విశాఖే రాజధాని
త్వరలో సమగ్ర బిల్లు తీసుకొస్తాం
మరోసారి స్పష్టం చేసిన మంత్రి బొత్స
మూడు రాజధానుల ఏర్పాటు అనేది తమ ప్రభుత్వ విధానమని దీనిప్రకారం విశాఖలో కార్యనిర్వాహక రాజధాని వచ్చి తీరుతుందని మంత్రి స్పష్టంచేశారు. విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్నది తమ ప్రభుత్వ విధానమని మంత్రి స్పష్టంచేశారు. అయితే గతంలో ఆమోదించిన రాజధాని చట్టంలో సాంకేతిక సమస్యలు వున్నందున వాటిని సరిచేసి మరో సమగ్రమైన బిల్లును తీసుకువస్తామని ముఖ్యమంత్రి ఇదివరకే అసెంబ్లీలో ప్రకటించారని ఆ ప్రకారమే మరో బిల్లు తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని కేంద్ర మంత్రి పార్లమెంటులో ఇచ్చిన సమాధానంలో స్పష్టంగా పేర్కొన్నారని మంత్రి చెప్పారు. రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి మన్ మోహన్ సింగ్ ప్రకటించిన విధంగా మన రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని తమ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే వుంటుందని, వివిధ వేదికల్లో దీనిపై ప్రశ్నిస్తున్నామని మంత్రి చెప్పారు.