ap news

రాజధాని భూములపై సిట్ దర్యాప్తు కొనసాగింపు

రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనతి

– సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం..
– గత ప్రభుత్వంలో ఏ తప్పు జరగకపోతే భయమెందుకు..?
– దోషులు ఎవరూ తప్పించుకోలేరు.. 

రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత

అమరావతి భూముల కుంభకోణంపై స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్) దర్యాప్తుకు ప్రభుత్వం చేసిన అప్పీల్ ను పరిగణనలోకి తీసుకుని మళ్లీ విచారణ జరిపించండని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, స్వాగతిస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. బుధవారం కొవ్వూరు మంత్రి క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వ అవినీతికి సంబంధించి సిట్ ఏర్పాటుపై ‘స్టే’ విధిస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చేసిన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిందన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరగకపోతే దర్యాప్తును ప్రాథమిక దశలోనే ఎందుకు అడ్డుకున్నారని హోంమంత్రి ప్రశ్నించారు.
గత ప్రభుత్వంలో జరిగిన అమరావతి భూముల కుంభకోణం, దళితుల అసైన్డ్ ల్యాండ్స్, ఔటర్ రింగ్ రోడ్డులో అవకతవకలు, భారీ ప్రాజెక్టుల్లో నిబంధనల ఉల్లంఘనలు తదితర అంశాలపై వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపడుతున్న సమయంలో హైకోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై గత ప్రభుత్వంలోని నాయకులు స్టే తెచ్చుకోవడం జరిగిందన్నారు. ప్రాథమిక విచారణలో ఉండగానే హైకోర్టులో స్టే తెచ్చుకున్నారని.. గత ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి, ఏ అక్రమాలు జరగకపోతే విచారణ ఎదుర్కొవడానికి ఇబ్బంది ఏంటి? అని ప్రశ్నించారు. తప్పు చేశామని భయం ఉండబట్టే స్టే తెచ్చుకున్నారన్నారు. విచారణను ఎదుర్కొని వాళ్ల నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. విచారణ జరిగితే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు బయటపడతాయన్న భయంతోనే ప్రాథమిక విచారణలో ఉండడానే హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారని తెలిపారు. గతంలో కూడా ఈ అంశంపై మంత్రివర్గ ఉప సంఘం వేసినప్పుడు భూముల కొనుగోళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలను అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చారని తెలిపారు. ఆ విషయాలన్నీ అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిపి ప్రజల దృష్టికి తీసుకొచ్చామన్నారు. దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతంలో జరిగిన ప్రతి అంశాన్ని పారదర్శకంగా విచారణ చేస్తామన్నారు. దోషులు ఎవరూ తప్పించుకోలేరని, ఎప్పటికీ సత్యమే గెలుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని తానేటి వనిత తెలిపారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *