ap news

ఏప్రిల్ 4 నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన

ఏప్రిల్ 6న వ‌లంటీర్ల‌కు స‌త్కారం, 8న వ‌స‌తి దీవెన‌

కలెక్టర్‌, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలన్నీ ఒకే చోట..

మంచి డిజైన్ల‌తో పదికాలాలు గుర్తుండేలా భవనాల నిర్మాణం ఉండాలి

సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలి

అధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశం

కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం సమీక్ష

సుస్థిర ఆర్థిక ప్రగతికోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తులో నిర్మించనున్న పరిపాలనా సముదాయాల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ చర్చించారు. ఏప్రిల్‌ 4 ఉదయం 9:05 నుంచి 9:45ల మధ్య కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు కాగా, దీనికి సీఎం ఆమోదం తెలిపారు. ఏప్రిల్‌ 6న వలంటీర్ల సత్కారం, ఏప్రిల్‌ 8న వసతి దీవెన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.

ఈ సంద‌ర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి వివరాలను సీఎస్‌ సహా, ఇతర ఉన్నతాధికారులు సీఎంకు నివేదించారు. కొత్తజిల్లాలకు సంబంధించి ప్రజలనుంచి 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా చేయాల్సిన మార్పులు, చేర్పులు చేశామని చెప్పారు. ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాతనే కలెక్టర్లు సిఫార్సులు చేశారన్నారు. సిబ్బంది విభజన, వారికి పోస్టింగుల్లో సిక్స్‌ పాయింట్‌ ఫార్ములా, రాష్ట్రపతి ఉత్తర్వులు.. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నామన్నారు. వీటిని పరిగణలోకి తీసుకునే కొత్త జిల్లాల పాలనాయంత్రాంగం నిర్మాణం, పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలు తయారుచేశామన్నారు.

కొత్తజిల్లాలకు సిబ్బంది వెళ్లేలోగా అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకోవడానికి ఒక చెక్‌లిస్టు కూడా తయారుచేశామని అధికారులు తెలిపారు. కొత్త జిల్లాలకు సంబంధించి నూతన వెబ్‌సైట్లు, కొత్త యంత్రాంగాలు ఏర్పాటవుతున్నందున వాటికి అనుగుణంగా ప్రస్తుతం ప్రభుత్వం వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు.. తదితర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని తెలిపారు. అలాగే కొత్త జిల్లాల సమాచారంతో కూడిన హ్యాండ్‌ బుక్స్‌ కూడా తయారు చేసినట్టు వెల్లడించారు. కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలను ఖరారు చేశామన్నారు. సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ భవనాలను ఎంపిక చేశామని, లేనిచోట ప్రైవేటు భవనాలను అద్దె ప్రాతిపదికిన తీసుకున్నామని తెలిపారు.

సీఎం ఆదేశాలు..
కొత్త జిల్లాల్లో పరిపాలనా సముదాయాల నిర్మాణాలకోసం అనువైన స్థలాల ఎంపికను పూర్తిచేయాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. కనీసంగా 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాల‌న్నారు. కలెక్టర్‌తోపాటు, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలన్నీ కూడా ఒకే సముదాయంలో ఉండేలా చూసుకోవాల‌ని సూచించారు. అంతేకాకుండా వారి క్యాంపు కార్యాలయాలు కూడా అదే ప్రాంగణంలో ఉండేలా తగిన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాల‌న్నారు. ఈ భవనాల కోసం మంచి డిజైన్లను ఎంపిక చేసుకోవాల‌ని సూచించారు. పదికాలాలు గుర్తుండేలా భవనాల నిర్మాణం ఉండాల‌ని ఆదేశించారు. ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకున్న జిల్లాల్లో.. కొత్త భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాల‌ని అధికారులకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స్పష్టం చేశారు.

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఐటీ ముఖ్యకార్యదర్శి జి జయలక్ష్మి, ప్లానింగ్‌ సెక్రటరీ వి విజయకుమార్‌ ఇతర  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *