సింహాచలంలో వైభవంగా శరన్నవరాత్రులు ప్రారంభం

బాల త్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ అలంకరణ.

తొలి పూజలు నిర్వహించిన గంట్ల దంపతులు

సింహాచలంలో శ్రీ గణేష్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఆయిల్ మిల్లు వద్ద ఆదివారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు దుర్గాదేవి అమ్మవారిని సర్వాభరణాలతో బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు చిలకమర్తి శివరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో శ్రీ గణేష్ యువజన సేవా సంఘం అధ్యక్షుడు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు దంపతులు తొలి పూజలు నిర్వహించారు. అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించడంతో పాటు భక్తులతో అష్టోత్తర శతనామావళి పఠనం చేయించారు.

ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ.. ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలు ముగిసిన అనంతరం దుర్గాదేవి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. లోకమంతా సుభిక్షంగా ఉండాలని, సింహాచలం గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాలను ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అందరి సహకారంతోనే ఆయా ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ యువజన సేవా సంఘం సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *