నీట్- యూజీ 2026 (NEET-UG 2026) కౌన్సెలింగ్‌కు షెడ్యూల్ ఖరారు
- ఆగస్టు 4 నుంచి తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం
- డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప కులపతి పులాల చంద్రశేఖర్

నీట్-యూజీ 2026 ప్రవేశాలకు సంబంధించి అఖిల భారత కోటా, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైందని డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప కులపతి పులాల చంద్రశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన తేదీలను గమనించి, నిర్దేశిత గడువులో అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
నీట్-యూజీ 2026లో తొలి విడత అఖిల భారత కోటా కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నారన్నారు. అఖిల భారత కోటాలో చేరిన అభ్యర్థుల వివరాల ధృవీకరణ ఆగస్టు 23న జరుగుతుందన్నారు. రాష్ట్ర కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 13 నుంచి 22వ తేదీ వరకు కొనసాగనుండగా, చేరిన అభ్యర్థుల వివరాల రాష్ట్రస్థాయి ధృవీకరణ ఆగస్టు 29న నిర్వహించనున్నారన్నారు.
తొలి విడత అఖిల భారత కోటా కౌన్సెలింగ్‌లో చేరేందుకు ఆగస్టు 22, 2026 చివరి తేదీ కాగా, రాష్ట్ర కౌన్సెలింగ్‌కు సంబంధించి చేరికకు ఆగస్టు 28, 2026 చివరి తేదీగా నిర్ణయించారన్నారు.
రెండో విడత కౌన్సెలింగ్ అఖిల భారత కోటాలో ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 2 వరకు, రాష్ట్ర కోటాలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహించనున్నారన్నారు. రెండో విడతలో చేరేందుకు అఖిల భారత కోటాలో సెప్టెంబర్ 8, రాష్ట్ర కోటాలో సెప్టెంబర్ 14 చివరి తేదీలుగా నిర్ణయించారన్నారు.
మూడో విడత కౌన్సెలింగ్ అఖిల భారత కోటాలో సెప్టెంబర్ 10 నుంచి 18 వరకు, రాష్ట్ర కోటాలో సెప్టెంబర్ 16 నుంచి 26 వరకు నిర్వహించనున్నారన్నారు.
మూడో విడతలో చేరేందుకు అఖిల భారత కోటాలో సెప్టెంబర్ 26, రాష్ట్ర కోటాలో అక్టోబర్ 1 చివరి తేదీలుగా ఉన్నాయన్నారు. స్ట్రే వేకెన్సీ రౌండ్ అఖిల భారత కోటాలో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు, రాష్ట్ర కోటాలో అక్టోబర్ 3 నుంచి 5 వరకు నిర్వహించనున్నారు. ఈ రౌండ్‌లో కేటాయించిన అభ్యర్థులు అక్టోబర్ 10, 2026లోపు చేరాల్సి ఉంటుంది. నీట్ – యూజీ 2026 (NEET-UG 2026) ద్వారా యూజీ కోర్సుల్లో విద్యా సంవత్సరం సెప్టెంబర్ 8, 2026 నుంచి ప్రారంభంకానుందన్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియకు సమయం పరిమితంగా ఉన్నందున, షెడ్యూల్‌ను సమర్థవంతంగా అమలు చేసేందుకు అన్ని శనివారాలు, ఆదివారాలు, గెజిటెడ్ సెలవు దినాలను కూడా పని దినాలుగా పరిగణించాలని అన్ని సంబంధిత వైద్య కళాశాలలు, సంస్థలకు సూచించినట్లు ఉప కులపతి పి. చంద్రశేఖర్ ఆ ప్రకటనలో తెలిపారు.
విద్యార్థులు కౌన్సెలింగ్‌కు సంబంధించిన ప్రతి దశలోనూ నిర్దేశిత తేదీలను తప్పనిసరిగా పాటించాలని, గడువు ముగిసిన తర్వాత అవకాశాలు పరిమితమయ్యే అవకాశం ఉన్నందున ముందుగానే అవసరమైన ధ్రువపత్రాలు, ఇతర వివరాలను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.
