‘పెనుగొండ’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
గుంటూరు, డిసెంబర్ 19: ప్రముఖ రచయిత, అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. దీపిక అభ్యుదయ ‘వ్యాస సంపుటి’కి గాను ఆయన ఈ అవార్డు పొందారు. గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్న పెనుగొండ 1985-90 మధ్యకాలంలో గుంటూరులో విశాలాంధ్ర విలేకరిగా పనిచేస్తుండగా తాను ఆంధ్రపత్రికలో పనిచేస్తుండే వాడినని, నాటి నుంచి కూడా తనకు ఎంతో సాన్నిహిత్యం వుందని సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు తెలిపారు. ఈ సందర్భంగా తన ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.పెనుగొండ వారు తెలుగు సాహిత్యంలో చేసిన కృషికి గాను అజో-విభో కందాళం వారి ‘జీవన సాఫల్య పురస్కారం’ లభించింది. గతంలో అధికార భాషా సంఘం వారి తెలుగు భాషా పురస్కారం (2003)లో, ప్రజాకవి సుంకర సత్యనారాయణ స్మారక పురస్కారం (2003) లభించాయి. 1972 నుంచి అభ్యుదయ రచయితల సంఘం కార్యకర్తగా, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించారు. 2023లో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు సాహితీవేత్తగా పెనుగొండ గుర్తింపు పొందారు. 1972లో సమిధ అనే కవితతో తన సాహితీ ప్రస్థానం ప్రారంభించారు. ఆయన తొలి గ్రంథం “అనేక” 2004లో ప్రచురితం కాగా, విదిత 2014లో ప్రచురణయింది. దీపిక 2021లో ప్రచురించారు. దీపికలో పూర్తి సాధికారత కనిపిస్తుంది. ‘దీపిక’లో దర్శించిన విషయాలపై వొరప్రసాద్ (సాహితీ స్రవంతి) ఇలా వ్యాఖ్యానించారు. “తొలి, మలితరం తెలుగు కథలు” సంకలనం గురించి దీపిక వివరంగా చర్చించింది. తప్పులకు రుజువులు చూపిస్తూ సరిచేసిన వ్యాసం విలువైన సమాచారం ఇస్తుంది. పివి నరసింహారావు రాసిన ‘గొల్ల రామవ్వ’ కథను హరితకాంశాల నేపథ్యంలో విశ్లేషించారు. గురజాడ సాహిత్యం – పర్గీకరణలు రాయలును యుగకర్త అనడములోని సాహిత్య కులము బయటపెట్టారు. “వైతాళికులు” సంకలనం వివాదంలో విస్మరణకు గురైన కవితా సంకలనం “కల్పన”ను పాఠకులకు పరిచయం చేశారు. పరిశోధకులకు ఈ దీపిక నిజంగానే కరదీపిక.