హెలికాప్టర్‌ ప్రమాద మృతుల్లో చిత్తూరు జిల్లా వాసి

తమిళనాడులోని ఊటీ కొండల్లో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిన ప్రమాదంలో చిత్తూరు జిల్లా వాసి మృతి చెందారు. కురబల కోట మండలం ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయితేజ రక్షణ శాఖలో లాన్స్‌ నాయక్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌కు వ్యక్తిగత భద్రతా బృందంలో సభ్యుడిగా ఉన్న సాయితేజ ఈరోజు మధ్యాహ్నం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో రావత్‌తో పాటు మృతి చెందారు. సాయితేజ మృతి పట్ల చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 2013లో బెంగళూరు రెజిమెంట్‌ నుంచి ఆర్మీ సిపాయిగా ఎంపికయ్యారు. సిపాయిగా పనిచేస్తూనే ఏడాది తర్వాత పారా కమాండో పరీక్షరాసి ఉత్తీర్ణుడయ్యారు. అనంతరం 11వ పారాలో లాన్స్‌ నాయక్‌ హోదాలో పనిచేస్తున్నారు. ఏడాది క్రితం వరకు బెంగళూరులోని సిపాయిల శిక్షణా కేంద్రంలో శిక్షకుడిగా పనిచేశారు. ఇటీవలే సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌కు వ్యక్తిగత భద్రతా బృందంలో సభ్యుడిగా ఉన్నారు. సాయితేజకు భార్య శ్యామల, కుమార్తె దర్శిని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. ప్రస్తుతం సాయితేజ కుటుంబ సభ్యులు మదనపల్లిలోని ఎస్‌బీఐ కాలనీలో నివాసముంటున్నారు. ఈరోజు ఉదయం 8.45 గంటలకు సాయితేజ వీడియో కాల్‌ చేసి భార్య, కుమార్తె, కుమారుడితో మాట్లాడారు. అనంతరం కొన్ని గంటల్లోనే హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం కుటుంబ సభ్యులను కలచివేసింది. సాయితేజ మృతితో మదనపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. కొద్ది సేపటి క్రితమే కుటుంబ సభ్యులంతా స్వగ్రామానికి బయల్దేరారు.

ప్రమాదంలో మృతి చెందిన బిపిన్ రావత్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్.. చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ
భార్యా పిల్లలతో సాయితేజ (పైల్ ఫొటో)

Leave a Reply

Your email address will not be published.