Medical and Health

1.12 కోట్ల మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు

వైద్యాధికారులతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరిస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

సెప్టెంబరు 25న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం

ప్రచార గోడ పత్రికను ఆవిష్కరించిన మంత్రి  సత్యకుమార్‌ యాదవ్‌

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా ఈనెల 25న నిర్వహించే  రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్ల మంది పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ రూపొందించిన ప్రచార గోడపత్రికను అధికారులతో కలిసి సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి ఆవిష్కరించారు. ఏడాదికి రెండుసార్లు నిర్వహించే నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 2026 సెప్టెంబరు మలి విడతను ఈ నెల 25న నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఒకటి నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలతో పాటు 6 నుంచి 19 ఏళ్ల బాలబాలికలకు ఆల్బెండజోల్‌ మాత్రలు అందిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, హాస్టళ్లు, జూనియర్‌ కళాశాలలు, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, నర్సింగ్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు బడికి వెళ్లని పిల్లలకూ మాత్రలు అందేలా ఏర్పాట్లు చేశారు.

1.24 కోట్ల ఆల్బెండజోల్‌ మాత్రలు సిద్ధం

రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ కోసం 1.24 కోట్ల ఆల్బెండజోల్‌ మాత్రలను సిద్ధం చేశారు. వీటిలో 1.12 కోట్ల మంది పిల్లలకు మాత్రలు అందించనున్నారు. రాష్ట్రంలో నేల ద్వారా వ్యాపించే నులిపురుగుల వ్యాప్తి ప్రస్తుతం 34 శాతానికి తగ్గింది. 2019లో ఎన్‌సీడీసీ గణాంకాల ప్రకారం ఇది 36 శాతంగా ఉంది. నులిపురుగుల నివారణకు 400 మి.గ్రా. ఆల్బెండజోల్‌ మాత్రలను వినియోగిస్తున్నారు. సెప్టెంబరు 25న మాత్రలు తీసుకోలేకపోయిన పిల్లలకు మరో అవకాశం కల్పించేందుకు అక్టోబరు 5న మాప్‌-అప్‌ డే నిర్వహించనున్నారు.

నులిపురుగుల వల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రభావం

నులిపురుగుల వల్ల పిల్లల్లో పోషకాలు శరీరంలోకి సరిగా చేరకపోవడం, రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల వారి శారీరక, మానసిక ఎదుగుదలతో పాటు చదువుపైనా ప్రభావం పడుతుంది. నులిపురుగుల నివారణ ద్వారా పిల్లల ఆరోగ్యం, జీవన నాణ్యత మెరుగుపడటంతో పాటు చదువుపై ఏకాగ్రత పెరగడానికి దోహదపడుతుంది.

400 మి.గ్రా. ఆల్బెండజోల్‌ సురక్షితమైన, సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఔషధమని అధికారులు తెలిపారు. పిల్లల వయసుకు అనుగుణంగా సరైన మోతాదులో శిక్షణ పొందిన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయుల ద్వారా మాత్రలు అందిస్తారు. ఒకటి నుంచి ఐదేళ్ల వయసున్న నమోదు కాని పిల్లలు, 6 నుంచి 19 ఏళ్ల వయసున్న బడికి వెళ్లని బాలబాలికలకు మాత్రలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆశా కార్యకర్తలు ఇలాంటి పిల్లలను గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాలకు తీసుకువచ్చి మాత్రలు అందేలా చర్యలు తీసుకుంటారు.

సెప్టెంబరు 23 నాటికి మాత్రల పంపిణీ పూర్తి

సిద్ధం చేసిన 1.24 కోట్ల ఆల్బెండజోల్‌ మాత్రలను సెప్టెంబరు 23 నాటికి సంబంధిత సంస్థలకు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రస్థాయి నుంచి జిల్లాలు, మండలాల వరకు వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబరు 25న మాత్రలు తీసుకోలేకపోయిన పిల్లలకు అక్టోబరు 5న నిర్వహించే మాప్‌-అప్‌ డేలో మాత్రలు అందేలా చర్యలు చేపడుతున్నారు.

56 మంది అధికారులతో పర్యవేక్షణ

కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు సెప్టెంబరు 24, 25 తేదీల్లో ఆరోగ్యశాఖకు చెందిన 56 మంది అధికారులు, సలహాదారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపడతారు. జిల్లా స్థాయిలో ఆరోగ్యం, విద్య, ఐసీడీఎస్‌, ఇతర సంబంధిత శాఖల అధికారులు కూడా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.

డిజిటల్‌ విధానంలో నివేదికలు

కార్యక్రమంపై అవగాహన కల్పించడంతో పాటు వివరాల నమోదును పటిష్ఠం చేసేందుకు డిజిటల్‌ ఐఈసీ సామగ్రి, ఆన్‌లైన్‌ నివేదికలు, ఎన్‌డీడీ యాప్‌, ఏఎన్‌ఎం/ఎంఎల్‌హెచ్‌పీ యాప్‌లో ఎన్‌డీడీ విభాగం, గూగుల్‌ ఆధారిత కవరేజ్‌ నివేదికలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *