ap news

నేటి నుంచి పోలవరం పోరుయాత్ర

నిర్వాసితుల సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా
మీట్‌ ది ప్రెస్‌లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ముంపు ప్రజలను పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
పునరావాసం కోసం ప్రత్యామ్నాయ ప్రణాళిక

పోలవరం ముంపు ప్రాంత నిర్వాసితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వరదలో ముంచేస్తున్నాయని, ఈ నేపథ్యంలో వారి సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా సిపిఎం ఆధ్వర్యాన మంగళవారం నుండి జులై 4వ తేదీ వరకూ పోలవరం పోరుయాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో ఎపియుడబ్ల్యుజె, ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. సుమారు 300 కిలోమీటర్లపాటు సాగే యాత్ర నెల్లిపాకలో బయలుదేరి ముంపు ప్రాంతాలతోపాటు ఏలూరు, కృష్ణా జిల్లాలో పర్యటించి విజయవాడ చేరుకుంటుందని తెలిపారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా పునరావాసం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని తెలిపారు. 55 వేలకోట్ల ప్రాజెక్టులో రూ.33 వేల కోట్లు పునరావాసమే ఉంటే అంత ప్రాధాన్యతగల అంశాన్ని పక్కనబెట్టేసి డ్యాం నిర్మాణం గురించే చర్చిస్తున్నారని అన్నారు. పునరావాసం సహజ న్యాయసూత్రమని, ప్రభుత్వాలు ఆ అంశాన్నే పట్టించుకోవడం లేదని తెలిపారు. నోరులేని గిరిజనులు పడుతున్న బాధలు కూడా బయట ప్రపంచానికి తెలియనీయడం లేదని, బెదిరింపులతో వారిని వెళ్లగొట్టే పని చేస్తున్నారని తెలిపారు. గ్రామాలకు గ్రామాలను వరదల్లో ముంచేసి కనీస పరిహారం కూడా ఇవ్వకుండా అక్కడ నుండి పంపించేస్తున్నారని అన్నారు. 45 మీటర్ల ఎత్తు వస్తే మునుగుతాయని చెప్పిన గ్రామాలు 41 మీటర్ల ఎత్తుకే మునిగిపోతున్నాయని, చింతూరు మండలం కూడా పూర్తిగా ముంపునకు గురైందని అన్నారు. గత పాలకులు రూ.6.50 లక్షలు ఇస్తామంటే జగన్మోహన్‌రెడ్డి రూ10 లక్షలు ఇస్తామన్నారని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. చింతూరు, ఎటపాక, వి.ఆర్‌.పురం, కూనవరం, దేవీపట్నం, కుక్కునూరు, వేలేరుపాడు  మండలాల్లో ప్రజలు ప్రాజెక్టు కోసం తమ సర్వస్వాన్ని వదులకుని నేడు ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా రోడ్డున పడ్డారని అన్నారు. పైగా అధికారుల బెదిరింపులు కూడా తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. నెలల తరబడి ముంపులో ఉన్న ప్రజలకు కొద్దిగా బియ్యం ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఇంటి నిర్మాణానికి ఇస్తానన్న పదివేలు కూడా ఇవ్వలేదని అన్నారు. పునరావాసం విషయంలో కేంద్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పోలవరం పునరావాసం విషయంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను సిపిఎం పార్టీగా అడుగుతున్నామని తెలిపారు. 20వ తేదీ నుండి నిర్వహించబోయే యాత్ర కడుపు మండిన గిరిజనులు ఉనికి కాపాడుకునేందుకు చేస్తున్న యాత్రని అన్నారు. దీనిలో వందలాది మంది గిరిజనులు పాల్గొంటున్నారని, పునరావాసం లేకుండా ప్రపంచంలో ఎక్కడా ప్రాజెక్టులు లేవని, ఇక్కడ మాత్రం పునరావాసం లేని ప్రాజెక్టు కడుతున్నారని ఇది గిరిజన ప్రజలను మోసం, దగా చేయడమేనని పేర్కొన్నారు.
విద్యుత్‌ ఛార్జీలపై ప్రజల్లో ఆగ్రహం
విద్యుత్‌ ఛార్జీలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని శ్రీనివాసరావు తెలిపారు. కేంద్రం ఇచ్చే అప్పుల కోసం షరతులు పెట్టి మరీ భారాలు మోపుతున్నారని తెలిపారు. స్మార్ట్‌ మీటర్లు అవసరం లేకపోయినా బిగిస్తున్నారని, దీనికి వైసిపి, టిడిపి రెండు పార్టీలూ మద్దతు ఇచ్చాయని అన్నారు. రైతు, కార్మిక ఉద్యమాలు ముందుకు రావడంతో వెనక్కు తగ్గారని, అయినా బలవంతంగా బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో ఉనికిలో లేని బిజెపికి మూడు పార్టీల మద్దతు
రాష్ట్రంలో ఉనికిలోలేని బిజెపికి, వైసిపి, టిడిపి, జనసేన మద్దతు ఇస్తున్నాయని విమర్శించారు. ఒక్కశాతం ఓటు కూడా లేని పార్టీకి రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీల సాగిలపడి మద్దతు ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో బిజెపి ఉనికి లేకుండా చేయాలనేదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. కర్నాటకలో అమూల్‌ను తీసుకొస్తే అక్కడి ప్రజలు నందిని కంపెనీ కోసం అమూల్‌ను తిప్పి కొట్టి బిజెపికి సిగ్గొచ్చేలా చేశారని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేస్తున్నారని తెలిపారు. కేంద్రంలో బిజెపి దేశానికి చేస్తున్న దేమీ లేదని కొత్త ప్రాజెక్టులు పెట్టకపోగా ఉన్న ప్రాజెక్టులు, కంపెనీలను అదానీకి స్వాధీనం చేస్తోందని తెలిపారు. అటువంటి దానికి రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఎందుకు మద్దతు ఇచ్చి స్వాగతిస్తుందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఒక్కరికి కూడా ఉపాధి లేకపోగా స్టీలు ఫ్యాక్టరీతోపాటు వేల ఎకరాల భూ బ్యాంకును కంపెనీల పేరుతో లాక్కుంటున్నారని తెలిపారు. అదే సమయంలో దళితులను వారి భూముల్లోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుపెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు.
ప్రమాదంలో శాంతి భద్రతలు
రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రమాదంలో ఉన్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. శాంతి భద్రతలు అంటే కర్రలతో కొట్టుకోవడం, దొమ్మీలు దోపిడీలే కాదని సామాన్య ప్రజలకు రక్షణ లేకపోవడం కూడా శాంతి భద్రతల సమస్యగానే చూడాల్సి ఉంటుందని అన్నారు. గిరిజనులు, దళితులు, మహిళలు, పిల్లలు, యువతులకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. రేపల్లె సమీపంలో పదో తరగతి చదువుతున్న అమర్నాథ్‌ తన అక్కను వేధించొద్దన్నందుకు దుండగులు తగులబెట్టి హత్య చేశారని ఇది దుర్మార్గ చర్యని అన్నారు. అలాగే చించినాడలాంటి చోట దళితుల భూముల్లో అక్రమంగా మట్టి తవ్వుతూ ప్రశ్నించిన దళితులపైనే కేసులు బనాయించారని, వారి భూముల్లోకి వెళ్లకుండా పోలీసులను కాపలా పెట్టారని తెలిపారు. పోలీసు వ్యవస్థ కూడా రాజకీయ నాయకులకు సేవ చేసేందుకు పనిచేస్తోంది మినహా ప్రజలకు రక్షణ కల్పించేదిశగా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.  దిశ చట్టం, యాప్‌లు ఏమి చేస్తున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని పేర్కొన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావును సన్మానిస్తున్న ఏపీయు డబ్ల్యు జె ప్రతినిధులు

