సెప్టెంబర్ 22 నుంచి దసరా మహోత్సవాలు

సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత
11రోజుల పాటు వైభవంగా ఉత్సవాల నిర్వహణ
చిన్నారులకు, చంటి పిల్లల తల్లులకు, దివ్యాంగులకు వృద్ధులకు ప్రత్యేక సదుపాయాలు
– ఆలయ ఈవో వీకే శీనానాయక్
దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది.
సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు… చంటి పిల్లలకు వృద్ధులకు దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు.. క్యూ లైన్ లో పాలు, త్రాగునీటి సౌకర్యం పంపిణీ చేసే విధంగా… దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 2025 అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని దుర్గ గుడి ఈవో శీనా నాయక్ స్పష్టం చేశారు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వీకే శీనానాయక్ తెలిపారు.
సెప్టెంబర్ 22 నుంచి ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న దసరా మహోత్సవాల నిర్వహణపై సోమవారం ఉదయం కార్యనిర్వహణ అధికారి వీకే శీనానాయక్, వైదిక కమిటీ సభ్యులు, వేదపండితులతో కలిసి మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దసరా ఉత్సవాలకు సంబంధించి శుభ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. అనంతరం ఈవో మాట్లాడుతూ శ్రీ విశ్వావసు నామ సంవత్సర దసరా మహోత్సవాలను సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దసరా మహోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశవిదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తారన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనం త్వరితగతిన జరిగేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని, ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్, ఇతర ఉన్నతాధికారుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో నిర్వహించే ఉత్సవాల్లో అమ్మవారు 11 రోజులపాటు 11 అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారన్నారు. 22వ తేదీన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంతో దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయని.. 23వ తేదీన శ్రీ గాయత్రీ దేవి, 24వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి, 25వ తేదీన శ్రీ కాత్యాయని దేవి, 26వ తేదీన శ్రీ మహాలక్ష్మీ దేవి, 27వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి, 28వ తేదీన శ్రీమహా చండీ దేవి, 29వ తేదీన మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవి, 30వ తేదీన శ్రీ దుర్గాదేవి, అక్టోబర్ 1న శ్రీ మహిషాసురమర్దినీ దేవి, అక్టోబర్ 2న విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారని వివరించారు. మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి రోజున ఉదయం మహా పూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుందన్నారు. ఏటా మాదిరిగానే అర్చక సభలు, వేద సభలు నిర్వహిస్తామని, ప్రతిరోజు నగరోత్సవం జరుగుతాయని శివ ప్రసాద్ శర్మ వివరించారు.
మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు వైదిక కమిటీ సభ్యులు ఎల్.దుర్గా ప్రసాద్ వైదిక కమిటీ సభ్యులు చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి, వి ఎస్ మహర్షి ఘనాపాటి వేద పండితులు వైది కమిటీ సభ్యులు, అర్చకులు శ్రీధర్ శర్మ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఇరువురు, ఎఈఒ లు వివిధ విభాగాల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు .