కొత్త జిల్లాల ఏర్పాటు ఒక సువర్ణాధ్యాయం
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర కార్యాలయాలను పరిశీలించిన మంత్రి బొత్స, ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి
కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభివర్ణించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా పరిపాలన సౌకర్యార్థం, ఇచ్చిన మాట తప్పకుండా పరిపాలన వికేంద్రీకరణే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిపదికన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఫలితంగా సామాన్యులకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ అవుతాయని అన్నారు. ప్రధానంగా పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటవుతున్న మన్యం జిల్లాతో ఇక్కడి ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఒనగూరతాయని, ఈ ప్రాంత రూపు రేఖలు మరిపోతాయని ఉద్ఘాటించారు. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణితో కలిసి ఆయన ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పర్యటించారు. నూతనంగా ఏర్పాటవుతున్న ప్రభుత్వ కార్యాలయ భవనాలను పరిశీలించారు.
ముందుగా నూతన ఐటిడిఏ భవనంలో ఏర్పాటు చేయబోతున్న కలెక్టర్ కార్యాలయాన్ని, సమావేశ మందిరం, ఇతర అధికారుల కార్యాలయాలను పరిశీలించారు. అనంతరం స్థానిక ఆర్.సి.ఎం. స్కూల్ లో ఏర్పాటవుతున్న కార్యాలయాలను పరిశీలించి స్థానిక అధికారులకు సూచనలు చేశారు. పరిపాలనకు అనుకూలమైన ప్రాంతంలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారని, ఇతర పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి కార్యాలయాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక అధికారులకు సూచించారు. భవనాల పరిశీలన అనంతరం మంత్రి బొత్స, ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి స్థానిక ఐటిడిఏ కార్యాలయంలో ఐటిడిఏ పీవో కూర్మనాథ్, మున్సిపల్ కమిషనర్ సింహాచలం నాయుడు, డిఎస్పీ మోహన్ రావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు