ap news

కాంగ్రెస్ లో రాహుల్ పాదయాత్ర జోష్

బీజేపీ రాజ్యాంగాన్ని బలహీనపరచి, స్వార్ధ ప్రయోజనాల కోసం పాలన చేస్తున్నారు.

రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ఎపీకి ప్రత్యేక హోదా ఫైల్ పైనే

భారత్ కు భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడిని బీజేపీ విచ్చినం చేస్తుంది

భారత్ జోడో యాత్ర ను చూసి బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ భయపడుతున్నాయి

బీజేపీ విభజన చట్టం అంశాలు, హోదా ఇవ్వకుండా ఎపీకి అన్యాయం చేశాయి.

టిఆర్ఎస్…. బీఆర్ఎస్ కాదు.. టిఆర్ఎస్ కు విఆర్ఎస్ తప్పదు

ఏపీలో భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో ఎఐసీసీ నేతలు.. దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్

కర్నూలులో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న జైరాం రమేష్

రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర కు దేశ ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుందని, అందుకే బీజేపీ, ఆర్.యస్.యస్ నేతలు భయపడుతున్నారని ఎఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాష్ట్ర విభజన తరవాత బీజేపీ ప్రభుత్వం ఏపీ కి విభజన చట్టం అంశాలు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎపీకి అన్యాయం చేశాయని గుర్తు చేశారు. బీజేపీ రాజ్యాంగాన్ని బలహీనపరచి, స్వార్ధ ప్రయోజనాల కోసం పాలన చేస్తున్నారని, రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ఎపీకి ప్రత్యేక హోదా ఫైల్ పైనేనని జైరాం రమేష్ స్పష్టం చేశారు. ఏపీలో భారత్ జోడో యాత్రపై కర్నూలులో కాంగ్రెస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎఐసీసీ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, ఉమెన్ చాందీ, ఎపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్, ఎపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కెవిపి రామచంద్ర రావు, పల్లం రాజు తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే రాహుల్ గాంధీ జోడో యాత్రకు సంబంధించిన సీడీలు, పోస్టర్లను నేతలు ఆవిష్కరించారు. దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ భారత్ కు భిన్నత్వంలో ఏకత్వం బలమని, ఇపుడు బీజేపీ దాన్ని విచ్చినం చేస్తుందని విమర్శించారు. భారత్ జోడో యాత్ర మొదలై నెల కూడా పూర్తి కాకుండానే బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ యాత్ర గురించి భయపడుతున్నాయని, భారత్ లో నిరుద్యోగం, పేదరికం పెరుగుతోందని, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందన్నారు. కాంగ్రెస్ ఏపీ లో ఖచ్చితంగా బలపడుతుందని, జై రాం రమేష్ మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర తమిళనాడు , కేరళ పూర్తయిందని, 18న ఏపీ కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతంలో ఉంటుందని తెలిపారు. ఏపీలో 5 రోజుల పాటు 85 కిమీ పాదయాత్ర సాగుతుందన్నారు. 3,570 కి.మీ రాహుల్ పాదయాత్ర చేస్తారని, తెలుగులో భారత్ జోడో థీమ్ పాట 18న విడుదల చేస్తామన్నారు. ఆర్థిక అసమానత పెరగడం, కుల,మత, బాషా, సామాజిక విభజన, రాజకీయ కేంద్రీకృతం..వీటికి వ్యతిరేకంగా భారత్ జోడో కొనసాగుతుందన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని బలహీనం చేశారని, స్వార్ధ రాజకీయాల కోసం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కు భారత్ జోడో యాత్ర సంజీవిని లాంటిదని, పార్టీకి ప్రజల ఆదరణ మరింత పెరుగుతుందన్నారు. ప్రత్యేక హోదా అన్నారు… వెంకయ్యనాయుడు పదిహేనేళ్లని చెప్పారు.. ఏదీ లేకుండా మోసం చేశారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ పైనేనని, విభజన బిల్లులోని అన్ని అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు.

కర్నూలులో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న దిగ్విజయ్ సింగ్

టిఆర్ ఎస్ కు విఆర్ఎస్ తప్పదు

టిఆర్ ఎస్…. బీఆర్ ఎస్ కాదని, టి ఆర్ ఎస్ కు విఆర్ ఎస్ తప్పదంటూ కేసీఆర్ కు చురకలు అంటించారు. ఎపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ మాట్లాడుతూ ఈ దేశాన్ని మతోన్మాదుల నుంచి కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ను చేపట్టారని, తెలుగు ప్రజలంతా తరలి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. ఎపీలో రాహుల్ గాంధీ యాత్ర అడుగు పెట్టగానే వేలాది మందితో ఘన స్వాగతం పలుకుతామని, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పెరుగుతున్న ప్రజాబలం ఏమిటో చూపిస్తామని, కార్యకర్తలు, అభిమానులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాహుల్ గాంధీని మించిన లీడర్, మానవతావాది, దేశ భక్తుడు లేరని, అందుకే నేడు దేశ ప్రజలందరూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. రాహుల్ పాదయాత్ర తర్వాత ఎపీ రాజకీయాలలో కీలక పరిణామాలు ఉంటాయని, కాంగ్రెస్ కు పూర్వవైభవం వస్తుందని శైలజానాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఎపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని, ఇది నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. సమయం లేదు మిత్రమా.. త్వరపడండి.. అంటూ అక్టోబర్ 17 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, తమ నేతకు అపూర్వమైన స్వాగతం పలికేలా కదలి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ మాయలు, మోసాలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, రాహుల్ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారనే విషయం ఈ జోడో యాత్ర ద్వారా స్ఫష్టంగా అర్దమవుతుందన్నారు. ఇదే స్పూర్తితో ఎపీలో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూసే విధంగా రాహుల్ యాత్ర ను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ భారతదేశానికి, భారత దేశ ప్రజలకు ఎంతో గుర్తింపు, గౌరవం వచ్చాయని, కుల, మతాలకు అతీతంగా భారతదేశాన్ని అగ్రగామిగా ఉంచే సత్తా కాంగ్రెస్ కే ఉందన్నారు. కొన్ని కొన్ని దురదృష్టకరమైన పరిస్థితులలో కాంగ్రెస్ కు కష్ట కాలం వచ్చిందని, మళ్లీ కొత్త ఉత్సాహంతో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేలా ఐక్యంగా పని చేయాలని సూచించారు. మత తత్వ కుట్రలతో పాలించే బీజేపీ ని దేశం నుంచి తరిమికొట్టే బాధ్యత అందరిపైనా ఉందని, అందుకు రాహుల్ యాత్రను జయప్రదం చేసేలా అందరూ కలిసి పని చేయాలని కోరారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *