ap news

పోలింగ్ శాతం అధికంగా ఉండాలి

– పోలింగ్ శాతం త‌క్కువ‌గా ఉన్న ప్రాంతాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాలి
– స్వీప్ కార్య‌క్ర‌మాలను క్రియాశీలంగా ఉండేలా చూడాలి.
– ప‌టిష్ట జిల్లా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ప్ర‌ణాళిక (డీఈఎంపీ)ల అమ‌లుతో స‌జావుగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌. – ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలపై దృష్టి సారించాలి
– సీనియ‌ర్ డిప్యూటీ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్లు ధ‌ర్మేంద్ర శర్మ, నితీష్ వ్యాస్ ల నేతృత్వంలోని ఈసీఐ ప్ర‌తినిధుల బృందం

ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల పూర్తిస్థాయి భాగ‌స్వామ్యం ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ ప‌రిర‌క్ష‌ణ‌కు మూల‌మ‌ని.. ఓట‌ర్ల జాబితా 100 శాతం స్వ‌చ్ఛ‌త ఎంత ముఖ్య‌మో ప్ర‌తి ఒక్క‌రూ ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డం కూడా అంతే ముఖ్య‌మ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఈసీఐ) ప్ర‌తినిధుల బృంద సార‌థి సీనియ‌ర్ డిప్యూటీ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ ధ‌ర్మేంద్ర శర్మ అన్నారు.
ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక సంక్షిప్త స‌వ‌ర‌ణ (ఎస్ఎస్ఆర్)-2024, సాధార‌ణ ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త కార్య‌క‌లాపాల‌పై శుక్ర‌వారం నోవాటెల్‌లో స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి సీనియ‌ర్ డిప్యూటీ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్లు ధ‌ర్మేంద్ర శ‌ర్మ‌, నితీష్ వ్యాస్‌; స్వీప్ డైరెక్ట‌ర్ సంతోష్ అజ్మేరా, అండ‌ర్ సెక్ర‌ట‌రీ సంజ‌య్ కుమార్‌తో పాటు ఏపీ చీఫ్ ఎల‌క్టోర‌ల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా, అడిష‌న‌ల్ చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ ఎంఎన్ హరేంధిర‌, జాయింట్ చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ ఎ.వెంక‌టేశ్వ‌ర‌రావు, స్టేట్ పోలీస్ నోడ‌ల్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. స‌మావేశంలో ఈసీఐ సీనియ‌ర్ డిప్యూటీ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ ధ‌ర్మేంద్ర శ‌ర్మ మాట్లాడుతూ అర్హ‌త ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఓటు న‌మోదు చేసుకునేలా, అదే విధంగా ఎన్నిక‌ల్లో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకునేలా అవ‌గాహ‌న క‌ల్పించి, ప్రోత్స‌హించ‌డం ప్ర‌ధాన‌మ‌ని పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గాలు, బూత్ స్థాయిలో గ‌తంలో న‌మోదైన పోలింగ్ శాతాల‌ను ప‌రిశీలించి.. త‌క్కువ‌గా ఉన్నచోట అందుకు కార‌ణాల‌ను శాస్త్రీయంగా అధ్య‌య‌నం చేసి పోలింగ్ శాతం పెంచేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా సిస్ట‌మాటిక్ ఓట‌ర్స్ ఎడ్యుకేష‌న్ అండ్ ఎల‌క్టోర‌ల్ పార్టిపిషేన్ (స్వీప్‌) కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని సూచించారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను స‌జావుగా, విజ‌య‌వంతంగా ఎలాంటి అవ‌రోధాలు లేకుడా పూర్తిచేసేందుకు స‌మ‌గ్ర‌, ప‌టిష్ట ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ప్ర‌ణ‌ళిక (ఈఎంపీ) అవ‌స‌ర‌మ‌ని.. స్వ‌చ్ఛ‌మైన ఓట‌ర్ల జాబితాతో పాటు స‌మ‌ర్థ, సుశిక్షితులైన మాన‌వ‌న‌రులు, మెటీరియ‌ల్ త‌దిత‌రాల‌పై దృష్టిసారించాల‌న్నారు. ప్ర‌స్తుతం ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ వేదిక‌లు ఓట‌ర్ల జాబితా రూప‌క‌ల్ప‌న‌, ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో అత్యంత ప్రాధాన్య‌త సంతరించుకున్నాయ‌ని.. ఈఎస్ఎంఎస్‌, సువిధ‌, ఈఎన్‌కోర్‌, సీ విజిల్‌, ఈటీపీబీఎంఎస్‌, వోట‌ర్ ట‌ర్న‌వుట్‌, కౌంటింగ్ ఓట్స్ యాప్‌ల‌పై అధికారులు, సిబ్బందికి త‌ప్ప‌నిస‌రిగా అవ‌గాహ‌న ఉండాల‌న్నారు. జిల్లాస్థాయిలోనూ స‌మ‌ర్థ‌వంత మాన‌వ వ‌న‌రుల‌తో ఐటీ టీమ్స్ ఏర్పాటుచేయాల‌ని సూచించారు. సిబ్బందికి స‌రైన విధంగా శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హించాల‌న్నారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో నిర్వ‌హించేందుకు ఐటీ వేదిక‌లు దోహ‌దం చేస్తాయ‌న్నారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రివెంటివ్ చర్యలపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు.

కీల‌క అంశాల‌పై దిశానిర్దేశం:
ఓటు హ‌క్కుపై స్ఫూర్తిదాయ‌క‌మైన ప్ర‌ముఖుల‌తో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు, విశ్వ‌స‌నీయ‌త పెంపొందిస్తూ క్షేత్ర‌స్థాయి త‌నిఖీల ఆధారంగా ఓటుకు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారం, మ‌ద్యం, డ‌బ్బు త‌దిత‌రాల అక్ర‌మ ర‌వాణాల‌ను అడ్డుకునేందుక స‌రిహ‌ద్దు జిల్లాలు, రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం, ఎన్నిక‌ల స‌మ‌యంలో న‌మోదైన కేసుల విచార‌ణ, రాజ‌కీయ త‌ట‌స్థ‌త క‌లిగిన ఎన్‌జీవోలు, పౌర సంస్థ‌ల భాగ‌స్వామ్యం, పోలీస్‌, ఎక్సైజ్‌, రెవెన్యూ త‌దిత‌ర శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం త‌దిత‌రాల‌పై ఈసీఐ అధికారులు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో క‌ళాశాల‌లు, పారిశ్రామిక క‌మ్యూనిటీల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా పోలింగ్ శాతాన్ని పెంచొచ్చ‌న్నారు. ఓటరు ట‌ర్నౌవుట్ ఇంప్లిమెంటేష‌న్ ప్లాన్‌ల అమ‌లుపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌న్నారు. జ‌న‌జాగృతికి వీలుక‌ల్పించే ప్ర‌చార సామ‌గ్రిని పిక్టోర‌ల్ ఫార్మాట్‌లో కూడా అందించ‌డం వ‌ల్ల గ్రామీణ ప్రాంతాల్లో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు మంచి ఫ‌లితాలు ఇస్తాయ‌ని ఈసీఐ అధికారులు సూచించారు.

క‌లెక్ట‌ర్లు, ఎస్‌పీల ప‌వ‌ర్ ప్రాయింట్ ప్ర‌జంటేష‌న్‌:
స‌మీక్షా స‌మావేశంలో జిల్లాల క‌లెక్ట‌ర్లు ఎస్ఎస్ఆర్‌-2024, సాధార‌ణ ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త కార్య‌క‌లాపాలపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇవ్వ‌గా.. ఎస్‌పీలు శాంతిభ‌ద్ర‌త‌ల అంశాల‌పై ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. జిల్లాలోని అసెంబ్లీ, పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాలు, ఓట‌ర్ల జాబితా స్వ‌చ్ఛీక‌ర‌ణ ప్ర‌క్రియ‌, గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశాలు, వారి ఫిర్యాదుల ప‌రిష్కారం, వివిధ ఫారాల ప‌రిష్కారం, ఇంటింటి స‌ర్వే, అనామ‌లీస్, ఫొటో, డెమోగ్రాఫిక్ సిమిలారిటీల ప‌రిష్కారం, స్వీప్ కార్యక్రమాల నిర్వహణ, డిస్పాచ్‌, రిసీట్‌, ట్రైనింగ్ సెంట‌ర్లు, ఎన్నిక‌ల సిబ్బంది, శిక్ష‌ణ త‌దిత‌రాలను క‌లెక్ట‌ర్లు వివ‌రించారు. అదే విధంగా జిల్లాల ఎస్‌పీలు.. శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌, గ‌త ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ స‌మ‌యంలో ఉల్లంఘ‌న‌ల‌కు సంబంధించి న‌మోదైన కేసుల విచార‌ణ‌, అక్ర‌మ మ‌ద్యం, డ‌బ్బు త‌ర‌లింపుల‌ను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌లు, చెక్‌పోస్టుల మ్యాపింగ్‌, స‌మ‌స్యాత్మ‌క, వ‌ల్న‌ర‌బుల్ పోలింగ్ స్టేష‌న్లు త‌దిత‌రాలపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.

పార‌ద‌ర్శ‌కంగా ఎస్ఎస్ఆర్‌-2024: సీఈవో ముఖేష్ కుమార్ మీనా
రాష్ట్రంలో ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక సంక్షిప్త స‌వ‌ర‌ణ-2024 ప్రక్రియ అత్యంత పార‌ద‌ర్శ‌కంగా జ‌రుగుతోంద‌ని రాష్ట్ర చీఫ్ ఎల‌క్టోర‌ల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అధిక సంఖ్య‌లో ద‌ర‌ఖాస్తులు అందాయ‌న్నారు. ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా వాటిని ప‌రిష్క‌రిస్తున్న‌ట్లు తెలిపారు. ఎస్ఎస్ఆర్‌-2023 కింద ఈ ఏడాది జ‌న‌వ‌రి 5న తుది జాబితా ప్ర‌చురించిన తర్వాత నుంచి దాదాపు 90 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని.. వీటిలో 89 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారం పూర్త‌యింద‌న్నారు. మిగిలిన ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారం ఈ నెల 26లోగా పూర్తికానున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి వారం గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌మావేశాలు జ‌రుగుతున్నాయ‌ని.. వారి సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటూ ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రిస్తున్న‌ట్లు వివ‌రించారు. నిర్వ‌హిస్తున్న‌ట్లు వివ‌రించారు. జిల్లా అధికార యంత్రాంగం ఎస్ఎస్ఆర్‌-2024, ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త‌కు సంబంధించి ప్ర‌తి ద‌శ‌లోనూ స‌మ‌స్య‌ను స‌రైన విధంగా గుర్తించ‌డం, విశ్లేషించ‌డం, ప‌రిష్క‌రిస్తున్న‌ట్లు తెలిపారు. స‌మీక్షా స‌మావేశంలో ఈసీఐ ప్ర‌తినిధుల బృందం మార్గ‌ద‌ర్శ‌కాలు భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌లో పురోగ‌తికి దోహ‌దం చేస్తాయ‌ని సీఈవో ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.
స‌మావేశంలో 26 జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్‌పీల‌తో పాటు ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు, పోలీస్ క‌మిష‌న‌ర్ కాంతిరాణా టాటా, జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, స‌బ్ క‌లెక్ట‌ర్ అదితి సింగ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *