ఒంగోలులో త్రిముఖ పోటీ
రంగంలోకి ఈదర హరిబాబు
ఆయన పోటీ ప్రభావం ఎంత..
వైఎస్ఆర్సీపీ, కూటమిలో విస్తృతంగా చర్చ
ఎవరూ ఊహించని విధంగా మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు ఈదర హరిబాబు ఒంగోలు మేయర్ ఎన్నికల రంగంలోకి అడుగుపెట్టాడు. ఈ మేరకు ఎలాంటి హడావిడి లేకుండా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎన్నికల బరిలో నిలబడటంతో ఒంగోలు మేయర్ స్థానం కోసం త్రిముఖ పోటీ ఏర్పడ్డ వాతావరణం ఏర్పడింది. కూటమి నిర్ణయించిన మేయర్ అభ్యర్ధిత్వంపై రగిలిపోతున్న ఒక బలమైన సామాజికవర్గం ఎన్నికల్లో ఆయనకు అన్ని విధాలుగా అండదండలుగా ఉండేందుకు నిర్ణయించినట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యేగా, మాజీ జడ్ పి చైర్మన్ గా, సీనియర్ నాయకుడిగా ఈదర హరిబాబుకు గుర్తింపు ఉంది. ఒంగోలులోని అన్ని సామాజికవర్గాల్లో ఆయన అనుచరులు, అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో హరిబాబు ఎన్నికల బరిలో నిలవటంతో మేయర్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగుతున్న హరిబాబు ప్రభావం మేయర్ ఎన్నికల్లో ఏ మేరకు ఉంటుందన్న అంశంపై రాజకీయవర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. మరో వైపు ఆయనను ఎన్నికల బరి నుంచి తప్పించుకునేందుకు ఒక ప్రధాన రాజకీయ పక్షం మంతనాలు సాగిస్తున్నట్టు తెలిసింది.

