2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం

• ఫేజ్–2కు రూ.42,500 కోట్ల సహాయం కోరాం.
• పోలవరంతో జలరవాణాకు మార్గం సుగమం.
• గోదావరి–కావేరి అనుసంధానంతో ఐదు రాష్ట్రాలకు ప్రయోజనం.
-జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.

పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్, ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత గడువులో పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని కేంద్ర ప్రభుత్వం అభినందించిందన్నారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి జలశక్తి సిఆర్.పాటిల్ తో సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమావేశం వివరాలను మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు వివరించారు.

పోలవరం పనుల్లో గణనీయమైన పురోగతి

గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకంగా మార్చడంతో పాటు డయాఫ్రమ్ వాల్‌ను విధ్వంశం చేసిందని మంత్రి నిమ్మల విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని 2027 నాటికి పూర్తి చేయాలనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనులను వేగవంతం చేసిందన్నారు. ప్రస్తుతం పోలవరం సివిల్ పనులు 88 శాతం, భూసేకరణ, ఆర్అండ్ఆర్ పనులు ఆర్థికంగా 64 శాతం, మొత్తంగా ప్రాజెక్టు భౌతిక పురోగతి 83 శాతం, ఆర్థిక పురోగతి 78 శాతంకు చేరిందని మంత్రి నిమ్మల తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి జలశక్తి మంత్రి పాటిల్‌కు, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

ఫేజ్–2కు రూ.42,500 కోట్ల సహాయం కోరాం.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2019కు ముందు ఫేజ్–1, ఫేజ్–2 అనే విభజన లేదని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2019 ఫిబ్రవరిలోనే టిడిపి ప్రభుత్వం ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.55,548.87 కోట్లకు RCE ఆమోదం పొందిందన్నారు. ప్రస్తుతం 41.15 మీటర్ల కాంటూర్ వరకు ఫేజ్–1లో నీటిని నిల్వ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు, 45.72 మీటర్ల కాంటూర్ వరకు ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉందన్నారు. మిగిలిన భూసేకరణ, పునరావాసం తదితర అవసరాల కోసం సుమారు రూ.42,500 కోట్ల వరకు అవసరమవుతుందని, ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని కోరినట్లు మంత్రి నిమ్మల తెలిపారు.

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్ పాటిల్ తో భేటీ అనంతరం జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు

పోలవరం చుట్టూ రోడ్ కనెక్టివిటీకి ప్రాధాన్యత.

పోలవరం పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా అభివృద్ధి చెందనున్నందున, మెరుగైన రహదారి కనెక్టివిటీ అవసరమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతి–ఖరగ్‌పూర్ సిక్స్ లేన్ ఎకనామిక్ కారిడార్ పోలవరం దిగువ నుంచి వెళ్తున్నందున, దాన్ని పోలవరం స్పిల్‌వేకు సుమారు ఒక కిలోమీటర్ సమీపానికి తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. అదేవిధంగా NH-365BB కొవ్వూరు, NH-516E రాజమండ్రి, NH-16 రాజానగరం మీదుగా చెన్నై–కోల్‌కతా మార్గాలతో పోలవరానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

పర్యాటక ఆకర్షణ గా పోలవరం స్పిల్‌

పోలవరం స్పిల్‌వే సుమారు 1,118 మీటర్ల పొడవు, 48 రేడియల్ గేట్లు, సుమారు 50 లక్షల క్యూసెక్కుల వరదను విడుదల చేయగల సామర్థ్యం కలిగి ఉన్నందున, గోదావరి చరిత్రను ప్రతిబింబించేలా స్పిల్‌వేను అభివృద్ధి చేయాలని కోరినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. స్పిల్‌వే వద్ద వ్యూ గ్యాలరీలు, లైటింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసి పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించినట్లు చెప్పారు.

పోలవరం పరిధిలోని సుమారు 9,900 ఎకరాలను సమగ్ర టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గోదావరి కొండలు, ప్రకృతి సౌందర్యం, 194 టీఎంసీల భారీ రిజర్వాయర్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు.

ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసి సన్మానిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

జలరవాణాకు మరింత ప్రాధాన్యత

భద్రాచలం నుంచి రాజమండ్రి, కాకినాడ వరకు జాతీయ జలమార్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2009లో క్లాస్–3గా నోటిఫై చేసిన ఈ జలమార్గాన్ని కొనసాగిస్తూ విస్తరించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *