ఆర్థిక నివేదికల ఆధారంగా ప్రగతి

వివిధ రంగాల అభివృద్ధికి నిపుణుల సలహాలు
సెప్టెంబర్ నెల ఆర్థిక నివేదికపై సమీక్షలో సీఎం చంద్రబాబు
ప్రతి నెలా ఆర్థిక నివేదికలు సమర్పిచడంతోపాటు… ఆ నివేదికల ఆధారంగా ఆయా రంగాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సెప్టెంబర్ నెల ఆర్థిక నివేదికను ప్రణాళిక శాఖ అధికారులు సీఎం చంద్రబాబుకు సమర్పించారు. ఈ మేరకు శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర స్థూల ఆర్థిక స్థితిగతులు, వివిధ రంగాల పనితీరు, ద్రవ్యోల్బణ పరిస్థితి వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…” రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. ప్రతి నెల సిద్దం చేసుకుంటున్న ఆర్థిక నివేదికల ఆధారంగా వివిధ రంగాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. రిపోర్టులు తీసుకుని చర్చించుకోవడం కాకుండా… ఆ నివేదికల ఆధారంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేపట్టాల్సిన మార్పులు చేర్పులపై దృష్టి సారించాలి. ఈ మేరకు ఉన్నతాధికారులు మొదలుకుని… జిల్లా కలెక్టర్లు.. క్షేత్ర స్థాయిలోని సిబ్బంది వరకు దానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఆర్థిక నివేదికలను ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులకు అందించాలి. ఏమేం అంశాలు సరి చేసుకోవాలోననే విషయాలను వారికి వివరించాలి. వ్యవసాయ రంగంలో వృద్ధి కన్పిస్తోంది.
సేవల రంగం పుంజుకోవాలి
అదే తరహాలో సేవల రంగం, పరిశ్రమల రంగం కూడా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ప్రణాళిక శాఖ రూపొందించిన నివేదికల ఆధారంగా తమ తమ శాఖల పనితీరును మెరుగుపరుచుకోవాలి. అలాగే వివిధ నిపుణుల సలహాలను తీసుకోవాలి. ఈ మేరకు నిపుణుల బృందాన్ని గుర్తించి వారి సేవలను వినియోగించుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ఆయా రంగాల్లో ఎక్కడెక్కడ ఉత్తమ పద్దతులు ఉన్నాయో గుర్తించి.. వాటిని ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టు అమలు చేయాలి. ఏ ప్రభుత్వమూ చేయని విధంగా నియోజకవర్గాల స్థాయిలో ప్రణాళికలను అమలు చేస్తున్నందుకు ప్రధాని అభినందించారు. క్షేత్ర స్థాయిలో ఉన్న అవకాశాలను ప్రపంచ మార్కెట్టుకు చేరేలా చూడాలని ప్రధాని సూచించారు. ఈ మేరకు నియోజకవర్గాల్లో విజన్ యూనిట్ ప్లాన్లు అమలు చేయాలి. ధరలు పెరగకుండా చూడాలి.”అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్, ఆర్థిక, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