అనిశ్చితిలో రాష్ట్ర రాజకీయాలు
రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు దాదాపు స్వతంత్రను కోల్పోయాయని అన్నారు. రాష్ట్రంలో ఏమి చేయాలన్నా ఢల్లీి పాత్రే కీలకంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి సొంత ప్రయోజనాల కోసం కేంద్రంలోని బిజెపి చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు. బిజెపి ఎలా రూట్‌ మ్యాప్‌ ఇస్తే అలా నడుస్తున్నాయని తెలిపారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు పూర్తి అనిశ్చితిలో పడిపోయాయని విమర్శించారు. 2014లోనే ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందేదని అన్నారు. 20 ఏళ్ల క్రితం ప్రపంచ బ్యాంకు షరతులు ఉండేవని, ఇప్పుడు కేంద్రం షరతులతో ప్రభుత్వాలు నడుస్తున్నాయని అన్నారు. రాష్ట్రాలపై పడుతున్న భారాలు కనబడకుండా ఉండేందుకు ఎజెండాలనే మార్చేసి చెప్పుల రాజకీయాలు చేస్తున్నారని, ఇంతకంటే ప్రమాదం మరొకటి లేదని అన్నారు. అయినా ప్రజల ఛీత్కారానికి గురైన బిజెపి చుట్టే రాష్ట్రంలో ఉన్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు తిరుగుతున్నాయని విమర్శించారు.
జర్నలిస్టుల పోరాటానికి మద్దతు
రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం, హక్కుల కోసం జర్నలిస్టులు చేస్తున్న పోరాటానికి సిపిఎం పార్టీగా పూర్తి మద్దతు, సంఫీుభావం ప్రకటించారు. జర్నలిస్టుల్లో వేర్వేరు సంఘాలు ఉండొచ్చని, సమస్యలు మాత్రమే ఒకటే ఉంటాయని, వాటి పరిష్కారానికి జరిగే పోరాటానికి తమ పార్టీ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారం ఎజెండాగా ముందుకు
రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. దీనికోసం వామపక్షాలతో కలిసి పోరాడుతామని అన్నారు. ప్రత్యామ్నాయ అభివృద్ధి వ్యూహంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. అంతిమంగా రాష్ట్రంలో బిజెపిని ఒంటరి చేయడమే లక్ష్యంగా ముందుకెళతామన్నారు. రాష్ట్రంలో ఉన్న పార్టీలు కూడా బిజెపితో ఉంటాయో, ఊడతాయో చెబితే అప్పుడు ఏమి చేయాలో ఆలోచిస్తామని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో పాట్నాలో జరిగే సదస్సు కూడా బిజెపికి వ్యతిరేకంగా ఉండే ఓటు చీలకూడదన్న ఆలోచనతోనే జరుగుతోందని పేర్కొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *