Literature

“ఊరు-వాడ” : వ్యంగ్యాన్ని కప్పుకున్న విషాధ బీభత్సం

కన్నడ “ఊరు-వాడ” ఆత్మకథనంపై 

ప్రముఖ రచయిత మల్లవరపు ప్రభాకరావు సమీక్ష 

దళితుని కోపంతో
లోకం భగ్నమౌతుందన్నమాట
సంశయమే
కాని ఇక్కడ అతడు
పగలబడి నవ్విన
రీతికి లోకం బెదిరి
జాలి పడుతుందన్నమాట మాత్రం నిజం
…. డి.ఆర్.నాగరాజ్

మల్లవరపు ప్రభాకరరావు ప్రముఖ రచయిత

ఈ వాక్యాలు ప్రఖ్యాత కన్నడ దళిత కవి, రచయిత, పోరాట యోధుడు డా.సిద్ధలింగయ్య ఆత్మకధనం “ఊరు-వాడ” గ్రంధానికి డి.ఆర్.నాగరాజ్ రాసిన వెనుక మాటల్లోనివి.

నిజమే! దళిత ఆత్మకథల్లో కనిపించే వేదన, భీభత్సం, దారిద్ర్యం, అవమానం, వివక్ష, అణిచివేత లాంటి అంశాలను డా.సిద్ధలింగయ్య నమోదు చేస్తూనే వాటిని ఎదుర్కొనే ఒక నిర్భయత్వాన్ని చాటుతాడు. వీటన్నింటినీ కొంత వ్యగ్యంగా చెప్తూ వాటిని ఎదుర్కొనే ఒక మార్గాన్ని చూపుతాడు.

ఈ ఆత్మకథ ఊరు-కేరి అనే పేరుతో కన్నడంలో వెలువడింది. ఊరు అంటే అగ్రవర్ణాలైన బ్రాహ్మణులు, భూస్వాములు, ఇతర సేవా వృత్తులు కులాలైన చాకలి, మంగలి మొదలగు వారుండే ప్రాంతం. ఇక కేరి అంటే ఊరి నుంచి దూరంగా విడిపోయినట్లుగా ఉండే దళితులు నివసించే ప్రాంతం. ఇది మొదట కన్నడంలో 1996 లో ప్రచురితమైంది. ఈ ఆత్మకథ కన్నడంలో 15 సార్లకు పైగా పునర్ముద్రణ జరిగింది. ఊరు-వాడ అత్మకథనం హిందీ, తమిళ్, తెలుగు భాషలలోకి అనువదితమైంది. దీని ఇంగ్లీష్ అనువాదం తరువాతి భాగంతో కలిపి “A word with you world: The autobiography of a Poet” పేరుతో ఎస్.ఆర్.రామకృష్ణ అనువదించారు. దీనిని దివాకర్ల రాజేశ్వరి తెలుగులోకి అనువదించారు.

ఈ ఆత్మకథలో ప్రారంభ విషయం “అయ్ గోరి పొలం” లోని ఒక పేరా…
“…. ఎప్పటిలాగానే పిల్లలందరూ మా ఇంటి పక్కనున్న మొండిగోడల మీద నుంచుని అప్పను అమ్మను పిలుస్తున్నప్పుడు మాకొక దృశ్యం కనపడింది. దొరగారి పొలంలో ఇద్దరు మనుష్యుల భుజాల మీద కాడిని మోపి ఇంకో ఇద్దరు పొలాన్ని దున్నుతున్నారు. కాడినెత్తిన వాళ్లిద్దరు ఎద్దుల్లా ముందుకు నడుస్తూ ఉంటే, వాళ్ళ వెనుకనున్న ఇద్దరు చర్ణాకోలును తిప్పుతూ సాగుబడిని చేసే దృశ్యాన్ని సరదాగా చూసినా, కాడినెత్తుకున్న ఇద్దరిలో ఒక్కడు మా నాన్న అని తెలిసిన క్షణం నాలో ఒక విచిత్రమైన బాధ మొదలైంది. పిల్లలమైన మేం ఉన్న చోటికి వచ్చిన ఆడాళ్లు కొందరు ‘పాపం దేవన్నకి ఎంత కష్టం వచ్చింది’ అనడం నాకు వినిపించి నా మనస్సులో బాధ రెట్టింపైంది. పొలంలో ఎద్దులా పనిచేసిన అప్ప ఇంటికి వచ్చాక అమ్మ అప్ప భుజాలకు నూనెను వెచ్చబెట్టి రాస్తుండేది.”

ఇంకా ఒక చోట “… మా ఇంటి ముందు ఒక పెద్ద మోరీ ఉండేది. మాకు ఆ మోరీయే పవిత్రమైన గంగ. వానాకాలంలో అది నిండి ప్రవహించేది. అప్పుడు మోరీలో నీళ్లు పారడాన్ని చూడడమే మోజుగా ఉండేది. అందులో నానారకాల వస్తువులు తేలి వస్తుండేవి. రంగుల కాగితాలు, బట్టలు, పాత ఉయ్యాలలు, బుట్టలు, కొబ్బరి మట్టలు, చేపలు, పాములు వస్తూ ఉండేవి. ఒకసారి శవం కూడా తేలిరావడం జరిగింది. అది నిండి పారుతూ ఉంటే నిల్చుని చూసే వాళ్ళం. మిగతా అప్పుడు అది బురద నిండిన పెద్ద కాలువలా ఉండేది. దాంట్లోంచి చెడ్డ వాసన వస్తున్నా మోరీ మీద గల మమత మాకు తగ్గేదికాదు. మోరీకి అవతల ఉన్న కార్ఖానా వాళ్ళు నల్లమన్ను తెచ్చి రాసులురాసులు పోసేవారు. ఆ మట్టిలో చిన్న చిన్న తామ్రం, ఇత్తడి ముక్కలు దొరికేవి. అందుకోసం మేము మోరీలోకి దిగి నల్లమట్టిని కెలికి తామ్రం, ఇత్తడి ముక్కలు సేకరించేవాళ్ళం. అలా సేకరించిన వాటిని అప్పుడప్పుడు వచ్చే పాకం పప్పు బిళ్ళల వాడికిచ్చి వాటిని తీసుకుని తినేవాళ్ళం. ఆ మోరీ మా పాలిట బెల్లం పాకం పప్పు బిళ్లల నిచ్చే అమృతనిధిగా కనిపించేది.

ఆ మోరీలో ఇంకా అమూల్యమైన వస్తువులు దొరకవచ్చుననే ఊహ మాకుండేది. అందువల్ల మోరీలోకి దిగి లోపలికి చాలా దూరం వెళ్ళేవాళ్ళం. అది లోతుగా ఉన్న కాలువ కావడం వల్ల ఆ ప్రయాణం సొరంగంలోంచి వెళ్లినట్లుగా ఉండేది. అలాగే ముందుకు వెళ్లి తూర్పుకు తిరిగి మెజెస్టిక్ లో పైకితేలి వచ్చేవాళ్ళం. సినిమా చూడాలన్న కోరిక ఉన్నా డబ్బులేకపోవడం వల్ల టాకీసు చుట్టూ ఒకసారి తిరిగి ఆ కట్టడాన్నే కుతూహలంగా చూసేవాళ్ళం.” (దుడుకు చేష్టల రోజులు)

“శ్రీరామపురం దళిత విద్యార్థుల వసతి గృహంలో మా అమ్మ చెత్తను ఊడిచే పనికి చేరింది. ఆ వసతి విద్యార్ధి నిలయం పేరు “ఆర్.గోపాలస్వామి అయ్యర్ విద్యార్థి నిలయం”. డి.వెంకట రామయ్య అనే ఆయన దాని పర్యవేక్షకుడు.అక్కడ విద్యార్థులకు భోజనం పెట్టేవాడు. తరువాత అక్కడ పనిచేసే వాళ్లకు కూడా భోజనం పెట్టేవారు. ఇచ్చే ముద్దను, చారును మా అమ్మ మధ్యాహ్నం, రాత్రి ఇంటికి తెచ్చేది. దానివల్ల మా భోజనసమస్య నివారణ అయింది. మధ్యాహ్నం 11 గంటలకు ఇంటికి అన్నం తెచ్చిన వెంటనే నేను తిని బడికి వెళ్ళేవాడిని. మా అమ్మ పనిచేస్తున్న హాస్టల్ వెనక్కాల నేను చదివే మాధ్యమిక పాఠశాల ఉండేది. ఆ రోజు హాస్టల్ నుంచి భోజనం తేవడానికి మా చెల్లెలు వెళ్ళింది. ఎందుకనో భోజనం తేవడం ఆలస్యం అయ్యింది. బడికి వెళ్లే సమయం అయింది. నేను పుస్తకాల సంచిని తగిలించుకుని బడికి బయలు దేరాను. సగం దారిలో ఎదురుగా మా చెల్లెలు భోజనం తీసుకుని ఇంటికి వస్తోంది. ఏదో ఒక షాప్ లో ఉప్పును తీసుకుని మధ్యాహ్నం తినవచ్చునని నేను మా చెల్లెలు దగ్గర నుంచి ఒక రాగి ముద్దను తీసుకుని బ్యాగు లో వేసుకుని బడికి వెళ్ళాను. మష్యాహ్నం భోజన విరామానికి వదులుతారని ఎదురు చూస్తున్నాను . ఆ పీరియడ్ తర్వాత, విరామము అప్పుడు ఒక పిల్లాడు ఒక వైపు నుంచి అందరి సంచులను పరీక్షిస్తున్నాడు. సంచీలోకి చేయిపెట్టి పుస్తకాలను, నోటు పుస్తకాలను బయటపెట్టి, మళ్ళీ లోపల పెట్టడం వాడు పరీక్ష చేస్తున్న పధ్ధతి. వాడు పెన్సిల్ పోయిందని మేడం దగ్గర అనుమతిని తీసుకుని అందరి సంచులను పరీక్షిస్తున్నాడు. ఆ పెన్సిల్ కోసం తనిఖీ చేస్తున్నవాడు నా సంచీలో ముద్దను బయటకు తీసి అందరి ముందు పెడతాడేమోనని అనుమానం వేసింది. భయం కలిగింది. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను తనిఖీకి అవకాశం ఇవ్వలేదు. అందువల్ల వాడు నేనే దొంగనని తీర్మానించి మేడం తో చెప్పాడు. మేడం నా దగ్గరకు వచ్చి బ్యాగ్ తీయమని ఒత్తిడి చేసింది. పిల్లలందరూ ఎంతో కుతూహలంతో చూడసాగారు. వాళ్లకు పెన్సిల్ సమస్య. నాకు ముద్ద కనిపిస్తుందని భయం. వాళ్ళు బలవంతంగా నా బ్యాగులో ఉన్న వస్తువులను బయటకు తీసారు. పెన్సిల్ దొరకలేదు. వాళ్లకు రాగి ముద్ద దొరికింది. మేడం కు ఆశ్చర్యం కలిగింది. మిగతా పిల్లలకు కుతూహలం కలిగింది. ఇది తమాషా విషయంగా అనిపించింది. విరామము దొరికిన వెంటనే అందరూ ఏకకంఠంతో ‘ముద్దరా..ముద్ద’ అంటూ అరుస్తూ బయటకు వచ్చారు.” (ముద్దరా… ముద్ద)

ఇలా ఈ ఆత్మ కథనం లో సంఘటనలకు వ్యాఖ్యానాలు ఉండవు. ఇంత సరళంగా దుఃఖం ప్రవహించినా ఈ పుస్తకములో పేర్కొన్న జీవితం తనదైన ఆనందాన్ని, అందులోనించి కలిగిన విజయాన్ని నమోదుచేసే ఒక కొత్తకధనాన్ని దళిత సాహిత్యానికి అందించింది.

డా.సిద్దలింగయ్య ‘ఊరు-వాడ’ ఆత్మకథను 1997, 2006, 2014 లలో మూడు భాగాలుగా రచించారు. ఇప్పుడు పరిచయం చేస్తున్న ఈ మొదటి భాగాన్ని కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురించింది. ఈ మొదటి భాగాన్ని మొత్తం 5 భాగాలుగా వర్గీకరించి రాశారు.

ఈ పుస్తకంలో మొదటి భాగంలో సిద్ధలింగయ్య తన బాల్యాన్ని, గ్రామ దేవతలని, బంధువులు, బడి అనుభవాల్ని హాస్యంగా అనిపించేలా రాసారు.

ఇక రెండవ భాగంలో బంధువులు, బెంగళూరుకు వలస, అక్కడి జీవితం, చదువు కొనసాగడం, వీళ్ళుండే మురికివాడ అనుభవాలు కనిపిస్తాయి.ఇక ఆ తర్వాతి భాగాలలో చదువు, హాస్టల్ జీవితం, కవిత్వం రాసుకోడం, అంబెడ్కర్ ని చదవడం, కర్ణాటక లోని ప్రముఖుల పరిచయాలు, ఉపన్యాసాలు ఇలా అన్నీ వివరిస్తారు. అనేక సందర్భాలలో మనకు ఆయా పరిస్థితులు నవ్వు పుట్టించినప్పటికీ ఈ సంఘటనల్ని వివరించే క్రమంలో పాఠకుడు సిద్ధలింగయ్య, అతని కులం అనుభవించిన దైన్యాన్ని, అణిచివేతను గుర్తిస్తూనే దళితుల పోరాట పటిమను గుర్తెరిగే ఒక స్ఫూర్తిని పొందుతారు. అననుకూల పరిస్థితుల మధ్య దళితులు తమ జీవితాన్ని నిర్మించుకోవడానికి కావాల్సిన శక్తి, నిబద్ధతలను ఈ పుస్తకం గుర్తు చేస్తుంది.

ఈ పుస్తకంలో హాస్టల్ బ్రతుకు అదెంత చేదైనా దళితులకు అది ఒక ఆశారేఖే అని చెబ్తుంది. ఏమీ లేని చోట అది ఒక వెలుగు దివ్వే. నిజమే! చాలీచాలని భోజనం, పోషకాహారలోపంతో కూడిన ఆహారమే. కానీ అది మనకు మన బ్రతుకును సరిచేసేందుకు ఒక కసిని, పట్టుదలను అందించే ఒక స్థావరం అని నాకు అనిపిస్తుంది. నేను చదివేప్పుడు అనేక సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులను రోడ్లమీదికి జెండాలు మోయించి ఉద్యమాలు అంటూ వారి విలువైన విద్యాసమయాన్ని హరించి వేసే క్రమాన్ని చూసాను. తర్వాతర్వాత వాళ్ళందరూ శ్లేష్మంలో పడ్డ ఈగల్లా ఆయా సంస్థల్లో పారితోషకాలతో బ్రతకాల్సిన పరిస్థితి. అలా కాకుండా ఆ ప్రతికూల పరిస్థితుల్లో విజయాన్ని సాధించడాన్ని ఈ పుస్తకం చెబుతుంది.

డా.సిద్దలింగయ్య గారి కవిత్వంలో కనిపించే తీవ్రత, విప్లవ భావాలకి భిన్నమైన శైలిని ఈ ఆత్మకథ లో గమనిస్తాము. ఇది ఉద్దేశ్యపూర్వకంగా వారు ఎన్నుకున్న ప్రత్యేక శైలిగా మనం భావించవచ్చు. ఒకరకంగా ఈ ఆత్మకథ వ్యంగ్యాన్ని కప్పుకున్న విషాద భీభత్సం గా అనిపిస్తుంది. ఈ ఆత్మకథ కు డి.ఆర్ .నాగరాజ్ రాసిన ముగింపు మాటను సమర్ధిస్తుంది. ఈ ఆత్మకథ కన్నడ సాంఘిక, సాహిత్య, రాజకీయ చరిత్రను స్పృశిస్తుంది.

డా.సిద్ధలింగయ్య ప్రముఖ కన్నడ కవి, నాటక కర్త, ఉద్యమకారుడు. విశ్వవిద్యాలయ ఆచార్యులుగా పని చేశారు. కన్నడ దళిత బందయ సాహిత్యోద్యమ స్థాపకుడు. కన్నడంలో మొదటి దళిత రచయితగా చెప్తారు. కన్నడ దళిత ఉద్యమానికి వీరిని ప్రతీకగా భావిస్తారు. దళిత సంఘర్ష్ వ్యవస్థాపకులలో ఒకరు. కన్నడ దళిత ఉద్యమాలలో, పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. కవిత్వం, నాటకాలు, విమర్శ, ఆత్మకథను రచించారు. వీరి మొదటి కవితాసంకలనం ‘హోలే మాదిగర హోడు’ (మాల మాదిగల పాట) ప్రచురించిన వారం రోజులకే వెయ్యి ప్రతులు అమ్ముడుపోయి వీరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత ఇరవై ముద్రణలు పొందింది. ఇక వీరు రచించిన “ఎవరికి స్వాతంత్ర్యం? ఎక్కడ స్వాతంత్ర్యం 1947?” అనే కవిత కన్నడ దళిత ఉద్యమానికి పతాక గేయంగా మారింది. పంచమ, ఏకలవ్య నవలలు రచించారు. బెంగళూరు విశ్వవిద్యాలయంలో కన్నడ విభాగానికి చైర్మన్ గా వ్యవహరించారు. అంబేద్కర్ అధ్యయన మరియు పరిశోధన కేంద్రానికి డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు. కేవలం 34 ఏళ్లకే 1988 లో కర్ణాటక శాసనమండలి సభ్యులుగా నామిననేట్ అయ్యారు. శాసన మండలి సభ్యులుగా 2001 వరకు కొనసాగారు. 2006 లో కన్నడ డెవలప్మెంట్ అథారిటీ కి చైర్మన్ గా (కాబినెట్ మంత్రి ర్యాంకు) వ్యవహరించారు. సాహిత్య, సామాజిక రంగాలలో వీరు చేసిన కృషికి గాను అనేక పురస్కారాలు పొందారు. కర్ణాటక రాష్ట్ర అత్యున్నత సాహిత్య పురస్కారమైన పంప అవార్డ్ ని 2019లో ప్రదానం చేశారు. ఈ అవార్డ్ పొందిన మొదటి దళిత రచయత. ఇంతటి సాహిత్యకృషి చేసిన డా.సిద్ధలింగయ్య జూన్ 2021 లో కోవిడ్ తో మరణించడం కన్నడ సాహిత్యరంగానికి తీరని లోటు. వీరికి మరణాంతరము కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.

సమీక్ష రచయిత : మల్లవరపు ప్రభాకరరావు

 

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *