చంద్రబాబు నివాసంలో చండీయాగం
అమరావతి : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో శుక్రవారం చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా మొదటి రోజు యజ్ఞ క్రతువులు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ప్రార్థించారు. గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల వారి పర్యవేక్షణలో 40 మంది రిత్వికులు యాగం నిర్వహించారు. రేపు, ఎల్లుండి కూడా యజ్ఞహోమాది కార్యక్రమాలు జరగనున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు పార్టీ నేతలు కుటుంబ సభ్యులతో కలిసి యాగంలో పాల్గొన్నారు.