బాలినేని ఎక్కడ..!

  • ఎన్నికలకు దూరంగా హైదరబాద్ లోనే ఉంటారా..
  • ఒంగోలు మేయర్ కూటమి అభ్యర్ధికి మద్దతిస్తారా..
  • బాలినేని రాజకీయంగా ఉపయోగించుకోవటంలోజనసేన ఇంటెలిజెన్సీ ఘోర వైఫల్యం
  • నలుగురితో కలిసి అప్రాధాన్యత పోస్ట్ ఇచ్చి అవమానం

మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు) ఎక్కడ..ఒంగోలు మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధికి మద్దతిస్తారా..మౌనంగా అన్నీ గమనిస్తూ హైదరబాద్ లో ఉండిపోతారా..రాజకీయవర్గాల్లో దీనిపై జోరుగా చర్చ నడుస్తోంది. బాలినేని నమ్ముకుని వైసీపీ నుంచి ఆయన వెంట వచ్చిన అనుచరగణం ఎలాంటి వైఖరి అనుసరించాలనే విషయంపైనా అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. ‘స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మీ ఇష్టమైన లైన్ తీసుకోండి‘ అని బాలినేని ఇప్పటికే తన అనుచరులకు స్పష్టం చేసినట్టు ప్రచారం కొనసాగుతుంది. అయిదుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రి..అంతకు ముందు కాంగ్రెస్ లో, ఆ తరువాత వైసీపీలో తిరుగులేని నాయకుడిగా చక్రం తప్పిన బాలినేని పరిస్థితి ‘అధికారాంతమున చూడవలె అయ్యవారి సొబగు’ అన్న చందంగా మారింది. జనసేనలోనూ బాలినేని ప్రభంజనమే వీస్తుందని ఆయన అనుచరులు, అభిమానులు భావించారు. అలాంటి సంకేతాలు ప్రారంభంలో ఉన్నప్పటికీ ఆ తరువాత బాలినేనిని జనసేన ఒక్కో మెట్టూ తగ్గిస్తూ కిందకు దించింది. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని మధ్య నడిచిన వార్ పతాక స్థాయికి చేరింది. జనార్దన్, వాసుల మధ్య రాజకీయ రగడ కాస్తా వ్యక్తిగత స్థాయికి ఎగబాకింది. రెండు పార్టీల హైకమాండ్ మాటల యుద్దాన్ని ముగించాలని ఆదేశించాయి. తాత్కాలికంగా మాటల యుద్ద విరమణ జరిగినా కడుపులో కత్తులకు ఇద్దరూ పదును పెడుతూనే ఉన్నారు. ఈ దశలో జనసేన అధిష్టానం బాలినేని తీవ్రంగా అవమానించే నిర్ణయం తీసుకుంది. మరో ముగ్గురితో కలిసి ఆయనను ఒంగోలు పార్లమెంటు పర్యవేక్షుకుల జాబితాలో చేర్చింది. ఒక మాజీ మంత్రి, నిన్న మొన్నటి దాకా వైసీపీలో కీలక నాయకుడు, ప్రకాశం జిల్లా అంతటా తనకంటూ అనుచరగణం ఉన్న నాయకుడిని రాజకీయంగా ఉపయోగించుకోవటం చేతకాని జనసేన ఇంటెలిజెన్సీ వైఫల్యానికి ఇది నిదర్శమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో సవాలక్ష చాడీలను అటూ, ఇటూ మోసే బ్యాచ్ ఉంటారు. వాళ్లంతా ‘బాలినేని వైసీపీ కోవర్టు’గా పనిచేస్తున్నాడనీ, జగన్ అజెండాను కుట్రపూరితంగా ఒంగోలులో అమలు చేస్తున్నాడని మోశారు. వెంటనే బాలినేని ప్రాధాన్యతను తగ్గించారు. అసలు ఏ పదవీ ఇవ్వకపోయినా పర్వాలేదు..ఇలా అవమానిస్తారా అని బాలినేని అనుచరగణం మండిపోయింది. ఈ నేపథ్యంలోనే బాలినేని హైదరబాద్ కు పరిమితమయ్యారు. స్థానిక ఎన్నికలను బాలినేని పట్టించుకోనట్టేనని సమచారం.

జనార్దన్ వ్యూహాత్మక విజయం

బాలినేని-దామచర్లకు మధ్య నడిచిన పొలిటికల్ వార్ లో దామచర్ల వ్యూహాత్మకంగా విజయాన్ని సాధించారు. అంతేకాదు..ఒకప్పుడు బాలినేని సొంత మనిషిగా ముద్ర ఉన్న నల్లమల్లి బాలు ఆ తరువాత దూరమయ్యాడు. ఇపుడు అతని సతీమణి శ్రీశిల్పకు టికెట్ ఇప్పించారు. నల్లమల్లి శ్రీశిల్పకు టికెట్ రావటంలో ఇది కూడా ఒక ప్లస్ అయిందన్న అభిప్రాయం ఉంది. మరో వైపు టీడీపీ నేతలే కొందరు ఒకప్పుడు దామచర్ల జనార్దన్ ను తీవ్రంగా విమర్శించిన నల్లమల్లి బాలు వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే.. వాటన్నిటినీ ప్రజలు పట్టించుకోరు..పార్టీలు కూడా పట్టివంచుకోవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *