ap news

వామ్మో కుంభకర్ణ..పాడైన మాంసంతో ప్రాణాలతో చెలగాటం

పాడైన మాంసాన్ని పరిశీలిస్తున్న ఐపీఎం (ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్) డైరెక్టర్‌ అరుణ్‌బాబు

మంగళగరి టోల్ ప్లాజా వద్ద హోటల్ లో పాడైన మాంసం
ఐపీఎం (ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్) డైరెక్టర్‌ అరుణ్‌బాబు తనిఖీలు
ఫ్రీజర్ లో వండిన, పాడైన మాంసం గుర్తింపు
6 కిలోల పాడైన ఆహారం ధ్వంసం
కుంభకర్ణ రెస్టారెంట్‌ వంటగది తాత్కాలిక మూసివేత
పరీక్షల కోసం 13 నమూనాల సేకరణ

ఆ హోటల్ పేరు కుంభకర్ణ .. ఆ హోటల్ నిర్వాహకులు కూడా కుంభకర్ణుల్లా నిద్రపోతూ పాడై పోయిన ఆహారంతో కస్టమర్ల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మంగళగిరి కాజా టోల్‌ప్లాజా సమీపంలోని కుంభకర్ణ మల్టీ క్యూజీన్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ లో ఫ్రీజర్‌లో పాడైన చికెన్‌, మటన్‌, తందూరీ చికెన్‌, కబాబ్‌లు నిల్వ ఉంచడం.. మాంసం, చికెన్‌ రక్తపు మరకలతో వంటగది అపరిశుభ్రంగా ఉండటం వంటి తీవ్ర లోపాలు బయటపడ్డాయి. ఐపీఎం (ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్) డైరెక్టర్‌ అరుణ్‌బాబు బుధవారం సాయంత్రం స్వయంగా చేసిన తనిఖీల్లో హోటల్ భాగోతం బయటపడింది. వెంటనే కుంభకర్ణ మల్టీ క్యూజీన్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ వంటగదినిఅధికారులు తాత్కాలికంగా మూసి వేయించారు. ఆయనతో పాటు సహాయ ఆహార నియంత్రణ అధికారి ఎన్‌.పూర్ణచంద్రరావు, ఆహార భద్రత అధికారులు బి.నరసింహుడు, ఎన్‌.వెంకటేశ్వర్లు తనిఖీలో పాల్గొన్నారు. అనంతరం వంటగది కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ అధికారులు నోటీసు జారీ చేశారు. ఈ మేరకు అరుణ్ బాబు బుధవారం రాత్రి మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

ఫ్రీజర్ లో మాంసాన్ని పరిశీలిస్తున్న దృశ్యం

6 కిలోల ఆహార పదార్ధాల ధ్వంసం

తనిఖీలో ఫ్రీజర్‌లో పాడైన ముడి బోన్‌లెస్‌ చికెన్‌ 500 గ్రాములు, వండిన చికెన్‌ కూర 500 గ్రాములు, వండిన మటన్‌ 500 గ్రాములు, తందూరీ చికెన్‌ 2.5 కిలోలు, చికెన్‌ తంగ్డీ కబాబ్‌ 1.5 కిలోలు, ఆటా పిండి 500 గ్రాములు ఉన్నట్లు గుర్తించినట్టు తెలిపారు. మొత్తం 6 కిలోల ఆహార పదార్థాలను అక్కడికక్కడే ధ్వంసం చేసినట్టు వెల్లడించారు. తనిఖీలో గడువు ముగిసిన స్కిమ్డ్‌ మిల్క్‌ డెయిరీ వైటెనర్‌ పౌడర్‌ 3 కిలోలు, కంపౌండెడ్‌ ఇంగువ పొడి 600 గ్రాములు, పన్నీర్‌ చీజ్‌ అనలాగ్‌ 1 కిలో కూడా ఉన్నట్టు గుర్తించారు. సంబంధిత పదార్థాలను స్వాధీనం చేసుకుని తదుపరి పరీక్షలు, పరిశీలనకు చర్యలు చేపట్టారు.

సిబ్బందిని ప్రశ్నిస్తున్న దృశ్యం

13 నమూనాల సేకరణ

ఆహార నాణ్యతను నిర్ధారించేందుకు మొత్తం 13 నమూనాలు సేకరించారు. వాటిలో 3 చట్టపరమైన, 10 పర్యవేక్షణ నమూనాలు ఉన్నాయి. బెల్లం, కారం పొడి, ధనియాలతో పాటు శనగపప్పు, మామిడికాయ ఊరగాయ, కందిపప్పు, మస్టర్డ్‌ సాస్‌, స్వీట్‌ చిల్లీ సాస్‌, చిల్లీ పొడి, మటన్‌ మసాలా, పన్నీర్‌ చీజ్‌ అనలాగ్‌, చికెన్‌ మసాలా తదితర నమూనాలను పరీక్షలకు పంపారు. ఫ్రీజర్‌లో మాంసం, చికెన్‌ రక్తపు మరకలు, గోడలపై నూనె, పొగ మరకలు, వ్యర్థాలతో మురుగునీటి కాలువలు మూసుకుపోవడం, వంటగదిలో చెత్త పేరుకుపోవడం, ఆహార తయారీలో ఉపయోగించకూడని రంగుల పదార్థాలు, లేబుళ్లు లేని మసాలా పొడులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. లోపాలను వెంటనే సరిచేయాలని, పరిశుభ్రత, ఆహార నిల్వ, వ్యర్థాల తొలగింపు తదితర అంశాల్లో నిబంధనలు పాటించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. లోపాలను సరిచేసినట్లు నివేదిక సమర్పించే వరకు వంటగది కార్యకలాపాలు నిలిపివేయాలని స్పష్టం చేశారు.

ఆహార పదార్ధాలను పరిశీలిస్తున్న అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *