ap news

18.37 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్

• వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ ఏర్పాటు
• వ్యవసాయ రంగానికు 10వేల మెగావాట్ల సౌర విద్యుత్.
• కేంద్ర సంస్థ అయిన సెకీ ద్వారా యూనిట్ రూ.2.49 లకే కొనుగోలు.
• ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ వెల్లడి.

శ్రీకాంత్ నాగులాపల్లి, ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి

కేంద్ర సంస్థ అయిన రాష్ట్రంలో 18.37 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో ఆదివారం విద్యుత్ పరిస్థితిపై ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను శ్రీకాంత్ వివరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ లిమిటెడ్ (జీఎస్ఈఎల్) ద్వారా రాబోయే 25 సంవత్సరాల వరకూ రైతులకు ఉచిత విద్యుత్ అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. వ్యవసాయానికి అందించే విద్యుత్ యూనిట్ 4రూపాయల 36పైసలకు కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా అందిస్తున్నామని ఆయన అన్నారు. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ను కలుపుకొని వ్యవసాయానికి పగటి పూట 9 గంటలు నిరాటంకంగా విద్యుత్ ను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం టెండర్లు పిలిచి యూనిట్ 2 రూపాయల 49 పైసలకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని శ్రీకాంత్‌ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టం ప్రకారమే సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆప్ ఇండియా (సెకీ) ఆంధ్రప్రదేశ్ కు 2 రూపాయల 49 పైసలకు ఆఫర్ ఇచ్చిందని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని శ్రీకాంత్ అన్నారు. తమిళనాడు ప్రభుత్వం గడిచిన సెప్టెంబర్ లోనే సెకీ నుంచి యూనిట్ 2 రూపాయల 65 పైసలకు సోలార్ విద్యుత్ ను కొనుగోలు చేసిందని.. అంతకంటే తక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీ అంగీకరించిందన్నారు. డిస్కంలపై పడే నెట్ వర్క్ ఛార్జెస్ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నాం కాబట్టి జ్యూడీషియల్ ప్రిరివ్యూకి గానీ, రివర్స్ టెండరింగ్ కు గానీ వెళ్లవలసిన అవసరం లేదని శ్రీకాంత్ తెలిపారు. విద్యుత్ కొనుగోళ్ల అంశం ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ తర్వాతనే ఈఆర్‌సీకి ప్రతిపాదిస్తుందని ఆయన అన్నారు. ఈఆర్‌సీ ఆమోదం అనంతరమే సెకీతో ఒప్పందం అని తెలిపారు. 2014 నుంచి పీపీఏ ఒప్పందాలలో భాగంగా చేంజ్ ఆఫ్ లా ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెరిగినా, తగ్గినా కొనుగోలుదారుడే భరిస్తారన్నారు. సెకీ నుంచి సౌర విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎవాక్యులేషన్ లైన్ల ఖర్చు భారం ఉండదన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్లాంట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం 2వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఎవాక్యులేషన్ లైన్లు వేయవలసి ఉంటుందని శ్రీకాంత్ అన్నారు. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలలో ఇప్పుడు సెకీ ఇచ్చిన ఆఫరే అతి తక్కువని తెలిపారు. అలాగే ఐఎస్టీఎస్ ఛార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చిందని వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రాజెక్టు ఏర్పాటు చేసినట్లైతే.. రాష్ట్రానికి జీఎస్టీ పన్నుల రావడంతో పాటు కేంద్రానికి చెల్లించాల్సిన ఐఎస్టీఎస్ ఛార్జీలు, ఎవాక్యులేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు రూ.2,260 కోట్లు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆదా చేసుకోగలుగుతుందని శ్రీకాంత్ తెలిపారు. జీఈసీఎల్ కి ప్రభుత్వం సేకరించిన భూమి ప్రభుత్వంతోనే ఉంటుందన్నారు. అవసరమైతే వేరే ప్రాజెక్టులకు ఈ భూమి ఉపయోగించుకోవచ్చని.. దాని ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. విద్యుత్‌ రేట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవని.. గంట గంటకూ పవర్‌ రేట్లలో మార్పు ఉంటుందని.. పీక్‌ అవర్‌లో ఒక ధర ఉంటుందన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *