ap news

దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించుకున్నారు. విజయ దశమి సందర్భంగా భార్య భువనేశ్వరితో కలిసి దుర్గగుడికి వెళ్లిన చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి చీర, కానుకలు సమర్పించారు. గుడి అర్చకులు, ఈవో భ్రమరాంబ ఆలయ మర్యాదలతో చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రజలు అందరినీ దుర్గమ్మ చల్లగా చూడాలి అని పూజలు చేశామన్నారు. భక్తులు నవరాత్రులు ఎంతో నిష్ఠతో పూజలు చేసి కానుకలు సమర్పిస్తారని…అందరినీ దుర్గమ్మ కరుణించాలి అని అన్నారు. నాడు తెలుగు దేశం ప్రభుత్వం హాయంలో ఇంద్రకీలాద్రి పై ఎన్నో అభివృద్ధి పనులు చేశాం అని అన్నారు. 150 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినట్లు చంద్రబాబు వివరించారు. ఆ అభివృద్ధి పనులను కొనసాగించాలి అని చంద్రబాబు అన్నారు. దసరా రోజు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందన్న చంద్రబాబు….అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పారు. దుర్గమ్మ తల్లి సాక్షిగా నాడు రాజధానిగా అమరావతి ని సంకల్పించామని గుర్తు చేశారు. అన్ని పవిత్ర స్థలాల నుంచి నీరు, మట్టి తీసుకువచ్చి అందరినీ భాగస్వాములను చేసి అమరావతి నిర్మాణం ప్రారంభించామన్నారు. నాడు అన్ని రాజకీయ పార్టీలు రాజధానిగా అమరావతికి ఆమోదం తెలిపాయని అన్నారు. వైసీపీ వాళ్ళు కూడా తాము ఇక్కడే ఇళ్ళు కట్టుకున్నాము..ఇదే రాజధాని అని నాడు చెప్పలేదా అని ప్రశ్నించారు. రాజధాని అమరావతిపై రోజుకోమాట మాట్లాడడం మంచిది కాదని…అలాంటి వాళ్ళను దుర్గమ్మ తల్లి సహించదు అని చంద్రబాబు నాయుడు అన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *