ap news

పిఠాపురంలో జనసేనదే గెలుపు

మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్

ఓటుకు లక్ష పంచినా ప్రయోజనం లేదు..

మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తా

కాకినాడ లోక్ సభ స్థానం జనసేన అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్

పిఠాపురం గెలుపుతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్దేశిద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసి విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఎంత అభివృద్ధి చేయగలడో చేసి చూపిస్తానని వెల్లడించారు. జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిచి దేశం మొత్తం మనవైపు చూసేలా చేద్దామన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు సుమారు 160 మంది పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించిన పవన్ కళ్యాణ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాకినాడ లోక్ సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “పిఠాపురం నాకు ప్రత్యేకమైన నియోజకవర్గం. గెలుపు కోసం ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోలేదు. రాష్ట్రం కోసం పని చేసే నన్ను గెలిపించే నియోజకవర్గం ఉండాలన్న సమయంలో పిఠాపురం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు మా నియోజకవర్గంలో పోటీ చేయ్ నిన్ను అసెంబ్లీకి పంపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పిన తీరు నా గుండెకు తాకింది. 2009, 2019లో పిఠాపురం నుంచి పోటీ చేయమని చాలా మంది అడిగారు. అప్పుడు కుదర్లేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది.

వంగా గీత జనసేనలోకి రావాలని కోరుకుంటున్నా : వంగా గీత 2009లో పి.ఆర్.పి. ద్వారా ఎమ్మెల్యేగా శాసనసభకు వెళ్లారు. ప్రస్తుతం దురదృష్టవశాత్తు నాకు ప్రత్యర్ధిగా ఉన్నారు. భవిష్యత్తులో గీత వైసీపీ వీడి జనసేనలోకి రావాలని కోరుకుంటున్నాను. చలమలశెట్టి సునీల్ బాగా పరిచయం ఉన్నవారే. 2009లో పి.ఆర్.పి. ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. సునీల్ ఇటీవల ఒక పెళ్లిలో కూడా కలిశారు. ఆయన మంచి వారేగాని తప్పు పార్టీని ఎంచుకున్నారు. కాకినాడ పార్లమెంటు స్థానంలో జనసేన భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. కాకినాడ రాష్ట్రానికి కీలకమైన ప్రాంతం. ఈ రోజు పార్టీలో చేరేందుకు అన్ని కులాల నుంచి వచ్చారు. నా కులానికి నేను అభిమానిస్తా. మిగతా కులాలను గౌరవిస్తాను. టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పింక్ డైమండ్ అదృశ్యమైందని నాకు స్వయంగా సందేశం పంపారు. నన్ను మాట్లాడమని అడిగారు. ఆ సమయంలో ఆయన టీడీపీని తిట్టిపోశారు. అదే గొంతుక వైసీపీ రాగానే అడగడం మానేసిందన్నారు.

కాకినాడ ఎంపీ అభ్యర్ధి ఉదయ్ శ్రీనివాస్ తో పవన్ కళ్యాణ్, నాగబాబు

పిఠాపురంలో లక్ష ఓట్ల మెజార్టీ రావాలి : ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో గాజు గ్లాసు మీద డైలాగ్ హరీష్ శంకర్ ఒత్తిడితో చెప్పాను. గ్లాసుకి ఉన్న లక్షణం పగిలే కొద్ది పదునెక్కుద్దని. ఒక దశాబ్దం అధికారం లేకుండా పార్టీ నడిపించిన వాడిని. 21 ఎమ్మెల్యే, రెండు పార్లమెంటు సీట్లు కొట్టి చూపించామంటే భారత దేశం ఆంధ్రా వైపు చూసేలా చేస్తాను. ఇవాళ మనం లేకపోతే పొత్తులేని పరిస్థితి. రెండు చేతులు ఎత్తి నమస్కరించి రాష్ట్రం కోసం కలసి రావాలని కోరాను. మన నేల తల్లిని మనమే కాపాడుకోవాలి. గుడ్డిగా ఓటు వేయొద్దు. అన్నీ ఆలోచించి మంచివారిని ఎన్నుకోండి. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం మనం తీసుకుంటున్నాం. భవిష్యత్తులో స్థానిక ఎన్నికల్లో మూడో వంతు పదవులు తీసుకుందాం. కష్టపడే వారిని గుర్తుపెట్టుకుని తప్పకుండా న్యాయం చేస్తాం. మనమంతా జాషువా చెప్పిన విశ్వనరులం. కులాలు, మతాలు, ప్రాంతాలు దాటి పిఠాపురం అభివృద్ధి చేసుకుందాం. పిఠాపురం లక్ష ఓట్ల మెజారిటీ రావాలి. కాకినాడ పార్లమెంటు దద్దరిల్లిపోవాలని అన్నారు.

పవన్ కళ్యాణ్ ని గెలిపించే బాధ్యత తీసుకుందాం: కాకినాడ లోక్ సభ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్

కాకినాడ లోక్ సభ జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ “పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని ఆ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రం మొత్తం కోరుకుంది. స్వయానా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం వెయ్యి రెట్లు ఆనందాన్నిచ్చింది. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు. పవన్ కళ్యాణ్ ని మనమంతా లక్ష మెజారిటీతో గెలిపించాలి. ఆ బాధ్యత పిఠాపురం ఓటర్లు అందరం తీసుకుందాం” అన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *