు..భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు జాతిని జాగృతం చేసిన హీరోలు.. బ్రిటీషోడి తుపాకులకు గుండెలనెదిరొడ్డి ముందుకు నడిచిన హీరోలు..ఉరితాళ్లను ముద్దాడిన ధీరులు..అహింస అనే ఆయుధంతో మహాత్ముడు సాగించిన స్వతంత్ర సమర సంగ్రామాన్ని ఉప్పెనలా ఉరికించి ముందుకు నడిపించిన మహోన్నతులు..అస్పృశ్యత, అంటరానితంపై దునుమాడి రాజ్యాంగం అనే కరదీపికను ఈ దేశానికి కానుకగా అందించిన బాబా సాహెబ్ అంబేద్కర్ .. ఎన్నో సామాజిక సంస్కరణలకు ఊపిరిలూది ఉద్దీపనం చేసిన కాంతిధారులు..ఎందరో, మరెందరో..ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం..అన్ని మార్గాలు సమత, మమత, మానవతలను విరబూయించే పూలదోటలు..ధైర్యాన్ని కవచంగా ధరించి ముందుకు నడవమనీ, అన్యాయాన్ని నిగ్గదీసి నిలదీసి న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడబమని ప్రబోధించే మహాపురుషులు.. ఆర్ధిక వ్యత్యాసాలు, సామాజిక అంతరాలు లేని సమసమాజాన్ని కలలుగనమని ఉసిగొల్పి ఉరకలెత్తించిన ఉద్యమకారులు.. ఇలా విద్యార్ధి లోకానికీ, యువతకు స్పూర్తిదాయకంగా నిలిచే 100 మంది స్వాత్రంత్యోద్యమ హీరోలను పరిచయం చేస్తూ 100 HEROES INDIA అనే పుస్తకం The tale of freedom struggle అనే taglineతో మార్కెట్లోకి వచ్చింది. Fair Media తీసుకొచ్చిన ఈ పుస్తకానికి ప్రియ మితృడు, సీనియర్ పాత్రికేయుడు పండరీనాధ్ ప్రభలతో పాటు రాజేశ్వర్ బలిపిలు ఎడిటర్లుగా వ్యవహరించారు. 100 మంది హీరోలను గుదిగుచ్చి అందమైన పూలదండలా అల్లి ముఖచిత్రాన్ని తీర్చి దిద్దారు. పూజ్య బాపూజీని ఫోకస్ చేస్తూ మిగతా 99 మంది ఫొటోలను ముఖచిత్రంపై ముద్రించటం ఆకర్షణీయంగా ఉంది. ‘మేరా భారత్ మహాన్‘ ఫెయిర్ మీడియా రాసిన ముందుమాట తరువాత 1857 సిపాయిల తిరుగుబాటును పరిచయం చేస్తూ పుస్తకం ప్రారంభమవుతుంది. ఆరంభంలోనే విప్లవాగ్నిని రగిలించి ఆ తరువాత ఒక్కొక్క నిప్పు కణిక గురించి తెలియచేయటం ద్వారా త్యాగమనే చమురుతో నెత్తురుమండించిన స్వాత్రంత్రోద్యమ జ్వాల కళ్లమందు రగిలినట్టుగానే అనిపిస్తుంది.
The Heart and Soul of Freedom Struggle పేరుతో మహాత్మగాంధీనీ, The Legend పేరుతో అంబేద్కర్ నీ, Great Revelotionaries పేరుతో భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ నీ, The Immortal Warrior పేరుతో గిరిజన మహోద్యమకారుడు బిర్సా ముండాని పరిచయం చేయటం బాగుంది. Dalit Movemnets in Telugu States పేరుతో దళితోద్యమాల పరిచయం కూడా ఉంది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, పట్టాభి సీతారామయ్య వంటి సామాజిక సంస్కరణవాదులు, స్వాతంత్ర్య సమరయోధుల వివరాలను కూడా తెలియచెప్పారు…ఇలా 100 మంది హీరోల గురించే కాదు..ఆయా కాలాల్లోని సంస్కరణోద్యమాలను కూడా క్లుప్తంగానే అయినా విద్యార్ధిలోకానికి అర్ధమయ్యే రీతిలో..సరళమైన ఇంగ్లీషు, తెలుగు భాషల్లో వచ్చిన పుస్తకం ఖచ్చితంగా నేటి తరం చదవదగిందిగా భావిస్తున్నాను. ప్రచురణకర్తలు చెప్పినట్టు పాఠశాల పిల్లలు, పోటీ పరీక్షల ఆశావహులతో పాటు పౌరులందరికీ ఇది స్ఫూర్తిదాయకమైన పుస్తకం.
పుస్తకాల కోసం సంప్రదించవలసిన చిరునామా
fair media
Hyderbabad
Email : info.fairmedia@gmail.com
mobile : 9666242767