ap news

నెల్లూరులో అగ్నివీర్ రిక్రూట్ మెంట్

ఈనెల 15 నుంచి 26 వరకు ఎంపికలు 

ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఏర్పాట్లు 

ఈనెల 15 నుండి 26వ తేదీ వరకు జరుగుతున్న అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా ఎస్పీ సి హెచ్ విజయ రావు పోలీసులకు సూచించారు.బుధవారం ఉదయం నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా పోలీసు అధికారి గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ అధికారి కల్నల్ షహజాద్ కోహ్లీ తో కలసి సైనిక సిబ్బంది, పోలీసులు, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందితో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారి మాట్లాడుతూ అగ్నివీర్ ఎంపికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాలు గుంటూరు జోన్ ప్రాంతంలోని అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ఎంపికలు జిల్లాలో జరుగుతున్నాయన్నారు. ఆర్మీ ఎంపికల కోసం వచ్చే అభ్యర్థులకు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో ఎవరు ముందు వస్తే వారికి టోకెన్లు ఇవ్వాలన్నారు. వారికి మంచినీరు అందుబాటులో ఉంచడంతోపాటు పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఆర్మీ సిబ్బందికి పోలీసులు సంపూర్ణ సహకారం అందించాలన్నారు.
సైనిక సిబ్బంది చెప్పే సూచనలను విధిగా పాటించాలని వారితో సమన్వయం చేసుకొని ఎంపికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. పోలీసులు ఎవరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని విధుల్లో అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

పోలీసులకు సూచనలిస్తున్న గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కల్నల్ కోహ్లీ

గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కల్నల్ కోహ్లీ మాట్లాడుతూ కుటుంబంలోని అన్నదమ్ముల వలె ఒకరికొకరు సహకరించుకొని ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని విజయవంతం చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణతో పాటు స్టేడియంలో రెండు చోట్ల ఎప్పటికప్పుడు పారిశుధ్యం సజావుగా ఉండేలా చూడాలన్నారు. మంచినీటిని అందుబాటులో ఉంచాలన్నారు. సీసీటీవీ కెమెరాలు సజావుగా పనిచేసేలా చూడాలన్నారు. ఎలక్ట్రీషియన్, పబ్లిక్ అడ్రస్ సిస్టం, వైద్య బృందాలు నిరంతరం పనిచేసేలాగా అందుబాటులో ఉండాలన్నారు. ఆర్మీలో ఎంపిక కోసం వచ్చే అభ్యర్థులను తమ సోదరులు, పిల్లలుగా భావించి ఎలాంటి తారతమ్యం లేకుండా గౌరవప్రదంగా విధులు నిర్వహించాలన్నారు. ఆర్మడ్ రిజర్వ్ అదనపు ఎస్పీ శ్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్మీ ఎంపికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జన సమూహాన్ని నియంత్రించేందుకు గట్టి పోలీస్ బందోబస్తుతో సిద్ధంగా ఉన్నామన్నారు. సర్వజన ఆసుపత్రి ఆవరణలో పది కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక్కో కంపార్ట్మెంట్లో 300 మంది అభ్యర్థుల చొప్పున 3000 మందిని అనుమతించే ఏర్పాట్లు చేశామన్నారు. అభ్యర్థులు ఎవరు ముందు వస్తే వారికి మొదటగా టోకెన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.ఈ నెల 14వ తేదీ బుధవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత అభ్యర్థులను స్టేడియం లోకి అనుమతించడం జరుగుతుందన్నారు. ఆర్మీ ఎంపికల ప్రతి ప్రక్రియలోను పోలీసు సిబ్బంది ఆర్మీకి సహకారం అందిస్తారన్నారు.

సమావేశంలో పాల్గొన్న ఆర్మీ సిబ్బంది

ఈ సమావేశంలో ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్లు కల్నల్ దీపక్ కుమార్, కల్నల్ వినయ్ కుమార్, కల్నల్ సుమయ,సెట్నెల్ సీఈవో శ్రీ పుల్లయ్య, మునిసిపల్ ఈ.ఈ. శ్రీ, శేషగిరిరావు, ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీ మురళీకృష్ణ, డిఎస్పీలు శ్రీ గాంధీ, శ్రీ సుబహాన్ మునిసిపల్,రెవెన్యూ, విద్య, వైద్య శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *