నేడు నర్సరీ గ్రోయర్స్ అసోసియేషన్ ఆవిర్భావ సభ
రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటుచేసిన నర్సరీ గ్రోయర్స్ అసోసియేషన్ ఆవిర్బావ సభను విజయవాడ గంగూరులోని నందనవనం నర్సరీ ఆవరణలో శుక్రవారం నిర్వహించనున్నారు. జర్నలిజంలో కెరీర్ ప్రారంభించి సేంద్రీయ వ్యవసాయ రంగం వైపు అడుగులు సారించిన ఆకుల చలపతిరావుతోపాటు ఆలోచనా సామీప్యం ఉన్న మరికొందరు కలిసి నర్సరీ గ్రోయర్స్ అసోసియేషన్ నెలకొల్పారు. రాష్ట్రంలో సుమారు 8 వేల నర్సరీలున్నాయి.. మూడు లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అయినాసరే, ఈ రంగం అసంఘటితంగా ఉండటంతో అనేక ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తోంది. నర్సరీల వ్యవస్థను ఒక మౌలిక రంగంగా తీర్చిదిద్ది రైతులతో పాటు ఆ రంగంలో ఆసక్తి ఉన్న వారందరికీ ఉపయోగపడేలా నర్సరీ గ్రోయర్స్ అసోసియేషన్ విధి విధానాలను రూపకల్పన చేశారు.
నర్సరీ యాజమాన్యంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందించటం, గృహిణులకు మిద్దె సాగుపై అవగాహన, ప్రభుత్వ పథకాలను నర్సరీ రైతులకు చేరువ చేయటం, సహకార వ్యాపారం, రైతులకు కొత్త పంటలపై శిక్షణా శిబిరాలు, కార్పొరేటీకరణ నుంచి చిన్న ఉత్పత్తిదారులను కాపాడటం, పర్యావరణ పరిరక్షణ తదితర లక్ష్యాలతో ఆవిర్భవించిన అసోసియేషన్ ఆవిర్భావ సభకు ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. హార్చికల్చర్ కమిషనర్ ఎస్.ఎస్ శ్రీధర్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభిస్తుండగా, హార్టికల్చర్ అడిషనల్ డైరెక్టర్ వెబ్ సైట్ ను ఆవిష్కరించనున్నారు.