271 మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్

నిషేధ, ఎక్సైజ్ శాఖ కమిషనర్ చామకూరి శ్రీధర్

ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులు..

21న ఉదయం 8 గంటలకు లాటరీ

ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 మద్యం దుకాణాల విధానంలో భాగంగా తొలి విడతలో కేటాయింపు కాని 271 ఏ4 మద్యం దుకాణాలకు ప్రభుత్వం రెండో విడతలో నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు. తొలి విడతలో మిగిలిపోయిన దుకాణాలకు కేటాయింపులు పూర్తి చేసేందుకు ఈ చర్య తీసుకున్నట్లు నిషేధ, ఎక్సైజ్ శాఖ కమిషనర్ చామకూరి శ్రీధర్ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,736 ఏ4 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వగా, 2,929 దుకాణాలు పునరుద్ధరణ ద్వారా, 517 దుకాణాలు తొలి విడత లాటరీ ద్వారా కేటాయించినట్లు వివరించారు. మరో 19 దుకాణాలకు గడువు పొడిగింపు ద్వారా కేటాయింపులు జరిగాయని తెలిపారు. మొత్తంగా 3,465 దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని, ఇది మొత్తం దుకాణాల్లో సుమారు 93 శాతమని పేర్కొన్నారు. రెండో విడత నోటిఫికేషన్‌లో 267 సాధారణ కేటగిరీ దుకాణాలు, నాలుగు రిజర్వుడు కేటగిరీ దుకాణాలు ఉన్నాయి. అర్హత కలిగిన ఆసక్తిగల వారు నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో దుకాణానికి తిరిగి చెల్లించని దరఖాస్తు రుసుము రూ.3 లక్షలుగా నిర్ణయించారు.

దరఖాస్తులను అక్టోబర్ 19వ తేదీ అర్ధరాత్రి వరకు స్వీకరిస్తారు. అక్టోబర్ 21వ తేదీ ఉదయం 8 గంటలకు సంబంధిత జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో లాటరీ నిర్వహిస్తారు. ఎంపికైన దరఖాస్తుదారులకు అదే రోజు సమాచారం అందిస్తారు. కేటాయింపుల ప్రక్రియను ఎక్సైజ్ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. అర్హులైన వారు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

కడపలో అత్యధిక దుకాణాలకు నోటిఫికేషన్

జిల్లాల వారీగా వైఎస్సార్ కడపలో అత్యధికంగా 33 దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎస్‌పీఎస్ నెల్లూరులో 24, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో 19 చొప్పున, పశ్చిమ గోదావరిలో 17, ప్రకాశంలో 16, అనంతపురంలో 15 దుకాణాలు ఉన్నాయి. అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో 13 చొప్పున, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 12 చొప్పున, మార్కాపురంలో 11, శ్రీకాకుళంలో 10 దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. కాకినాడ, నంద్యాల జిల్లాల్లో ఎనిమిది చొప్పున, శ్రీ సత్యసాయి జిల్లాలో ఏడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమలో ఆరు, ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఐదు చొప్పున దుకాణాలు ఉన్నాయి. అన్నమయ్యలో నాలుగు, చిత్తూరులో మూడు, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాల్లో రెండు చొప్పున దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. తూర్పు గోదావరి, పోలవరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రెండో విడతలో నోటిఫికేషన్ ఆవశ్యకత లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *