సాహిత్య సంస్కార ప్రతినిధి’కడియాల’
సమకాలీన సాహిత్య విమర్శ ద్వారా హృదయ సంస్కారాన్ని పెంపొందించే సాహిత్య విమర్శకులకు ప్రతినిధి వంటివారు డాక్టర్ కడియాల రామ మోహన్ రాయ్ అని సాహితీవేత్త డాక్టర్ నూకతోటి రవికుమార్ పేర్కొన్నారు.ప్రముఖ సాహితీ విమర్శకులు డాక్టర్ కడియాల రామ మోహన్ రాయ్ స్మరణ సభ జానుడి- సెంటర్ ఫర్ లిటరేచర్అండ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో శనివారం ఒంగోలులోని డాక్టర్ మల్లవరపు రాజేశ్వరరావు భవన్లో నిర్వహించారు.
తొలుత రామ్మోహన్ రాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సభకు జానుడి సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ రాయ్ రచించిన తెలుగు కవితా వికాసం పుస్తకం అనేక తరాల సాహిత్యకారులను ప్రభావితం చేస్తుందని అన్నారు.తెలుగు సాహిత్యం పై శ్రీ శ్రీ ప్రభావం, శ్రీశ్రీతో ముఖా ముఖి, సహృదయ వ్యాస సంపుటి, తెలుగు పద్యం-సమగ్ర పరిశీలన, నూరు తెలుగు నవలలు- విశ్లేషణ, తెలుగు నాటక రంగ పరిణామం- సమాజంపై నాటకరంగ ప్రభావం, మన తెలుగు నవలలు’ వంటి ఎన్నో విలువైన పుస్తకాలు రచించి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సాహిత్య సంస్థల ప్రతినిధులు కవులు నబి కె ఖాన్, అధ్యాపకులు దారా మోహన్ రావు, రమణయ్య, కె.శేషగిరిరావు, మహేశ్వర చారి, వీరబ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.