ap news

నూతన రిజిస్ట్రేషన్ విధానం – అపోహలు – వాస్తవలు

రాష్ట్ర రెవిన్యూ శాఖ స్పెషల్ సి.ఎస్,  సి.సి.ఎల్.ఏ. సాయి ప్రసాద్

 అమరావతి,  ఆంధ్రావని న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న నూతన రిజిస్ట్రేషన్ విధానంలో పారదర్శకతకు, భద్రతకు పెద్ద పీట వేయడం జరిగిందని, ఈ విషయంలో ప్రజలు ఎటు వంటి ఆంధోళన చెందాల్సిన పనిలేదని   రాష్ట్ర రెవిన్యూ శాఖ స్పెషల్ సి.ఎస్. మరియు సి.సి.ఎల్.ఏ. జి.సాయి ప్రసాద్ స్పష్టం చేశారు.  సోమవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్  సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖ కమిషనర్ మరియు ఐ.జి. వి.రామకృష్ణతో కలసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ నూతన రిజిస్ట్రేషన్ విధానంపై ప్రజలు ఎటు వంటి అపోహకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.       1999 లో రిజిస్ట్రేషన్ శాఖను కంపూటరీకరించడం జరిగిందని, అప్పుడు రూపొందించిన సాప్టువేర్నే ఇప్పటికీ అమలు చేయడం జరుగుచున్నదన్నారు. పాత రోజుల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆ సాప్టువేర్ సరిపోయేదని, అయితే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల సంఖ్య ఏడాదికి 25 లక్షల వరకూ పెరిగిన నేపథ్యంలో ఆ సాప్టువేర్ ను అప్ డేట్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించి  నూతన సాప్టువేర్ తో ఈ నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ విధానాలను పరిగణలోకి తీసుకుని ఈ నూతన సాప్టువేర్ ను రూపొందించడం జరిగిందన్నారు. ఈ సాప్టువేర్ అప్లికేషన్ లో  క్రయ, విక్రయ దారుని పేరుతో పాటు ఆస్తి వివరాలను నమోదు చేయగానే ఒక  మోడల్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుందన్నారు.   అయితే అదనంగా ఏమన్నా క్లాజులను జోడించాలను  కుంటే 20 క్లాజుల వరకూ ఈ అప్లికేషన్ లో   జోడించే అవకాశం ఉందన్నారు. ఆ క్లాజులు అన్నింటినీ కలుపుకుని సమగ్రంగా ఒక డాక్యుమెంట్ జనరేట్ అవ్వడం జరుగుతుందన్నారు. రెవిన్యూ, రిజిస్ట్రేషన్ వెబ్ సైట్లోని సంబంధిత లింకు డాక్యుమెంట్లు కూడా ఈ అప్లికేషన్ లో కనిపిస్తాయన్నారు. తద్వారా క్రయ, విక్రయాలకు సంబందించిన డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కూడా ఆటోమేటిక్ గా జరుగుతుందన్నారు. ఎవరి ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ శాఖ డాటాలోని విలువల ఆధారంగా స్టాంపు డ్యూటీ క్యాలిక్యులేషన్ కూడా  ఆటోమేటిక్ గా జరిగుతుందన్నారు.  ఈ స్టాంపు డ్యూటీని ఒకే చలానా ద్వారా చెల్లించేందుకు అవకాశం  ఏర్పడిందన్నారు. ఈ విధానంలో సబ్ డివిజన్, మ్యుటేషన్ ప్రక్రియ కూడా ఆటోమేటిక్ గా జరిగుతుందన్నారు. తద్వారా లేని భూమిని ఉన్నట్లుగా చూపించి రిజిస్ట్రేషన్ చేసేందుకు ఏమాత్రం అవకాశం ఉండబోదన్నారు. రిజిస్ట్రేషన్ లకు అవసరమైన స్లాట్ బుకింగ్  కూడా ఈ అప్టికేషన్ ద్వారా ఎంతో సులువుగా అవుతుందన్నారు.

రాష్ట్ర రెవిన్యూ శాఖ స్పెషల్ సి.ఎస్,  సి.సి.ఎల్.ఏ. సాయి ప్రసాద్

ఈ సందర్బంగా పలువురు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెపుతూ కేంద్ర ప్రభుత్వ ఐ.టి. చట్టం-2000 ప్రకారం ఏడాది క్రితం నుండి  ఆస్తుల క్రయ, విక్రయాల డాక్యుమెంట్లకు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అమలు పర్చే అవకాశం కలిగిన నేపథ్యంలో అమ్మే వారి సంతకాన్ని బయోమెట్రిక్ అథంటికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్ సంతకాన్ని తీసుకోవడం జరుగుచున్నదన్నారు. అదే విధంగా రిజిస్ట్రారు సంతకాన్ని కూడా ఎలక్ట్రానిక్ సంతకంతోనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. క్రయ, విక్రయదారుల విజ్ఞప్తి మేరకు ఇ-స్టాంపు పేపర్ మీదే ఎలక్ట్రానిక్ సంతకాలతో ఫిజికల్ కాపీలను కూడా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ డాక్యుమెంట్లను కోర్టులు, బ్యాంకులు కూడా పరిగణలోకి తీసుకుంటాయన్నారు.

క్రయ, విక్రయదారులు కావాలనుకుంటే ఈ నూతన రిజిస్ట్రేషన్ విధానంలో డాక్యుమెంట్ రైటర్ల సేవలను కూడా వినియోగించుకోవచ్చన్నారు.  క్రయ, విక్ర్రయదారులు ఈ అప్లికేషన్ ద్వారా డాక్యుమెంట్ రైటర్ల తోనే డాక్యుమెంట్లను  రూపొందించుకుని, వారు సంతృప్తి పొందిన తదుపరి మాత్రమే సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు. ఏ రిజిస్ట్రారు కార్యాలయం నుండి అయినా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం ఈ నూతన విధానంలో అందుబాటులోకి రానున్నట్లు ఆయన తెలిపారు .

రాష్ట్ర వ్యాప్తంగా  ఉన్న జిల్లా రిజిస్ట్రారు  కార్యాలయాలతో పాటు 294 సబ్ రిజిస్ట్రారు కార్యాలయాలు ఉన్నాయన్నారు. ఈ మద్య రీ-సర్వే  పూర్తి అయిన ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల పంచాయితీ సెక్రటరీలకు సబ్ రిజస్ట్రారు అధికారాలను అప్పగించడం జరిగిందన్నారు.  వచ్చే నెల 15 వ తేదీ నాటికి  రెండో  విడత సర్వే పూర్తి అవ్వబోతున్నదని,  ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయ పంచాయితీ సెక్రటరీలకు కూడా  సబ్ రిజిస్ట్రారు అధికారాలను అప్పగించండం జరుగుచున్నదన్నారు. ఇందుకై వీరికి తగిన శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహించండం జరుగుచున్నదని ఆయన తెలిపారు. వీరి సహకారంతో భూముల క్రయ, విక్రయాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.

ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు పరుస్తున్న ఈ నూతన రిజిస్ట్రేషన్ విధానంలో ఇప్పటి వరకూ 10 కేసులకు పైబడి ఆటోమేటిక్ మ్యుటేషన్ పూర్తి చేయడం జరిగిందన్నారు. అన్ని వ్యవసాయ భూములకు సంబంధించి ఆటోమేటిక్ మ్యూటేషన్ రానున్న రెండు మూడు వారాల్లో  పూర్తి అవుతుందన్నారు. రానున్న నెల రోజుల్లో మున్సిపల్ ఆస్తుల డాటా బేస్  కూడా లింక్ చేస్తున్నామన్నారు.

వ్యవసాయ భూముల విషయంలో రెవిన్యూ శాఖ వారి వెబ్ ల్యాండ్ లో అనుసంధానించడం వలన ఆస్తి మార్పిడి విషయంలో ఎటువంటి తప్పులు దొర్లడానికి అవకాశం ఉండదని,  తద్వారా డబల్ రిజిస్ట్రేషన్లు అరికట్టబడతాయన్నారు.  వ్యవసాయేతర భూముల విషయంలో మునిసిపల్ శాఖ వారి డేటాబేస్ లో అనుసంధాన ప్రక్రియ జరుగుతున్నందువల్ల అటువంటి ఆస్తుల విషయంలో ప్రజలు సురక్షితమైన ఆస్తి లావాదేవీలను నిర్వహించుకోవచ్చన్నారు. కాబట్టి ఈ నూతన రిజిస్ట్రేషన్ విదానంపై ప్రజలు ఎటు వంటి అపోహలకు గురికావద్దని, ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన విజ్ఞప్తి చేశారు.

రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖ కమిషనర్ మరియు ఐ.జి. వి.రామకృష్ణ మాట్లాడుతూ ఈ నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రయోగాత్మకంగా కొన్ని కేంద్రాల్లో అమలు చేయడం జరుగుచున్నదన్నారు. ఫిజిక్ డాక్యుమెంట్ కావాలనుకునే వారికి ఇ-స్టాంపుపైనే ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *