మహిళలపై హింసను అంతమొదించాలి
ఆర్ధికంగా పురోగతి సాధించాలి
సీనియర్ ఐఏఎస్ అధికారి కాకి సునీత
దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో ప్రచారోద్యమం
దళిత, ఆదివాసీ స్త్రీలపై, బాలికలపై జరుగుతున్న హింసను రూపుమాపాలని సీనియర్ ఐఏఎస్ అధికారి కాకి సునీత అన్నారు. అంతర్జాతీయ ప్రచారోద్యమంలో భాగంగా దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సభలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.న సభకు దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ గెడ్డం ఝాన్సీ అధ్యక్షత వహించారు. హింస లేని సమాజం రావాలంటే పేద మహిళల్లో చైతన్యం రావాలన్నారు. ఏదైనా ప్రాంత అభివృద్దిని అంచనా వేయాలంటే ఆ ప్రాంతంలోని దళిత స్త్రీ అభివృద్ధిని కొలమానంగా తీసుకోవాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పారని ఆమె గుర్తు చేశారు. మహిళలు ఆర్ధికంగా బలపడేకొద్దీ హింస కూడా తగ్గుముఖం పడుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సక్రమంగా అమలయ్యేలా నిబంధనలు, నియమాలపై సంపూర్ణ చైతన్యంతో వ్యవహరించాలన్నారు. దళిత స్త్రీ శక్తి చేపట్టిన ప్రచారోద్యమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గడ్డం ఝాన్సీ మాట్లాడుతూ దళిత ఆదివాసీ స్త్రీలు జ్ఞానవంతులై సమాజాన్ని మార్చే యోధులుగా మారాలన్నారు. ఈ సభలో వివిధ సంఘాల ప్రతినిధులు రత్న ప్రదీప్, బీసీ రమణ, కుమారి, మేరీ నిర్మల, రోహిణీ, రోజా తదితరులు పాల్గొన్నారు.
డిసెంబరు 10 వరకు ప్రచారోద్యమం
మహిళలపై అన్ని రకాల హింసలకు వ్యతిరేకంగా రెండు రాష్ట్రాల్లో ఈనెల 25 నుంచి డిసెంబరు 10 వరకు దళిత, ఆదివాసీ, బాలికలు, మహిళలపై హింసకు వ్యతిరేకంగా ప్రచారోగ్యమం నిర్వహిస్తున్నట్టు దళిత స్త్రీ శక్తి (డీఎస్ఎస్) జాతీయ కన్వీనర్ గెడ్డం ఝాన్సీ తెలిపారు. ఈనెల 25న శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ నుంచి ప్రారంభమైన ప్రచారోద్యమం అన్ని జిల్లా కేంద్రాల్లో కొనసాగుతుందనితెలిపారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునైట్ ఉమెన్ ప్రచారోద్యమాన్ని పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు. డిసెంబరు 16 వరకు సభలు, సమావేశాలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లు, లీగల్ క్లినిక్ లు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 27న గుంటూరు ఏసీ కాలేజీ కాన్ఫరెన్స్ హాలులో రూల్ ఆఫ్ లా అండ్ కాన్స్టిట్యూషన్ అనే అంశంపై సదస్సును, 30న విజయవాడలోని అంబేద్కర్ భవన్ లో దళిత ఆదివాసీ స్త్రీలపై జరిగిన హింసాత్మక సంఘటనలపై సదస్సునూ, 6న లీగల్ క్లినిక్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రచారోద్యమం ముగింపులో భాగంగా మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ‘వన్ స్టెప్ ఫార్వర్డ్ , టూ స్టెప్స్ బ్యాక్ వర్డ్’ అనే అంశంపై సదస్సు నిర్వహింనున్నట్టు ఝాన్సీ తెలిపారు.