ap news

ప్రధానితో పవన్ భేటీ..బయటకు చెప్పాల్సిన పని లేదు..

మీడియాతో మాట్లాడుతున్న నాదెండ్ల మనోహర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మా (జనసేన) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశాన్ని పార్టీ గౌరవిస్తుంది..ఆ సమావేశంలో చర్చించిన విషయాలను బహిర్గతం చేయాలనే ఆలోచన లేదు..ఈ సమావేశంపై వస్తున్న రకరకాల భాష్యాలకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
మోదీ, పవన్ కళ్యాణ్ సమావేశంలో అంశాలని చెబుతూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లు గురించి స్పందించాల్సిన అవసరం లేదు అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ ఆలోచన ఉంటుంది. రాష్ట్రం, రాష్ట్ర ప్రజల మంచి కోసం ఏం చేస్తే బాగుంటుంది అన్న కోణంలోనే సమావేశం జరిగింది. పదవుల కోసం పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆలోచించరు. వైసీపీ వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం, భవిష్యత్తులో అనుసరించాల్సిన విషయాలు గురించి చర్చ జరిగింది. కొన్ని అంశాలు ఎన్నికల సమయంలో రాజకీయంగాను చర్చకు వస్తాయి. వాటికి రకరకాల భాష్యాలు చెప్పి, అన్ని విషయాలు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోదీ గారితో జరిగిన సమావేశం విషయంలో సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి అంశానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మనోహర్ అన్నారు.


వైసీపీ వల్ల ఎంత నష్టమో వివరిస్తాం
వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ కోసం కచ్చితంగా అన్ని పక్షాలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి వైసీపీ వల్ల ఎంత నష్టమో ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తాం. కచ్చితంగా జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరుతాం. పవన్ కళ్యాణ్ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ కు ఎంత అవసరమో తెలియజెప్పేలా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న దానిపై ఓ ప్రణాళిక ప్రకారం ఎన్నికల్లో ముందుకు వెళ్తాం.

జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?

మీకు నేనున్నా.. మూడు నెలల్లో పక్కా ఇల్లు కట్టిస్తా. నష్టపోయిన వారందరికీ తగిన పరిహారం ఇప్పించే బాధ్యతను తీసుకుంటానని అన్నమయ్య ప్రాజెక్టు వరద ముంపు బాధితులకు ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు నేటికీ నీటి మూటలుగానే మిగిలాయి. సొంత జిల్లా కడపలో ఒక ప్రాజెక్టు వరద విలయానికి తెగిపోయి, వేల మంది రోడ్డుపై పడితే తీరిగ్గా ప్రభావిత ప్రాంతాలను చూడడానికి వచ్చిన సీఎం అప్పట్లో ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారు. ప్రతి ఎకరాకు ఇసుక మేటలు తొలగించుకోవడానికి రూ. 12,500 ఇస్తామని చెప్పారు. ఆ హామీ ఏమైపోయింది. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం ఏర్పడితే, రైతులకు కనీసం న్యాయం జరగలేదు. యువతకు ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు ఇస్తామన్నారు. 44 మంది చనిపోయి, వేలాది మూగజీవాలు కొట్టుకుపోయాయి. పూర్తిస్థాయిలో వారికీ నష్టపరిహారం అందలేదు. ఇప్పటికీ సాయం కోసం బాధితులు తిరుగుతున్నారు.


బాధితుల వేదన అర్థం చేసుకోవడం లేదు
శివారెడ్డి అనే రైతు తాడేపల్లి చుట్టూ తిరిగి చివరకు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. డ్వాక్రా సంఘాల మహిళలకు రుణమాఫీ కూడా జరగలేదు. యువతకు ఉద్యోగాలు లేవు. అన్నమయ్య ప్రాజెక్టు బాధిత ప్రాంతాల్లో ఇప్పటికి హృదయ విదారక దృశ్యాలు కలచి వేస్తున్నాయి. సొంత జిల్లా బాధితులకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి తీరు ఆక్షేపనీయం. ఈ రెండు రోజుల్లో ప్రభావిత గ్రామాల్లో తిరిగి, కచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉన్న విషయాలను నివేదిక రూపంలో ప్రజల ముందు ఉంచుతాం. అన్నమయ్య ప్రాజెక్టు వరద ముంపునకు పూర్తిగా నేలమట్టమైన నాలుగు గ్రామాల్లో ప్రతి ఇంటిని పరిశీలిస్తాం. క్షేత్రస్థాయిలో బాధితులు పడుతున్న వేదనను, ఆక్రందనను ప్రజలకు తెలియజేస్తాం. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని ఒక నివేదిక రూపంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తాం. దీనిపై ఆయన మార్గదర్శకాల ప్రకారం జనసేన పార్టీ బాధితులకు అండగా ఉంటుంది. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన వెంటనే రెండో రోజే జనసేన పార్టీ శ్రేణులు స్పందించాయి. జన సైనికులు ప్రతి ఇంటికి తిరిగి తక్షణ అవసరం కింద బియ్యం, ఇతర నిత్యవసరాలతో పాటు దుప్పట్లు, మెడికల్ సాయం అందజేశారు. మనిషిని మనిషి ఆదుకోవాలనే మానవత్వంతో విలయం జరిగిన వెంటనే జనసేన పార్టీ శ్రేణులు వేగంగా స్పందించాయి. అప్పట్లో అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు ఎంత మేర జనసేన పార్టీ అండగా నిలబడిందో ఇప్పుడు కూడా అదే విధంగా వారికి భుజం కాస్తాం. ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. వాస్తవ పరిస్థితులు ఏమిటో కచ్చితంగా తెలుసుకుని బాధితుల పక్షాన పోరాడుతాం. బాధితులకు మూడు నెలల్లో పక్కా గృహాలు కట్టిస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం ఇప్పటికీ ఒక గృహం కూడా పూర్తి చేయకపోవడం విచారకరం. బాధితులంతా గుడారాల్లో బతుకులు వెళ్ళదీయడం కనిపిస్తోంది. వారి అందరితో మాట్లాడి, వాస్తవ పరిస్థితులపై నివేదిక తయారు చేస్తాం.

పోలీసుల ముందే దౌర్జన్యం బాధాకరం
రాష్ట్ర మంత్రి జోగి రమేష్ సొంత నియోజకవర్గం పెడనలో జనసేన నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ లోనే వైసీపీ గూండాలు దాడికి పాల్పడటం అత్యంత హేయం. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసుల ముందే వైసీపీ గూండాలు బరి తెగిస్తున్నారు. కరపత్రాలు, వాల్ పోస్టర్ల ద్వారా వైసీపీ నాయకుల దాష్టీకాలను వివరిస్తే కేసులు పెట్టడం దారుణం. వ్యవస్థలు, చట్టాలను ఎంత మేర ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందో పెడన ఘటనతో అర్ధం అవుతుంది. జన సైనికులు బెదిరింపులకు భయపడి, కేసులకు లొంగిపోయే వారు కాదు. మీ అన్యాయాలను, అక్రమాలను నిత్యం నిలదీస్తూనే ఉంటారు. ప్రజాస్వామ్య పంథా లో పోరాటం చేస్తాం” అన్నారు.

 

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *