కొలకలూరి ఇనాక్ కు బెగోరె అవార్డు
నెల్లూరు : స్వచ్ఛమైన రాజకీయాలు, ఇష్టమైన సాహిత్యం ఆస్వాదించిన బెజవాడ గోపాలరెడ్డి నేటి తరానికి ఆదర్శప్రాయుడని పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నెల్లూరు దర్గామిట్ట లోని అవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ నందు బెజవాడ గోపాలరెడ్డి వర్ధంతి జరిగింది. ముందుగా గోపాల రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులార్పించారు. ఈసందర్భంగా కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు, సాహితీవేత్త, మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి విద్యార్థి దశలోనే గాంధీగారి ప్రభావంతో జాతీయ పాఠశాలలో చేరారు. అటు రాజకీయ నాయకుడిగా, ఇటు సాహితీవేత్తగా ప్రజల మన్ననలు పొందారని వివరించారు. కస్టమ్స్ &సెంట్రల్ జీఎస్టీ అసిస్టెంట్ కమీషనర్ డాక్టర్ సి.హెచ్.ఉషా కిరణ్ మాట్లాడుతూ సాహిత్యంపై మక్కువ కలిగిన బెజవాడ గోపాలరెడ్డి తెలుగు భాషా సమితికి 38 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమికి 5 సంవత్సరాలు, జ్ఞానపీట అవార్డుల కమిటీకి 8 సంవత్సరాలు అధ్యక్షునిగా వ్యవహరించారని తెలిపారు. కొలకలూరి ఇనాక్ కు బెజవాడ గోపాల్ రెడ్డి స్మారక పురస్కారం అందజేశారు. ఈకార్యక్రమంలో స్కూలు కరెస్పాండెంట్ పి.కృష్ణ చైతన్య, డీన్ కళా కృష్ణ స్వామి, ప్రిన్సిపాల్ ఎమ్. సుబ్బరాయుడు, వ్యాఖ్యత టి.వెంకటేశ్వర్లు, అసోసియేషన్ అధ్యక్షులు కె.మురళీమోహన్ రాజు, కవులు పెరుగు రామకృష్ణ, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.