విమాన ప్రమాదంపై మోడీ దిగ్భ్రాంతి
బిపిన్ రావత్ గొప్ప సైనికుడు..
నిజమైన దేశభక్తుడు
హెలికాప్టర్ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్‌తో పాటు 11 మంది సైనికులు మృతిచెందడం పట్ల తీవ్ర విచారం చెందారు. వీరంతా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడుతూ బిపిన్ రావత్‌తో ఉన్నఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. జనరల్ బిపిన్ రావత్ గొప్ప సైనికుడు.. నిజమైన దేశభక్తుడని కొనియాడారు. సాయుధ దళాలను, భద్రతా యంత్రాంగాన్నిఆదునీకరించడంలో గొప్పగా కృషిచేశారన్నారు. వ్యూహాత్మక అంశాలపై ఆయన సామర్థ్యం, దృక్పథం అసాధారణమైందన్నారు. అలాంటిగొప్ప వ్యక్తి మరణం తనను ఎంతగానో కలిచివేసిందని పేర్కొన్నారు.
కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ.. మృతులకు సంతాపం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ దిల్లీలో సమావేశమైంది. విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్‌తో పాటు మిగతా వారికి సంతాపం తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు అజిత్ ఢోబాల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హెలికాప్టర్ ఘటన దురదృష్టకరం.. ఉపరాష్ట్రపతి
హెలికాప్టర్ ప్రమాదం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన సతీమణి మధులికా రావత్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. బిపిన్ రావత్‌తో పాటు ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రితో ఇప్పుడే మాట్లాడినట్టు పేర్కొన్నారు.
బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటు: పవన్
సైనిక హెలికాప్టర్ దుర్ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అత్యున్నతమైన సీడీఎస్ బాధ్యతల్ని స్వీకరించిన తొలి అధికారిగా బిపిన్ రావత్ అందించిన సేవల్ని కొనియాడారు. త్రివిధ దళాల్ని సమన్వయపరిచి దేశ రక్షణ వ్యవస్థను పటిష్టపరిచే కీలక బాధ్యతల్లో ఉన్న బిపిన్ రావత్ అకాల మరణం మన దేశానికి తీరని లోటఅన్నారు. ఈ దుర్ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని తెలిపారు. వారందరి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న గ్రూపు కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని జనసేనాని ఆకాంక్షించారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ తమిళనాడులో కుప్పకూలిన సంఘటన పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. కోయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకోగా. హెలికాప్టర్‌లో బిపిన్ రావత్‌తో పాటు, సిబ్బంది, కొందరు కుటుంబ సభ్యులు మొత్తం కలిసి 14 మంది ఉండగా రావత్ తో సహా 13 మంది మృతి చెందారు.
కూనూరు నుంచి విల్లింగ్టన్ ఆర్మీ బేస్‌కు వెళ్తున్న ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు కొద్ది నిమిషాల ముందు కూలి పోయింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన గవర్నర్ తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.