కరువు విలయతాండవం.. ప్రభుత్వం ఏం చేస్తోంది..!

మాజీ మంత్రి, ఎస్ కెఎం రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాదీశ్వరావు ప్రశ్న
విజయవాడ: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో తాగు, సాగునీరు లేక రైతులు, గ్రామీణ, పట్టణవాసులు తాగునీరులేక విలవిల లాడుతుంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి పట్టదా అని మాజీ మంత్రి, ఎస్ కెఎం రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాదీశ్వరావు ప్రశ్నించారు. ఏపి రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగింది. సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో వడ్డే మాట్లాడుతూ.. ఏడాది క్రితమే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీరు నిల్వచేసుకొకపోవటం ప్రభుత్వ తప్పిదమేనని విమర్శించారు. రాష్ట్రంలో రైతాంగం ఈ దుస్థితికి కారణం ప్రభుత్వ విధానాలే కారణమని ధ్వజమెత్తారు. రిలయన్స్, గూగుల్ డేటా, సోలార్ కంపెనీలకు, అమరావతి రాజధానికి వేల ఏకరాలు రైతుల భూములను గుంజుకొవటంలో ఉన్న శ్రద్ధ, ప్రభుత్వానికి రైతులకు సాగునీరు అందిచటంలో శ్రద్ధలేదని విమర్శించారు. ఎలినినో ప్రభావంతో వర్షాలు లేక, పంటలు వేసుకునే ఆవకాశం లేక, వేసిన పంటలు ఎండిపోవటంతో , రైతాంగం తల్లఢిల్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులకు పనులు లేక, వలసలు తప్ప మార్గం లేదన్నారు. పశువులకు మేతలేక కబేళకు తరలిస్తున్నారని వాపోయారు. అనంతపురం, సత్యసాయి జిల్లాలో ఈ సంఘటనలు ప్రభుత్వానికి కనబడటంలేదా అని ప్రశ్నించారు. ముందస్తు కౌలు చెల్లించిన కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఏపి రైతు సంఘం రాష్ట్ర నాయకులు వై. కేశవరావు మాట్లాడుతూ 50% రాష్ట్రంలో కరువు ఏర్పడిందన్నారు. 650 మండలాల్లో కరువు విలయతాండవం చేస్తుందని, రైతాంగాన్ని యుద్ధప్రతిపదికన ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలినినో ప్రభావంతో నష్టపోయిన రైతాంగానికి, కౌలు రైతులకు, వ్యవసాయ కార్మికులకు, చేతివృత్తుల వారికి రుణాలు మాఫీ చేయాలని కోరారు. జీవనం సాగించటానికి అవసరమైన సహాయం అందించాలన్నారు.
అక్టోబర్ 5న విజయవాడలో రాష్ట్ర సదస్సు
కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య మాట్లాడుతూ అక్టోబర్ 5 న రాష్ట్ర సదస్సును విజయవాడలో వ్యవసాయంలో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్వహిస్తున్నామన్నారు. నవంబర్ 26 కార్యక్రమం విజయవాడలో ఒకటి, రాయలసీమలో రెండు, ఉత్తరాంధ్రలో మూడు చోట్ల జరుపతలపెట్టామన్నారు. నవంబర్ 26 నుండి జరిగే ఆందోళన కార్యక్రమానికి అక్టోబర్ 5 నుంచి వాలంటీర్లను రిక్రూట్ చేసుకొవాలన్నారు. వ్యవసాయ అనుబంధ సంఘాలన్ని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి, ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ మాట్లాడుతూ వ్యవసాయంలో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను రైతు సంఘాలు, దేశ ప్రజలందరు వ్యవతిరేకించాలన్నారు. జాతీ ప్రయోజనాలకు భిన్నమైన స్వేచ్ఛ ఒప్పందాలను మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం నిర్వహిస్తుందని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి. రమాదేవి మాట్లాడుతూ ప్రాజెక్ట్ ల నిర్మాణం పేరుతో గ్రామాలను సైతం ఖాళీ చేయుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూ సేకరణ పేరుతో రైతులను, భూమిని నమ్ముకుని బతికే వారిని, వాళ్లకింద భూమిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాగేస్తున్నాయన్నారు. భూనిర్వసితులను ప్రభుత్వాలు ఆదుకోవటం లేదన్నారు. పోలవరం, పూల సుబ్బయ్య సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడు యలమందరావు, ఏపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు యం. కృష్ణయ్య, కార్యదర్శి ప్రభార్ రెడ్డి, ఏఐకెయంయస్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మికం రాషకార్యదర్శి వెంకటేశ్వర్లు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు జోన్న నాగేశ్వరావు, పి. ఆంజనేయులు, అభ్యుదయ రైతు సంఘం రాష్ట్ర నాయకులు షేక్ గౌస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు కొలనుకొండ శివాజీ, రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు యు. వీరబాబు, ఏఐకెయంయస్ రాష్ట్ర కార్యదర్శి గనీరాజు, కిసాన్ సంఘటన్ రాష్ట్ర కన్వీనర్ మరీదు ప్రసాద్ బాబు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
