హరిత వనాలు
అనుభవాల సారంతో పదునెక్కిన హృదయ క్షేత్రం నుండి మొలకెత్తిన హరిత వనాలు నా కవితలు
వెలువరించబడ లేక గాలిలో మమేకమై ఎదురు వేణువు నుండి వెలువడే అనురాగ సుధా ధారలు నా కవితలు
ఎన్నో దాచబడిన భావాల మేఘాలు గుంపు పై ఓ ఉద్వేగపు మెరుపు దాడి చేస్తే ఉరిమి కురిసిన వాన జల్లు నా కవితలు
చిన్ని చిన్ని ఆశలచిదుగులు పోగేస్తే ఆశయమై మండిన అగ్ని పుష్పాలు నా కవితలు..
అనంతమైన ఎదురుచూపుల చీకట్లలో నిరీక్షణ పరీక్షల్లో విచ్చుకున్న ఉదయాలే నా కవితలు
ఎప్పుడో నాటిన కొమ్మ ఆకులు రాల్చు ని మరల జీవించేందుకు తొడుక్కున్న ఎర్రని చిగురుటాకులు నా కవితలు..
ఊహల రెక్కలు తొడుక్కుని గగనంలో గంతులేసి మది ఉయ్యాలలో విశ్ర మించే స్వేచ్చా భావనలు నా కవితలు
కోయిల పిలుపుల్ని బోసినవ్వు ల్ని
పూల పరిమళాన్ని ఆశల హరివిల్లునీ
వెరసి ఆకలికేకల్ని…
ఈ పంచభూతాల సాక్షిగా
రెండు విశ్వా లుగా నా కన్నుల్లో నిలిపినప్పుడు
నా గుండె చప్పుడు కు లయగా
అనంత విశ్వంలో నన్ను సంగ మింప చేసే
రసోజ్వల జ్వాలలే నా కవితలు.
మిత్రులందరికీ..ప్రపంచ కవితా దినోత్సవం శుభాకాంక్షలు