ap news

సీఎం జగన్ సోషల్ ఇంజనీరింగ్

ఏడుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన సందర్భంగా శాసనమండలి ఆఫీస్‌ వద్ద మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి

-వైఎస్‌ఆర్‌సీపీ నియమంగా ‘సామాజిక వర్గ సాధికారత’
– మండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అగ్రస్థానం
– అది సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సోషల్‌ ఇంజనీరింగ్‌
సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ

-18 మంది ఎమ్మెల్సీ స్థానాల్లో 11 మంది బీసీలకు ఇప్పుడు పదవులు
-వైఎస్సార్సిపీకి చెందిన మొత్తం 44 మంది ఎమ్మెల్సీలలో 30 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సభ్యులే.. ఇది చరిత్రాత్మకం
-మండలిలో పార్టీ నుంచి ఇప్పటికే నలుగురు మైనార్టీలు
గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ వర్గాల వారికి ప్రాధాన్యం
గుర్తు చేసిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి

చంద్రబాబు హయాంలో అన్ని వర్గాలకు అన్యాయం
బీసీలను తమ హక్కు, ఓటు బ్యాంక్‌గా చెప్పుకున్న టీడీపీ
వారికి ఏనాడూ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వని చంద్రబాబు
బీసీలకు నీ హయాంలో పదవులు ఎందుకు ఇవ్వలేదు బాబూ?
– సూటిగా ప్రశ్నించిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి

మీడియాతో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే..:

సీఎంగారి ‘సోషల్‌ ఇంజనీరింగ్‌’
18 ఎమ్మెల్సీ స్థానాల్లో 11 మంది బీసీలకు పదవులు. ఇదే సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సోషల్‌ ఇంజినీరింగ్‌. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న సోషల్‌ ఇంజనీరింగ్, ఇప్పుడు ఎమ్మెల్సీల అభ్యర్థుల ఎంపికలోనూ కనిపించింది. మొదటి నుంచి సామాజిక న్యాయం అనేది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ విధానంగా మనసా వాచా కర్మణా చిత్తశుద్ధిగా అమలు చేస్తున్నాం.
ఇప్పుడు పోటీ జరుగుతున్న 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు ఇవ్వగా.. అందులో 11 స్థానాలు బీసీలకు కేటాయించడమనేది ఒక చరిత్రాత్మక విషయంగా చెప్పుకోవచ్చు. గతంలో మేం ప్రకటించిన సామాజిక న్యాయాన్ని దేశమంతా గమనించింది. ఆ రోజు చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని.. ఆచరణలో ముందున్నామని గర్వంగా చెబుతున్నాం.

మండలిలో మైనార్టీలకూ పెద్దపీట:
శాసనమండలిలో ఇప్పటికే మైనార్టీలు నలుగురు ఉన్నారు. ఇది కూడా ఒక రికార్డుగా చెప్పుకోవాలి. ఈ నామినేషన్ల ప్రక్రియ అంతా పూర్తయ్యాక.. శాసనమండలిలో మొత్తం 58 ఎమ్మెల్సీ స్థానాల్లో 10 స్థానాలు గ్రాడ్యుయేట్లు, టీచర్ల నుంచి ఎన్నికను పక్కన బెడితే, మిగిలిన 48 స్థానాల్లో టీడీపీ బలం 4కు పడిపోయింది. వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన 44 మందిలో 30 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సభ్యులు ఉండబోతున్నారు. ఇదొక చరిత్రాత్మక పరిణామం.

అవకాశమున్న ప్రతి చోటా వారే..:
రాజకీయ సాధికారత దిశగా నామినేటెడ్‌ పదవులు మొదలు.. ఎన్నికయ్యే పదవుల వరకు ఎక్కడ అవకాశముంటే అక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేయడంలో సీఎంగారు చూపుతున్న విప్లవాత్మక చొరవ ప్రజల మన్ననలు పొందుతోంది. జగన్‌గారు మాటల్లో కాదు చేతల్లో చూపుతారనే విషయం ప్రపంచానికి చాటింది.

పార్టీ నియమంగా ‘సామాజిక సాధికారత’:
మీరు గమనిస్తే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల స్థాయి, నగర పాలక ఎన్నికల్లో సామాజికవర్గ న్యాయం స్పష్టంగా కనిపిస్తోంది. మేయర్లలో 90 శాతం, జడ్పీ పదవుల్లో 70 శాతం, మండల పదవుల్లో 67 శాతం, మున్సిపల్‌ చైర్మన్లలో 72 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవులు దక్కాయి. వాస్తవానికి ఆ వర్గాలకు 50 శాతానికి మించి పదవుల్ని కట్టబెట్టడంపై ఎవరూ నిర్దేశించలేదు. అయినా, సీఎంగారు స్వయంగా కీలక నిర్ణయం తీసుకుని పార్టీకి ఒక నియమం పెట్టారు.
అందులో భాగంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవులు దక్కుతున్నాయి. దీన్ని పార్టీలో అందరూ ఆహ్వానిస్తున్నారు. చివరకు మంత్రివర్గంలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 70శాతం ఉన్నారు. మండలి ఛైర్మన్‌ ఎస్సీ నాయకుడు కాగా, డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళకు అవకాశమిచ్చారు. అలాగే శాసనసభ స్పీకర్‌గా ఒక బీసీ నాయకుడు ఉన్నారని సవినయంగా, సగర్వంగా చెబుతున్నామని అన్నారు.

 

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *