gunturu

చీకటి గోపి లాకప్ డెత్ కారకులను అరెస్టు చేయాలి

జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం మీడియాలో మాట్లాడుతున్న దళిత నాయకులు
  • దళిత నేతల డిమాండ్ 
  • గుంటూరు జిల్లా ఎస్పీ ఓకుల్ జిందాల్ తో భేటీ 
  • “సిట్” ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ..
  • పోలీస్ వైఫల్యం వాస్తవమని ఎస్పీ ఒప్పుకున్నారు : దళిత నేతలు 

గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్ స్టేషన్లో చీకటి గోపి అను దళిత యువకుడి లాకప్ డెత్ ఘటనలో సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందనీ, పోలీస్ వైఫల్యం వాస్తవమేనని జిల్లా ఎస్పీ ఓకుల్ జిందాల్ ఒప్పకున్నారని దళిత నాయకులు తెలిపారు. సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఓకుల్ జిందాల్ ను కలిసిన అనంతరం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నెకల్లు గ్రామంలో ఆటో డ్రైవర్ గా జీవిస్తున్న చీకటి గోపి అనే దళిత యువకుడిని తాడికొండ సిఐ ఉమేష్, ఎస్సై జ్యోతి, మురళి అనే కానిస్టేబుల్ కొట్టి చంపిన విషయం పై దళితుల ఆందోళనలతో గుంటూరు జిల్లా ఎస్పీ ఓకుల్ జిందాల్ ఏ ఎస్ పి రవికుమార్ డి.ఎస్.పి మరో ఇద్దరు సీఐ లతో కలిపి సిట్ ఏర్పాటు చేశారు. పోలీసులు చిత్రహింసలు పెట్టి హంటర్ తో కొట్టి నేల మీద కూర్చోబెట్టి బూట్ కాలుతో పురుషాంగం పై తన్నటం వల్ల జ్వరం వచ్చి రెండు రోజులు తర్వాత గుంటూరు హాస్పిటల్ లో గత నెల ఒకటవ తేదీన మరణించాడన్నారు.

లాఠీలతో కొట్టి చంపారు

తాడికొండ సీఐ ఉమేష్ తో పాటు చీకటి గోపీని చావగొట్టిన వారిలో తెనాలిలొ ముగ్గురు దళిత యువకులను సీఐ రాములు నాయక్ తో పాటు లాఠీ లతో కొట్టిన మురళి ప్రధాన కారకుడు అన్నారు. ఈ విషయం బయటకు చెబితే గంజాయి కేసు పెడతామనీ, దొంగ బంగారం కేసు పెడతామని బెదిరించడంతో చింతజల్లు గోపి అను మాదిగ యువకుడు పారిపోయాడన్నారు. ఇటీవల ప్రత్యక్ష సాక్షి అయిన చింతజలు గోపి చెప్పిన సాక్ష్యం ప్రకారం వెంటనే BNS 103 ఎస్సీ ఎస్టీ యాక్ట్ తాడికొండ సీఐ ఉమేష్ తదితరులపై కేసు మార్చాల్సిన అవసరం ఉందన్నారు. పోస్టుమార్టం రిపోర్టు కూడా తాడికొండ అధికారులు మేనేజ్ చేశారనే అనుమానం తకు ఉందనీ, చీకటి గోపి శవాన్ని రీ పోస్టుమార్టం చేయించాలని జిల్లా ఎస్పీని డిమాండ్ చేసినట్టు దళిత నేతలు తెలిపారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 22 కేసులున్న కాపు కులస్తుడైన గాదే సాయి కృష్ణ అనే 22 ఏళ్ళ రౌడీ షీటర్ ను సీఐ నాగరాజు చంపాడనే ఆరోపణతో శవం ఆచూకీ లేకపోయినా జనసేన నాయకులను సంతృప్తి పరచటానికి సీఐనూ, కానిస్టేబుళ్లను అరెస్టు చేసి జైలుకు పంపించారన్నారు. క్రాంతి మాదిగ కేసులో కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తమ డిమాండ్ తో అదే కృష్ణలంక సీఐ నాగరాజు మీద బలన్మరణం, ఎస్సీ ఎస్టీ కేసుగా మార్పు చేశారని గుంటూరు జిల్లా ఎస్పీ ఓకుల్ జిందాల్ కు వివరించారు. సిట్ రిపోర్టు రాగానే సెక్షన్లు మారుస్తామనీ, చీకటి గోపి మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ దళిత నాయకులకు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా ఎస్పీని కలిసిన వారిలో మంద కృష్ణ మాదిగ, కొరివి వినయ్ కుమార్, నీలం నాగేంద్రరావు, నీలాంబరం, శిఖ సురేష్, బత్తుల వీరాస్వామి, దారా అంజయ్య తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *