ఏపీలో 88 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆమోదం
- ఎన్టీఆర్ జిల్లాకు రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
- ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశ్నకు కేంద్రం బదులు
ఢిల్లీ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలో మొత్తం 88 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పి.హెచ్.సి) లు ఏర్పాటు చేయనుండగా, ఎన్టీఆర్ జిల్లాలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆమోదం లభించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల గురించి అడిగిన పలు ప్రశ్నలకు శుక్రవారం కేంద్ర సహాయ మంత్రి బదులిచ్చారు. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHCs) 72 మంది స్టాఫ్ నర్సులకి ఆమోదం లభించగా ప్రస్తుతం అందుబాటులో 68 మంది స్టాఫ్ నర్సులను నియమించినట్లు తెలిపారు. డాక్టర్ల విషయానికి వస్తే 45 మంది డాక్టర్స్ కి ఆమోదం లభిస్తే ప్రస్తుతం అందుబాటులో 42 మంది డాక్టర్ల నియామకం జరిగిందన్నారు. జిల్లాలోని ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిపుణులైన వైద్యుల నియామకం జరగలేదని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (UPHCs) 97 మంది స్టాఫ్ నర్సులకి ఆమోదం లభించగా ప్రస్తుతం అందుబాటులో 86 మంది స్టాఫ్ నర్సులను నియమించినట్లు తెలిపారు. డాక్టర్ల విషయానికి వస్తే 49 మంది డాక్టర్స్ కి ఆమోదం లభిస్తే ప్రస్తుతం అందుబాటులో 48 మంది డాక్టర్లు నియామకం జరిగినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఈ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిపుణులైన వైద్యుల నియామకం జరగలేదన్నారు.