ముద్రగడను వైసీపీ నేత ఆకుల శ్రీనివాస్ భేటీ
కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభంను వైసిపి రాష్ట్ర నాయకులు, ప్రముఖ కాపు నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ కలసి అభినందనలు తెలియజేశారు. మంగళవారం ఉదయం పత్తిపాడు నియోజకవర్గం కిర్లంపూడి గ్రామంలోని ముద్రగడ నివాసంలో ఆయనని కలిసి అభినందనలు తెలియ చేయడం జరిగింది. తుని రైల్ దగ్ధం కేసులో విజయవాడ రైల్వే కోర్టు ముద్రగడ తో పాటు నలబై మందినీ నిర్దోషులుగా ప్రకటించడం పట్ల ముద్రగడను ఆకుల శ్రీనివాస్ కుమార్ స్వయంగా కలిసి అభినందనలు తెలియ చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్షతో ముద్రగడను, ఆయన కుటుంబ సభ్యులను తుని కేసు విషయంలో కావాలని అవమానాలు పాలు చేశారని ఆకుల విమర్శించారు. తుని రైలు దహనం సంఘటనతో ఎటువంటి సంబంధం లేని ముద్రగడను, పలువురు కాపు నాయకులను కేసులో ఇరికించడం దారుణమని ఆనాడే తాము ఆందోళన తెలియజేశామన్నారు. ముద్రగడను నిర్దోషిగా పేర్కొంటూ రైల్వే కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయనను స్వయంగా కలిసి అభినందనలు తెలియజేద్దామని కిర్లంపూడి కి వచ్చినట్లు ఆకుల శ్రీనివాస్ తెలిపారు. కాగా ముద్రగడను ఆకుల శ్రీనివాస్ తో పాటు కలిసిన వారిలో విజయవాడ వైఎస్సార్ పార్టీ నాయకులు పొదిలి చంటి బాబు, న్యాయవాది యరజర్ల మురళి ,మేళం చిన్నా, వైఎస్సార్ పార్టీ మైనార్టీ నాయకుడు సలీమ్ ఫర్వేజ్ తదితరులు పాల్గొన్నారు.