పంట రుణాలపై వడ్డీ భారం తగ్గింపు
మరింత మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా సున్నా వడ్డీ పంట రుణాల పథకం
2020–21 రబీలో రూ.లక్ష లోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు వచ్చే నెలలో వడ్డీ జమ
ఇప్పటివరకు అర్హత పొందిన వారు 7.20 లక్షల మంది
వడ్డీతో సహా రుణాలు చెల్లించేందుకు ఈ నెల 31 వరకు గడువు
మరింత మంది రుణాలు చెల్లించి, పథకానికి అర్హత పొందేలా ఆర్బీకేల ద్వారా ప్రచారం
ఈసారి రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల మేర వడ్డీ రాయితీ పొందే అవకాశం
ఏప్రిల్ 7లోగా సున్నా వడ్డీ పోర్టల్‌లో వడ్డీ రాయితీ వివరాలు అప్లోడ్
సన్న, చిన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకు పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించే వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని మరింత మంది అన్నదాతలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2020–21 రబీలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు వచ్చే నెలలో వడ్డీ రాయితీని జమ చేయనుంది. ఇప్పటికే ఈ సీజన్లో 7.20 లక్షల మంది అర్హులున్నట్టుగా గుర్తించారు. వడ్డీతో సహా రుణాలు చెల్లించేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువున్నందున మరింత మందికి పథకం కింద లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 31 లోగా రుణాలు చెల్లించేందుకు ఆర్బీకేల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తోంది.
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం తీసుకున్న పంట రుణాలపై బ్యాంకులు 7 శాతం వడ్డీని వసూలు చేస్తాయి. ఇందులో 3 శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. మిగతా 4 శాతం వడ్డీని అర్హులైన రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకం కింద 2019 ఖరీఫ్‌లో 14.27 లక్షల మంది రైతులకు రూ.289.42 కోట్లు, 2019–20 రబీలో 5.61లక్షల మందికి రూ.92.39 కోట్లు, 2020 ఖరీఫ్‌లో 6.67 లక్షల మందికి రూ.112.70 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా 2014–15 నుంచి 2018–19 మధ్య 42.32 లక్షల మంది రైతులకు గత ప్రభుత్వం చెల్లించని రూ.1180.66 కోట్ల బకాయిల్లో ఇప్పటివరకు 38.42 లక్షల మంది రైతులకు రూ.688.25 కోట్లు జమ చేసింది.
2020–21 రబీలో రికార్డు స్థాయిలో 38.76 లక్షల మంది రైతులకు రూ.72,724 కోట్ల వ్యవసాయ రుణాలు ఇచ్చారు. వీటిలో 12.70 లక్షల మందికి రూ.19 వేల కోట్లు పంట రుణాలుగా ఇచ్చారు. వీరిలో లక్ష లోపు రుణాలు తీసుకుని ఇప్పటికే తిరిగి చెల్లించిన వారు 7.20 లక్షల మంది. మిగతా వారు కూడా రుణాలు చెల్లించి, ఈ పథకానికి అర్హత పొందేలా ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తోంది. ఈ పథకం కింద రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు రైతులకు లబ్ధి కలుగుతుంది.
అర్హత పొందాలంటే..
ఏ పంటపై రుణం తీసుకున్నారో ఆ పంటే సాగు చెయ్యాలి. పంట వివరాలను తప్పనిసరిగా ఈ క్రా‹ప్లో నమోదు చేయించాలి. రుణాన్ని వడ్డీతో సహా ఏడాదిలోగా (మార్చి 31వ తేదీ) చెల్లించాలి. దీనిపై ఆర్బీకే సిబ్బంది ద్వారా రైతుల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ ఒక ఆధార్ నంబరుపై ఒక అకౌంట్ నంబర్‌ను మాత్రమే మ్యాప్ అయ్యేలా డేటాను అప్డేట్ చేస్తున్నారు. గడువులోగా రుణాలు చెల్లించిన రైతుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల వద్ద ప్రదర్శిస్తారు. అర్హులైన రైతుల వివరాలను బ్యాంకుల ద్వారా వైఎస్సార్ ఎస్వీపీఆర్ పోర్టల్‌లో ఏప్రిల్ 7వ తేదీలోగా అప్లోడ్ చేస్తారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఈ పథకం కింద రైతులకు 4 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది, రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకొని, మార్చి 31 లోపు వడ్డీతో సహా రుణం మొత్తాన్ని చెల్లించిన వారు బ్యాంక్‌ను సంప్రదించి పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి.