ap news

పార్లమెంటులో ఏపీ గళం

  • సచివాలయంలో వైయస్సార్‌సీపీ పార్లమెంటు సభ్యులతో సీఎం 
    వైయస్‌.జగన్‌ సమావేశం
  • శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం సమావేశం
  • ఎంపీలకు మార్గ నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌
  • రాష్ట్ర ప్రయోజనాలకోసం వివిధ అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్న సీఎం

ఎంపీలతో ముఖ్యమంత్రి ఏమన్నారంటే….:

– పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల (రూ. 55,657) ఆమోదానికి కృషిచేయాలన్న ముఖ్యమంత్రి.
– జాతీయ హోదా ప్రాజెక్టు అంటే విద్యుత్తు, సాగునీరు, తాగునీరు అంశాల కలయిక.
– ఎప్పుడూలేని విధంగా తాగునీటి అంశాన్ని విడదీసి చూస్తున్నారు.
– ప్రాజెక్ట్‌ పనుల్లో కాంపొనెంట్‌ వారీగా డబ్బులిస్తామని చెప్తున్నారు.
– ఇంకా ఆమోదించాల్సిన డిజైన్లు కూడా ఉన్నాయి.
– ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.2,104 కోట్లు ఖర్చుపెట్టింది. ఆ డబ్బు ఇంకా కూడా రీ యింబర్స్‌కాలేదు.
– ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. గట్టిగా ఒత్తిడి తీసుకురావాలి.

– సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఇటీవలే తిరుపతిలో జరిగింది. ఇందులో 6 ప్రధాన అంశాలను ప్రస్తావించాను. అత్యంత ముఖ్యమైనవి. వీటిని కూడా ఉభయ సభలద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.., ఒత్తిడి తీసుకురావాలి.

– జాతీయ ఆహార భద్రతా చట్టం కింద… లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత లేదు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో పేదరికం ఎక్కువగా ఉందనే కోణంలో గణాంకాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇది వాస్తవ విరుద్ధం. తలసరి ఆదాయం ప్రాతిపదికన ఆరాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో చాలా తక్కువ. దీన్నికూడా ఉభయ సభల్లో ప్రస్తావించాలి.

– ఏపీ సివిల్‌ సప్లై కార్పొరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,703 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటిని చెల్లించాల్సిందిగా వెంటనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.

– రాష్ట్ర విభజన తర్వాత మన విద్యుత్‌ను తెలంగాణ ప్రభుత్వం వాడుకుంది. రాష్ట్రానికి తెలంగాణ రూ. 6,112 కోట్ల బకాయి పడింది. వీటిని ఇప్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. డీమెర్జర్‌తో ఈ బకాయిలకు ముడిపెట్టడం సరైనది కాదు. బకాయి డబ్బును రాష్ట్రానికి ఇవ్వాల్సిందే. ఏపీకీ చెందిన వివిధ జనరేషన్‌ సంస్థలు, కరెంటు పంపిణీ సంస్థలు వివిధ సంస్థలనుంచి అప్పులు తెచ్చుకున్నాయి. వాటికి వడ్డీ సహా మనం చెల్లింపులు చేయాల్సి ఉంది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు కూడా వడ్డీ సహా ఇవ్వాల్సి ఉంది. ఎంపీలు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి.

– రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ అంశాన్ని కూడా సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రస్తావించాను. రాష్ట్ర విభజన సమయంలో మొత్తంగా రీసోర్స్‌ గ్యాప్‌ రూ. 22, 948.76 కోట్లు అయితే ఇచ్చింది, రూ. 4,117.89 కోట్లు మాత్రమే. దీనిపై కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.
ఫిబ్రవరి 20, 2014 నాటికి ఉన్న రీసోర్స్‌ గ్యాప్‌ను 2014–15 బడ్జెట్‌ ద్వారా పూడుస్తామని చెప్పారు. కాగ్‌నిర్దేశించిన ప్రకారం గ్యాప్‌ విలువ రూ. 16,078.76 కోట్లు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఎఫ్‌ లాంటి బకాయిలతో కలిపి మొత్తంగా రూ. 22,948.76 కోట్లకు చేరింది. వీటికోసం కూడా ఎంపీలు కృషిచేయాలి.

– ఓవర్‌ బారోయింగ్‌ పేరుతో రుణాలు కత్తిరించడం అన్నది ఎప్పుడూ లేదు. చంద్రబాబుగారి హయాంలో చేసిన దానికి రుణాల్లో కత్తిరింపులకు దిగడం అన్నది సరికాదు. ఈ అంశాన్ని సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో కూడా ప్రస్తావించాను. గత ప్రభుత్వ హయాంలో పరిమితికి మించి రుణాలు సేకరించారన్న కేంద్ర ఆర్థిక శాఖ, ఈ ఏడాది నిర్ధారించిన నికర రుణ పరిమితి (ఎన్‌బీసీ)లో సర్దుబాటు చేసే విధంగా రుణ పరిమితిలో ఆ మేరకు కోత విధించింది. గత ప్రభుత్వం చేసిన అధిక రుణాలకు తమ బాధ్యత లేకపోయినప్పటికీ ఎన్‌బీసీలో కోత విధించడం సరి కాదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కేంద్ర ఆర్థిక శాఖ సమ్మతించకపోగా, నికర రుణ పరిమితిలో కోతను ఏకంగా మరో మూడేళ్లకు విస్తరించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు పరిమితికి మించి రుణం సేకరించిన విషయం అప్పటికే తేటతెల్లం అయిన నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక శాఖ ఆనాడే ఎందుకు స్పందించలేదు?. దాన్ని కట్టడి చేస్తూ ఆ తర్వాత ఏడాది, అంటే 2018–19లోనే రుణ సేకరణలో పరిమితి ఎందుకు విధించలేదు?. నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవి గ్రాంట్‌కాదు. వివిధ అవసరాల కోసం ప్రభుత్వం సేకరిస్తున్న రుణాల ఇవి. ఈ రుణాలను సక్రమంగా తీరుస్తోంది కూడా. అలాంటప్పుడు నికర రుణ పరిమితిలో కోత విధించడం సరికాదు. అంశాన్ని ఉభయ సభల్లో ప్రస్తావించి రాష్ట్రానికి మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.

– రాష్ట్రంలో ఇటీవల వరదల సందర్భంగా అపార నష్టం ఏర్పడింది.
వరద బాధితులను ఆదుకునేందకు తక్షణ సహాయంగా రూ.వేయి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. ప్రధానికి, కేంద్ర హోంమంత్రికి లేఖలు కూడా రాశాం. ఈ అంశాన్ని ప్రస్తావించి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.

– బీసీల అభ్యున్నతి దిశగా స్పష్టమైన కార్యాచరణకు దోహదపడేలా
2021 జన గణన సదర్భంగా బీసీ కులాల వారీగా జన గణన చేయాలని కోరాం. దీనికోసం ఒత్తిడి తీసుకు రావాలి. ఈమేరకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం.

– ఉపాధిహామీ కింద రూ. 4976.51 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిని విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.

– విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని పలుమార్లు లేఖలు రాశాం. పెట్టుబడుల ఉపసంహరణకు బదులుగా ప్రత్యామ్నాయాలను కూడా సూచించాం. దీనిపై అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది. ఈమేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.

– రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలను తీసుకు వస్తున్నాం. ఇంకా 13 కాలేజీలకు అనుమతి రావాల్సి ఉంది. ఈ అంశాన్ని సభలో ప్రస్తావించాలి.

– ఇళ్ల నిర్మాణం వల్ల ఏర్పడుతున్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. దీనికోసం కూడా ఎంపీలు కృషిచేయాలి.

– దిశబిల్లు ఆమోదం ప్రక్రియను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాలి.

– 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి కేంద్రం నిర్ణయించింది. అదే సమయంలో ఎంఎస్‌పీలకు సంబంధించి కొత్త చట్టం చేయాలని కూడా రైతులు కోరుతున్నారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. రైతుల డిమాండ్‌కు మన పార్టీ తరఫున మద్దతు పలకాలి.

– ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడించింది. మరో 2 ఏళ్ల తర్వాత ఎన్నికల కాలం వచ్చేస్తుంది. మన పార్టీకి అంటూ ఒక సిద్ధాంతం ఉంది. మనకంటూ సొంతంగా బలం ఉంది. మనం ఏ కూటమిలోనూ లేము, ఏ పార్టీ తరఫునా కాము. మనం ప్రజల కూటమి. మనం లేవనెత్తుతున్న ప్రతి అంశం కూడా ప్రజల తరఫునే. మనం వేసే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ప్రజలకు మేలు జరిగే ఏ అంశంకోసమైనా మనం ముందడుగు వేయాలి. ఎంపీలు అంతా కలిసికట్టుగా ముందుకు సాగాలి. సమిష్టిగా రాష్ట్రంకోసం పనిచేయాలి. మనకంటూ బలం ఉంది… మన పార్టీకి ప్రతిష్ట ఉంది. ఆ ప్రతిష్టను నిలబెట్టేలా, ప్రతిక్షణం ప్రజలకోసం పాటుపడాలి. ప్రజల మేలు కోసం జరిగే అంశాల్లో మనం ముందుకు అడుగు వేయాలి.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *