వైద్య ఆరోగ్యశాఖలో పేరుకుపోయిన ఫైళ్ళు
- మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్
- సిబ్బందిని నిలదీసిన మంత్రి
- 40 శాతం పైళ్ల పరిష్కారంపై అసంతృప్తి
- రెండురోజులకు మించి ఏ ఫైలు ఆగకూడదు
- వైద్యులు, ఇతర సిబ్బంది గైర్హాజరీ కట్టడికి కఠిన నిబంధనలు
వైద్య ఆరోగ్య శాఖలో భారీస్థాయిలో వచ్చే దస్త్రాల సత్వర పరిష్కారానికి, దీర్ఘకాలం విధులకు దూరంగా ఉండడాన్ని అడ్డుకోవడానికి కఠిన చర్యలతో కూడా నూతన పంథాకు శ్రీకారం చుట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్టమైన ఆదేశాలను జారీచేశారు. వారసత్వంగా వచ్చిన ఈ అంశాలపై సోమవారంనాడు మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సంబంధిత అన్ని విభాగాధిపతులు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి మూడు గంటలకు పైగా సుదీర్ఘంగా సమీక్షించారు.
పరిశీలనకు పంపిన దస్త్రాలు-పరిష్కారాల తీరు
2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, సాధారణ పౌరుల నుoచి తమ దృష్టికి వచ్చిన 4,410 అంశాలను పరిశీలన, పరిష్కారం కోసం మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు పంపారు. ఇందులో ఎక్కువ భాగం బదిలీలకు సంబంధించినవి ఉన్నాయి.
వీటన్నింటిలో కలిపి ఇప్పటివరకు 40% దస్త్రాలను మాత్రమే పరిష్కరించినట్లు సమీక్షలో మంత్రి దృష్టికి వచ్చింది.
‘ఏ స్థాయిలోనూ రెండురోజులకు మించి దస్త్రం ఆగరాదు.!
ప్రభుత్వ యంత్రాంగంలో పలు దశల్లో దస్త్రాల పరిశీలన జరుగుతోందని, కనుక ఏ స్థాయిలోనూ రెండురోజులకు మించి ఫైలు ఆగకూడదని, ఈ రీతిన ఏ విషయమైనా 15 రోజుల్లో పరిశీలించి నిర్ణయం తీసుకునే విధంగా మార్పు తేవాలని మంత్రి స్పష్టంచేశారు. దీనికి భిన్నంగా ఆలస్యానికి కారణమయ్యేవారి నుంచి తగు వివరణ తీసుకుని, అవసరమైతే అటువంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
పటిష్టమైన పర్యవేక్షణ యంత్రాంగం
దస్త్రాల పరిశీలనలో జాప్యాన్ని నివారించే దిశగా మంత్రిత్వ శాఖలోని 19 విభాగాల్లో వివిధ దస్త్రాల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు పటిష్టమైన డ్యాష్‌బోర్డును రూపొందించాలని సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. ఈ డ్యాష్‌బోర్డు ద్వారా ప్రతి ఫైలు ఎవరి దగ్గర ఏ దశలో పరిశీలనలో ఉంది? నిర్ణీత కాల వ్యవధి మేరకు కదులుతుందా? లేదా? అని గమనించవచ్చునని, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ మంత్రికి వివరించారు. వీలైనంత త్వరలో ఈ పర్యవేక్షణ వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని మంత్రి ఆదేశాలు జారీచేశారు.
వైద్యులు, ఇతర సిబ్బంది గైర్హాజరీకి కళ్లెం
గత ప్రభుత్వ హయాంలో భారీఎత్తున వైద్యులు, ఇతర సిబ్బంది సంవత్సరాలపాటు అధికారికంగా విధులకు దూరంగా ఉన్న వందలాది కేసులు గత రెండేళ్ల కాలంలో తమ దృష్టికి రావడంపై మంత్రి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ వారసత్వం కొనసాగేందుకు ఏ మాత్రం వీల్లేదని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మంత్రి ఆరాకు స్పందిస్తూ దాదాపు వంద మంది వైద్యులను దీర్ఘకాలం గైర్హాజరీ కారణంగా విధుల నుంచి శాశ్వతంగా తప్పించడంతోపాటు, భారీస్థాయిలో ఇతర క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగిందని, ఇంకా 493 మంది వైద్యులు అనధికారికంగా విధులకు దూరంగా ఉంటున్నారని అధికారులు వివరించారు. వీరందరిపై గరిష్ఠంగా మూడునెలల్లోగా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు స్పష్టంచేశారు.
ప్రైవేటు వైద్యులు జారీచేసే మెడికల్ సర్టిఫికెట్లు ఇకపై చెల్లవు
దీర్ఘకాలం విధులకు దూరంగా ఉంటున్న వైద్యులు ప్రైవేటు వైద్యుల ద్వారా మెడికల్ సర్టిఫికెట్లు పొంది, వాటి ఆధారంగా తమ గైర్హాజరీని సమర్థించుకునేందుకు అడ్డుకట్ట వేయాలని, అందుకోసం ప్రైవేటు వైద్యుల సర్టిఫికెట్లు, సిఫార్సులను ఆమోదించరాదని మంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అనారోగ్యం, అవసరమైన సెలవు దినాలకు సంబంధించి ప్రభుత్వ వైద్యుల నుంచే ధ్రువీకరణ సర్టిఫికెట్లను పొందాలని, తీవ్ర అనారోగ్య కేసులను మెడికల్ బోర్డుల ద్వారా పరీక్ష జరిపి నిర్ధారించుకోవాలని మంత్రి ఆదేశాలిచ్చారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్తోపాటు జామంటు కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ, ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ డైరెక్టర్ జనరల్ అరుణ్‌బాబు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు సీఈఓ పద్మావతి డీఎంఈ విష్ణువరన్ పాల్గొన్నారు.

