ap news

అంచెలంచెలుగా..సిడిఎస్ దాకా..రావత్ ప్రయాణం

తమిళనాడులోని కూనూరులో బుధవారం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన జనరల్‌ బిపిన్‌ రావత్‌కు సైన్యంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన భారత సైన్యం అత్యున్నత పదవిని నిర్వహించారు. పాఠశాల విద్య తర్వాత మరో ఆలోచన లేకుండా సైన్యంలో చేరి అంచలంచెలుగా ఎదిగి తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బాధ్యతలు చేపట్టారు. మయన్మార్‌లో భారత్‌ నిర్వహించిన తొలి సర్జికల్‌ స్ట్రైక్స్‌కు కూడా రావతే ఆద్యుడు. గతంలో ఒక హెలికాప్టర్‌ ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో బయటపడ్డారు. ఈ సారి మాత్రం విధి ఆయనకు సహకరించలేదు.

ఉత్తరాఖండ్‌లో జననం..
ఉత్తరాఖండ్‌లోని పౌరీలో రాజ్‌పుత్‌ కుటుంబంలో ఆయన 1958లో జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మణ్‌ సింగ్‌ రావత్‌ భారత సైన్యంలో లెఫ్టినెంట్‌ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. ఆయన వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా పనిచేశారు. తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన రావత్‌.. పాఠశాల విద్య తర్వాత నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చేరారు. ఇండియన్‌ మిలిటరీ అకాడమీ దెహ్రాదూన్‌లో ఆయనకు సోర్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ లభించింది. డిఫెన్స్‌ సర్వీస్‌ స్టాఫ్‌ కాలేజీలో ఆయన గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని కాన్సాస్‌లో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆర్మీ కమాండ్‌ అండ్‌ జనరల్‌ స్టాఫ్‌ కాలేజీలో హైయ్యర్‌ కమాండ్‌ కోర్స్‌ను పూర్తి చేశారు. దేవీ అహల్యా విశ్వవిద్యాలయంలో ఎంఫిల్‌ పూర్తిచేశారు. మద్రాస్‌ యూనివర్శిటీలో కంప్యూటర్‌ డిప్లొమా చేశారు. 2011లో ఆయన చౌధరీ చరణ్‌ సింగ్‌ యూనివర్శిటీ నుంచి మిలిటరీ మీడియా అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌పై పీహెచ్‌డీ చేశారు.

11 గుర్ఖా రైఫిల్స్‌తో..

1978లో సెకండ్‌ లెఫ్టినెంట్‌గా గూర్ఖా రైఫిల్స్‌లో తన సైనిక కెరీర్‌ను ప్రారంభించారు రావత్‌. ఆయన తండ్రి లక్ష్మణ్‌ రావత్‌ కూడా అదే యూనిట్‌లో కెరీర్‌ ప్రారంభించడం విశేషం. రావత్‌కు ఉగ్రవాద, వేర్పాటువాద నిరోధక ఆపరేషన్లలో విపరీతమైన అనుభవం ఉంది. మేజర్‌గా ఆయన ఉరీ, జమ్ము అండ్‌ కశ్మీర్‌లో కంపెనీ కమాండ్‌గా వ్యవహరించారు. కల్నల్‌గా గూర్ఖా రైఫిల్స్‌లో పనిచేశారు. అనంతరం జమ్ము కశ్మీర్‌లోని సోపూర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌ సెక్టార్‌ 5 బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఐరాస మెషిన్‌లో భాగంగా డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో పనిచేశారు. ఇక్కడ ఆయనకు ఫోర్స్‌ కమాండర్‌ కమెండేషన్‌లు రెండు సార్లు లభించాయి. అనంతరం ఉరీలో జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత లెఫ్టినెంట్‌ జనరల్‌ హోదాలో నాగాలాండ్‌లోని టైగర్‌ కోర్‌ (3వ కోర్‌)కు బాధ్యతలను చూసుకొన్నారు. రావత్‌ 2017 జనవరి 1వ తేదీన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.

రావత్‌ బృందం సర్జికల్‌ స్ట్రైక్‌..!

1987లో రావత్‌ బృందం మెక్‌మోహన్‌ రేఖ వద్ద ‘సుబ్రాంగ్‌ చూ’ లోయలో చైనా సైన్యాన్ని బలంగా అడ్డుకొంది. 1962 యుద్ధం తర్వాత మెక్‌మోహన్‌ రేఖ వద్ద జరిగిన తొలి ఘర్షణ అది.
* 2015లో ఆయన ధింపూర్‌లో టైగర్‌ కోర్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మయన్మార్‌లో సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించారు. 18 మంది భారత జవాన్లను యూఎన్‌ఎల్‌ఎఫ్‌డబ్ల్యూ మిలిటెంట్లు హత్యచేసి మయన్మార్‌ పారిపోయారు. దీంతో భారత సైన్యం సరిహద్దులు దాటి మయన్మార్‌లోకి చొరబడి మరీ మిలిటెంట్లను మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్‌కు 21 పారా కమాండోలను వాడారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *