ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ
-
బాధ్యతల స్వీకరణ
-
నవరత్నాల విజయవంతానికి కృషి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి సిఎస్ గా అన్ని విధాలా తనవంతు కృషి చేస్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన డా.సమీర్ శర్మ పేర్కొన్నారు.గురువారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యానాధ్ దాస్ నుండి సిఎస్ గా బాధ్యతలు స్వీకరించారు.ఈసందర్భంగా డా.సమీర్ శర్మ మాట్లాడుతూ తనకు సిఎస్ గా పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.సిఎస్ గా రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు.ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు పథకం విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఆపధకానికి మంచి పేరు తెచ్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని డా.సమీర్ శర్మ పేర్కొన్నారు.
1961లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించిన డా.సమీర్ శర్మ 1985వ బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఆంధ్రప్రదేశ్ కేడర్ లో గుంటూరు అసిస్టెంట్ కలక్టర్ గా,నరసాపురం సబ్ కలక్టర్ గాను పనిచేశారు.అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కలక్టర్ గాను,విశాఖపట్నం, విజయవాడ,హైదరాబాదు మున్సిపల్ కమీషనర్ గాను,1994-96 మధ్య తూర్పు గోదావరి జిల్లా కలక్టర్ గాను పనిచేశారు.అలాగే కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు.అలాగే పరిశ్రమల శాఖ కమీషనర్ గాను,చేనేత జౌళిశాఖ కమీషనర్ గాను,ఆర్ధికశాఖ కార్యదర్శిగా,ఐటి అండ్ సి కార్యదర్శిగాను,ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమీషనర్ గాను పనిచేశారు. అనంతరం మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గాను పనిచేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంలోను వివిధ హోదాల్లో పనిచేశారు.కేంద్ర సర్వీసుల నుండి రాష్ట్రానికి వచ్చిన డా.శర్మ రాష్ట్ర ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా,ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్,ఎక్సలెన్స్ అండ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్ అండ్ మెంబర్ సెక్రటరీగాను పనిచేయగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డా. సమీర్ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు.
తొలుత వేదపండితుల ఆశీర్వాదాల మధ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.ఈసందర్భంగా పలువురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు,ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు,పలువురు ఇతర అధికారులు సిబ్బంది డా.సమీర్ శర్మకు శుభాకాంక్షలు తెలిపారు.