మందుల దుకాణాల్లో తనిఖీలు..
ట్రామాడోల్ దుర్వినియోగంపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు
100 మందుల దుకాణాల్లో తనిఖీలు.. 55 చోట్ల నిబంధనల ఉల్లంఘనలు
జంగారెడ్డిగూడెంలో భారీగా ట్రామాడోల్ ఇంజెక్షన్లు స్వాధీనం.. ఐదుగురి అరెస్టు
మంత్రి శ్రీ సత్యకుమార్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు
రాష్ట్రవ్యాప్తంగా 100 మందుల దుకాణాల్లో నిర్వహించిన తనిఖీల్లో 55 చోట్ల నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. ట్రామాడోల్, ఇతర కఠిన నిబంధనలున్న మందుల కొనుగోలు, విక్రయాల్లో ఈ అక్రమాలు గుర్తించారు. వీటిలో 53 చిన్నస్థాయి ఉల్లంఘనలు కాగా, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రెండు చోట్ల పెద్ద మొత్తంలో మందుల కొనుగోలు, విక్రయాలు జరిగినా సంబంధిత బిల్లులు చూపించలేదు. అధికారులు కొనుగోలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వానికి అందిన సమాచారం మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ డైరెక్టర్ జనరల్ శ్రీ అరుణ్‌బాబు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో గుర్తించిన అంశాలతో అధికారులు మంత్రి శ్రీ సత్యకుమార్‌కు నివేదిక అందజేశారు.

జంగారెడ్డిగూడెం నుంచి వెలుగులోకి..
ఈ రాష్ట్రవ్యాప్త తనిఖీలకు దారితీసిన ఘటన జంగారెడ్డిగూడెంలో వెలుగుచూసింది. జీలుగుమిల్లి గ్రామంలోని ఆయిల్‌పామ్ తోటలో పెద్ద సంఖ్యలో ఖాళీ, పగిలిన ఇంజెక్షన్ సీసాలు, వాడిన సిరంజీలు కనిపించడంతో జంగారెడ్డిగూడెం డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పి.మల్లికార్జున్ అక్కడికి వెళ్లి పరిశీలించారు. అవి ట్రామాడెక్స్, ట్రామెక్ పేర్లతో ఉన్న ట్రామాడోల్ ఇంజెక్షన్లుగా గుర్తించారు.
ట్రామాడోల్‌ను తీవ్రమైన నొప్పిని తగ్గించేందుకు వైద్యపరంగా ఉపయోగిస్తారు. అయితే మత్తు కలిగించే ప్రభావం ఉండటంతో కొందరు దీనిని మాదకద్రవ్యాలకు ప్రత్యామ్నాయంగా దుర్వినియోగం చేస్తున్నారు. అందువల్ల వైద్యుల సూచన మేరకు, నిబంధనల ప్రకారం మాత్రమే ఈ మందును విక్రయించాలి. అయితే కొందరు మందుల దుకాణాల నిర్వాహకులు మధ్యవర్తులతో కలిసి సరైన బిల్లులు, రికార్డులు లేకుండా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

భారీగా ఇంజెక్షన్ల కొనుగోలు..
దీంతో ట్రామాడోల్ తయారీ సంస్థల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పంపిణీ వివరాలను అధికారులు సేకరించి పరిశీలించారు. జంగారెడ్డిగూడెం ప్రాంతంలోని కొన్ని మందుల దుకాణాలు పెద్ద మొత్తంలో ట్రామాడోల్ ఇంజెక్షన్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దీంతో శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ, డి.రూప పెడ్డింటి మెడికల్ ఏజెన్సీల్లో తనిఖీలు నిర్వహించారు.
శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ ఈ ఏడాది రెండు బిల్లుల ద్వారా 20 వేల ట్రామాడోల్ ఇంజెక్షన్లు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే వాటి విక్రయ బిల్లులు, నిల్వ వివరాలను చూపించలేదు. విచారణలో నాలుగు పెట్టెల ట్రామాడెక్స్ ఇంజెక్షన్లను స్నేహితుడి చెక్కపనుల దుకాణంలో దాచినట్లు బయటపడింది. అక్కడ తనిఖీ చేయగా 7,550 ఇంజెక్షన్లు లభించడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇంజెక్షన్లను జంగారెడ్డిగూడెం, మేడ్యానపు వరిగూడెం, వేగవరం, కుక్కునూరు తదితర ప్రాంతాల్లోని దుకాణాలు, వ్యక్తులకు సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది.

నకిలీ బిల్లులతో మరో వ్యవహారం..
మరోవైపు డి.రూప పెడ్డింటి మెడికల్ ఏజెన్సీ గత రెండేళ్లలో 5,200 ట్రామెక్ ఇంజెక్షన్లు కొనుగోలు చేసినట్లు తేలింది. వీటిలో 3,930 ఇంజెక్షన్లను తెలంగాణలోని ఓ మందుల దుకాణానికి విక్రయించినట్లు బిల్లులు చూపించారు. అయితే తెలంగాణ అధికారులు ఆ లావాదేవీ నకిలీదని గుర్తించారు. నకిలీ బిల్లులు తయారు చేసి, వాస్తవానికి ఆ మందులను ఇతర దుకాణాలకు బిల్లులు లేకుండా సరఫరా చేసినట్లు విచారణలో బయటపడింది. ఈ వ్యవహారంపై డ్రగ్స్ నియంత్రణ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జంగారెడ్డిగూడెం పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అరెస్టయిన వారిలో మందుల దుకాణాల యజమానులు, ఒక ఉద్యోగి ఉన్నారు.
అక్రమ లావాదేవీలపై చర్యలు..
జంగారెడ్డిగూడెం ఘటనతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో వెలుగుచూసిన అక్రమాలపై ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ తదుపరి చర్యలకు సిద్ధమైంది. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు చేసిన మందుల దుకాణాల లైసెన్సులు రద్దు చేసేందుకు చర్యలు చేపడుతోంది. ట్రామాడోల్ లేదా ఇతర కఠిన నిబంధనలున్న మందులను అక్రమంగా తరలించడం, అనుమతి లేకుండా నిల్వ చేయడం, సరైన రికార్డులు లేకుండా విక్రయించడం వంటి చర్యలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. పోలీసులతో, ఇతర అమలు సంస్థలతో కలిసి దర్యాప్తు కొనసాగిస్తూ, రికార్డుల పరిశీలన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ డైరెక్టర్ జనరల్ శ్రీ అరుణ్‌బాబు పేర్కొన్నారు.

