ట్రిపుల్ రైడింగ్ కు పోలీసుల బ్రేకులు
- ఒంగో్లులో స్పెషల్ డ్రైవ్
- 44 వాహనాల సీజ్
నిబంధనలకు విరుద్ధంగా టువీలర్లపై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ తాము ప్రమాదంలో పడేది కాకుండా ప్రజలను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్న వాహన చోదకులకు ప్రకాశం పోలీసులు బ్రేకులు వేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేఃశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ట్రిపుల్ రైడింగ్ చేసే ద్విచక్ర వాహనాల పై “స్పెషల్ డ్రైవ్” నిర్వహించారు. ఒంగోలు ట్రాఫిక్ డిఎస్పీ పి.మల్లికార్జున రావు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ట్రాఫిక్ మొబైల్స్ సిబ్బంది అందరూ కలిసి ఒంగోలు నగరంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నగరంలో ట్రిపుల్ రైడ్ చేస్తున్న 44 వాహనాలను సీజ్ చేశారు. వారి లైసెన్సులను తనిఖీ చేయటమే కాకుండా ట్రిపుల్ రైడింగ్ వల్ల వచ్చే నష్టాలపై కౌన్సెలింగ్ నిర్వహించారు. వాహనాలను నడుపుతున్న విద్యార్ధుల తల్లితండ్రులను పిలిపించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు క్లాస్ తీసుకున్నారు. పిల్లలకు వాహనాలు నడిపే స్వేచ్ఛ ఇచ్చినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కౌన్సిలింగ్ లో డిఎస్పీ గారి తో పాటు ట్రాఫిక్ ఎస్ఐ యు.సుబ్బారావు, ఆర్ఎస్ఐలు ఖాశిం, రవి కుమార్ గారు, ఎఎస్ఐ తదితర సిబ్బంది పాల్గొన్నారు.